సైకో రవి కేసును సాల్వ్ చేసి కిడ్నాపైన పిల్లలను కాపాడిన ఇన్స్పెక్టర్ రుద్రను అందరూ పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. ఇంతలో కంగారుగా రుద్ర దగ్గరికి వచ్చిన హెడ్‌కానిస్టేబుల్ రామస్వామి.. ‘సార్.. మీకు ఓ విషయం చెప్పాలి. కాస్త పక్కకు వస్తారా?’ అంటూ తీసుకుపోయాడు. పక్కకు వచ్చిన రుద్ర.. ఏమైందంటూ రామస్వామిని అడిగాడు. ముఖంమీద పట్టిన చెమటను తుడుచుకొంటూ.. ‘సార్.. సైకో బాడీ దొరికిన ఆ బేస్మెంట్లో మరొక శవం కూడా దొరికింది’ అంటూ బాంబు పేల్చాడు.
రామస్వామి చెప్పిన మాటతో ‘వాట్..?’ అంటూ ఆశ్చర్యపోతూ ఘటనాస్థలికి పరిగెత్తాడు రుద్ర. మంటల్లో బాగా కాలిపోయిన సైకో బాడీ పక్కనే కాలిపోయిన మరో మృతదేహం కూడా ఉన్నది. ఆనవాళ్లను బట్టి అది ఓ యువతి మృతదేహమని అర్థమైంది. దీంతో సైకోకు ఆమె ఏదైనా సాయం చేసిందా? అన్న అనుమానాలు రుద్రలో మొదలయ్యాయి. పోస్ట్‌మార్టం నిమిత్తం రెండు మృతదేహాలను హాస్పిటల్‌కు తీసుకెళ్లారు పోలీసులు.
మరుసటి రోజు… పదునైన ఆయుధంతో పొడవడం వల్లే ఆమె చనిపోయినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో తేలింది. ‘తనకు నిజంగా సహాయం చేస్తే, ఆమెను సైకో రవి ఎందుకు చంపుతాడు?’ ఇదే అనుమానం రుద్రకు వచ్చింది. దీంతో ఘటనాస్థలిలో సేకరించిన ఆధారాల నివేదికను ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి తెప్పించుకొన్నాడు. లాక్ చేసిన ఓ ఐరన్ బాక్స్ ఘటనాస్థలిలో లభ్యమైనట్టు ఆ రిపోర్ట్‌లో ఉన్నది. దాని సంగతేంటో తేల్చుకొందామని ల్యాబ్‌కు ప్రయాణమయ్యాడు రుద్ర.
‘ఆ బాక్స్‌లో ఏముంది.. ఆంటీ??’ ఫోరెన్సిక్ ఇంచార్జి జయని అడిగాడు రుద్ర. ఇన్స్పెక్టర్ తల్లి రూపకు జయ మంచి స్నేహితురాలు. ‘బాక్స్‌లో ఇంకో చిన్న బాక్స్‌తో పాటు మరో లెటర్ ఉందిరా’ అంటూ సమాధానం ఇచ్చిందామె. ‘లెటర్ దొరికితే మాకు సమాచారం ఇవ్వాలని తెలియదా? ఆంటీ’ అంటూ కోపంగా అన్నాడు రుద్ర. ఆ వెంటనే లెటర్ చదవడం ప్రారంభించాడు. ‘హలో రుద్రా.. నేనే సైకో రవిని. మొత్తానికి నా పజిల్స్‌ను సక్సెస్‌ఫుల్‌గా సాల్వ్ చేశావ్. ఇచ్చిన మాట ప్రకారం.. పిల్లలందరినీ విడిచిపెట్టాను అవునా?? అయితే, ఓడిపోయిన నేను నీకు దొరక్కుండా ఉండాలని ఎంతో ఆశపడ్డా. ఇంతలో ఇదెవ్వతో నా డెన్లోకి వచ్చింది. బాగా తెలివైన అమ్మాయిలాగే ఉన్నట్టుంది. అందుకే నా చేష్టలను బట్టి ఇట్టే నేను సైకోనని కనిపెట్టింది. దీంతో అప్పటికప్పుడు ఓ పదునైన ఆయుధంతో దీన్ని పొడిచి చంపా. దీన్ని పొడవగానే ఆ ఆయుధాన్ని ఆ రూమ్‌లోనే పడేశా.
ఇప్పుడు ఈ డ్రామా అంతా ఎందుకు చెప్తున్నానంటే.. బతికి ఉన్నప్పుడు నిన్ను మూడు చెరువుల నీళ్లు తాగించిన నేను.. చచ్చాక కూడా చుక్కలు చూపించాలని నిర్ణయించుకొన్నా. అందుకే.. మరొక పజిల్‌ను నీ ముందు పెడ్తున్నా.. ఏయ్ రుద్రా..! జాగ్రత్తగా విను. ఈ లెటర్ దొరికిన బాక్స్‌లో మరో చిన్న బాక్స్ ఉంటుంది. అది వాయిస్ సెన్సర్ కంట్రోల్డ్ డివైజ్‌తో లాక్ చేసి ఉంది. నువ్వు బాంబులతో పేల్చినా అది ఓపెన్ కాదు. టాక్టిక్స్ వాడి కోడ్‌ను డీబగ్ చేసినా కరెప్ట్ అయ్యి ఆ బాక్స్ నాశనమవుతుందే తప్ప అందులో ఉన్న అత్యంత కీలకమైన రహస్యం మాత్రం బయటపడదు. అందుకే పిచ్చి పనులు చేయకు. ఆ బాక్స్‌ను నువ్వు ఓపెన్ చెయ్యాలంటే ఒక్కటే మార్గం. డెన్లోకి వచ్చిన అమ్మాయిని నేను ఏ ఆయుధంతో పొడిచానో.. ఆ ఆయుధం పేరును ఇంగ్లిష్‌లో నువ్వు కరెక్ట్‌గా ఆ చిన్న బాక్స్ ముందుకు వచ్చి చెప్పాలి. అప్పుడు ఆ బాక్స్ ఓపెన్ అవుతుంది. తప్పు చెప్పావో.. ఈ సిటీలోని కోటిన్నర మంది ప్రాణాలు గాలిలో కలుస్తాయ్. మరో ముఖ్య విషయం.. నేను చనిపోయిన 24 గంటల్లోపు ఇదంతా జరగాలి. యువర్ టైమ్ స్టార్ట్ నౌ..’ అని ఆ లెటర్లో ఉంది. దీంతో ముఖంమీద పట్టిన చెమటను తుడుచుకొంటూ కుర్చీలో కూలబడ్డాడు రుద్ర.
అప్పటికే 22 గంటలు గడిచాయి. సైకో ఇచ్చిన టైమ్ దగ్గరపడుతున్నది. ‘ఘటనాస్థలిలో ఏదైనా పదునైన ఆయుధం దొరికిందా? ఆంటీ??’ అంటూ జయని అడిగాడు రుద్ర. ‘ఆ డెన్‌లో మా టీమ్ మొత్తం అంగుళం అంగుళం వెతికిందిరా. అయితే, సైకో చెప్పినట్టు ఏ ఆయుధమూ దొరకలేదు. పైగా.. ఆ చనిపోయిన అమ్మాయిని ఆయుధంతో కాకుండా మరోవిధంగా ఏమైనా చంపాడా? అని అనుకొందామంటే.. పదునైన ఆయుధంతో పొడవడంతోనే ఆ అమ్మాయి చనిపోయినట్టు పోస్ట్‌మార్టం నివేదికలో క్లియర్‌గా ఉన్నది. ఆ ఆయుధం కూడా కత్తిలా పదునైంది. అయితే, మెటల్ మాత్రం కాదు’ అని జయ చెప్తూ పోయింది. ‘ఐరన్ కాకపోతే మరేంటి ఆంటీ?’ అంటూ రుద్ర ప్రశ్నించాడు. ‘అసలు అది మెటీరియలే కాదురా.. ఒకవేళ ఏదైనా మెటల్, స్టీల్, గాజులాంటిదైతే రక్తంలో ఆనవాళ్లు దొరికేవి’ అంటూ తన రీసెర్చ్‌ను మొత్తం ముందుంచింది జయ. ‘ఒకవేళ, సైకోనే డెన్ బయటికి ఆ ఆయుధాన్ని విసిరేశాడేమో??’ అంటూ ప్రశ్న లేవనెత్తింది జయ. ‘లేదు ఆంటీ. ఆ సైకో ఇప్పటివరకూ అన్నీ నిజాలే చెప్పాడు. ఇప్పుడు కూడా నిజమే చెప్తున్నాడని నేను నమ్ముతున్నా. అమ్మాయిని పొడిచాక ఆ ఆయుధాన్ని ఆ రూమ్‌లోనే పడేశానని వాడు చెప్పాడు. అంటే అది నిజమే’ అని రుద్ర నిశ్చయంగా అన్నాడు.
ఇంతలో రుద్ర కజిన్ స్నేహిల్ అక్కడికి వచ్చాడు. ‘ఏరా రుద్ర.. సైకో కేసును చాలా తెలివిగా సాల్వ్ చేశావంట. సోషల్‌మీడియాలో మొత్తం నీ గురించే చర్చ’ అంటూనే జయను కూడా పలకరించాడు స్నేహిల్. ఇలా వాళ్లిద్దరూ మాట్లాడుకొంటూ ఉండగానే.. ‘ఒరే అన్నయ్యా.. నువ్వు ఇక్కడికి ఎందుకు వచ్చావో తెలియదు గానీ.. నిన్ను చూడగానే నాకు మాత్రం నీ పాత కేసు గుర్తొచ్చిందిరా. అది గుర్తు రాగానే ఈ కేసుకు మాంచి క్లూ దొరికిందిరా’ అని సంతోషంగా అరిచాడు రుద్ర. ‘ఏంట్రా?’ అని స్నేహిల్ అంటుండగానే.. ఆ పదునైన ఆయుధం ఏమిటో జయకు చెప్పాడు రుద్ర. ‘ఎక్స్లెంట్రా.. అది తప్ప ఇంకొకటి అయ్యే చాన్సే లేదు’ అంటూ జయ తీర్మానించేసింది. అసలేం జరుగుతున్నదో స్నేహిల్‌కు అర్థంకావట్లేదు. అప్పటికప్పుడు ఫోరెన్సిక్ ల్యాబ్‌లో తలుపులన్నిటిని మూసేసిన రుద్ర.. ఆ చిన్న బాక్స్ ముందు ఇంగ్లిష్‌లో ఆ ఆయుధం పేరు చెప్పాడు. ఆశ్చర్యం.. ఆ బాక్స్ తెరుచుకొంది. అందులో రెడ్ కలర్లో ఓ లెటర్ ఉంది. దాన్ని తెరిచి రుద్ర, జయ, స్నేహిల్ ముగ్గురూ కలిసి చదివారు. అంతే.. వారికింద భూకంపం వచ్చినంత పనైంది. అది పక్కనపెడితే.. యువతిని సైకో ఏ ఆయుధంతో పొడిచినట్టు? ఆ ఆయుధాన్ని పోస్ట్‌మార్టంలో ఎందుకు గుర్తించలేకపోయారు? డెన్‌లో ఆ ఆయుధాన్ని ఫోరెన్సిక్ టీమ్ ఎందుకు రికవరీ చేయలేకపోయింది?
సమాధానం:
డెన్లోకి వచ్చిన యువతిని పదునైన ఐస్ గడ్డతో సైకో పొడిచి చంపాడు. కాసేపటికి అది కరిగిపోవడంతో ఆ ఆయుధం ఫోరెన్సిక్ టీమ్‌కి దొరకలేదు. మెటల్, గాజు కాకపోవడంతో మృతురాలి డెడ్బాడీలోనూ దాని ఆనవాళ్లు కనిపించలేదు. అందుకే పోస్ట్‌మార్టంలోనూ తేలలేదు. కాగా.. గతంలో ఈ ఐస్ క్యూబ్‌కు సంబంధించిన ఓ కేసులోనే స్నేహిల్ను రుద్ర రక్షించాడు. స్నేహిల్ను చూడగానే అది గుర్తొచ్చే.. క్లూ దొరికిందని అరిచాడు రుద్ర….?
-రాజశేఖర్ కడవేర్గు