నాకు గుర్తున్నంత వరకూ.. నాన్న ఇష్టపడి తనకోసం కొనుక్కున్న ఫ్యాన్సీ వస్తువు రేడియోనే! నాకు ఆరేళ్ల వయసు ఉన్నప్పుడు నాన్నకు పంట తాలూకు డబ్బులేవో.. ఖర్చులు పోనూ కొంచెం మిగిలాయట. అప్పుడు నాన్న వరంగల్‌కు వెళ్లి మాకు బట్టలు కొందామనుకున్నాడట.
హన్మకొండలో ఉన్న మా మేనత్త ఇంటికి నాన్న వెళ్లినప్పుడు.. మాటల మధ్యలో మామయ్య “నీకు రేడియో అంటే ఇష్టం గద! గ్రామపంచాయతీ రేడియోల ఒక్క స్టేషనే ఒస్తది. నీకే ఒక రేడియో ఉంటె రెండు మూడు స్టేషన్లల్ల ప్రోగ్రాములు ఇనొచ్చు” అని చెప్పారట. అంతేకాదు.. నాన్నను బలవంతంగా వరంగల్‌లో రేడియో షాపులోకి తీసుకెళ్లి.. ఫిలిప్స్ రేడియో కొనిపించారట. అలా మా ఇంట్లోకి రేడియో వచ్చింది. చిన్నపిల్లలకు అందుబాటులో ఉండకూడదని ఓ చెక్క షెల్ఫ్ చేయించి, దానిని ఉత్తరపు మనసాలలో గట్టిగా ఉన్న ఓ గోడకు మేకులతో ఫిక్స్ చేసి, దానిమీద రేడియో పెట్టారు. ఆ రేడియోకు ఓ లెదర్ కవర్ కూడా ఉండేది. తళతళ మెరుస్తూ ఉన్న రేడియో వచ్చాక.. మా ఇంటికే కొత్త అందం వచ్చినట్లయింది.
రేడియో నాలుగు పెద్ద బ్యాటరీ సెల్స్‌తో నడిచేది. ఎక్కువగా ‘ఎవరెడీ’ బ్యాటరీలు కొనేవాళ్లు. అయితే ఎంత పొదుపుగా వాడినా కొన్నాళ్లకు బ్యాటరీల పని అయిపోతుంది కదా! అప్పుడు రేడియో కుయ్యో కుయ్యోమని వస్తూ ఆగిపోవడమో, గుసగుసగా మాట్లాడినట్టు రావడమో చేసేది. కొత్త బ్యాటరీలు కొనాలంటే కొన్నిసార్లు నాన్న దగ్గర సమయానికి డబ్బులుండేవి కావు. ఏదో కూరగాయలో పళ్లో కొనడానికైతే వడ్లో మక్కజొన్నలో ఇస్తాం గానీ, సెల్స్ కొనాలంటే నగదు ఇవ్వాల్సిందే! అందుకని ఎవరో చెబితే విన్న జ్ఞాపకంతో మేము ఒకసారి నాన్న పర్మిషన్తో రేడియోలోని సెల్స్ తీసి ఓ రోజంతా ఎండలో ఆరబెట్టాం. మళ్లీ సాయంత్రం రేడియోలో వాటిని వేయగానే ఖంగుఖంగుమని ధాటిగా రేడియో మోగుతుండేది. నాన్న మహా సంతోష పడిపోయి.. “అరె! మస్తు ఉపాయం చేసిన్రు. బాగనే ఒస్తున్నది గద! ఇట్ల ఎన్నాళ్లు ఒస్తయి ఇవి?! ఎండల పెడితె ఎప్పటికి ఒస్తే బాగుండు!” అన్నాడు. పిచ్చి నాన్న.. వాటి లైఫ్ అయిపోతుందని తెలియదు. ఇంకొన్నాళ్లు అలాగే నడిపిస్తే వాటిల్లోంచి ఏదో కెమికల్ కారేది. ఆలోగా నాన్న ఎట్లాగో తిప్పలు పడి సెల్స్ కొనుక్కొచ్చి వేసేవాడు.
రేడియో కొన్నప్పటికీ ఉదయంపూట పంచాయతీ రేడియోనే వినేవాళ్లం. మా కోసం శనివారం, ఆదివారం రోజుల్లో.. ‘బాలానందం’ ప్రోగ్రాం పెట్టేవాడు నాన్న. ‘రారండోయ్.. రారండోయ్.. పిల్లల్లారా రారండోయ్!’ అనే పాట రాగానే మమ్మల్నే పిలిచినట్టుగా భావించి రేడియో దగ్గర కూచుని ఒక్క మాటా, పాటా పొల్లుపోకుండా వినేవాళ్లం.
ఆదివారం మధ్యాహ్నం మూడు గంటలకు ‘రేడియో సంక్షిప్త శబ్ద చిత్రం’ అనే శీర్షికతో ఏదైనా సినిమాను గంటసేపు వినిపించేవారు. “సినిమా వొస్తుంది”.. అంటూ సంతోషంగా వినేవాళ్లం. నాన్న అసలెప్పుడూ ఏ సినిమా కూడా థియేటర్లో చూసిన జ్ఞాపకం మాకు లేదు. ఎప్పుడైనా ఒకటో రెండో చూసి ఉంటాడేమో! ఇక రేడియోలోనూ ఇంట్లో అతిథులెవ్వరూ లేకపోతేనో, బాగుందని పేరున్న సినిమా అయితేనో వినేవాడు.
నాన్నకు ఎంతో ఇష్టమైనవి రంగస్థల పద్యాలు. రేడియోలో రఘురామయ్య, సూరిబాబు, కనకం, బందా వంటివారి పద్యాలు ఎంతో శ్రద్ధగా విని సంతోషించేవాడు. ఘంటసాల, మాధవపెద్ది వంటివారు పాడిన సినీ పద్యాలు కూడా నచ్చేవి. రేడియో నాటికలు కూడా నాన్నకు నచ్చేవి. అమ్మకు కూడా. ముఖ్యంగా ‘మద్రాసు కేంద్ర సమర్పణ’ అనేవి మరీ బావుండేవి. చాలా నాటికల్లో శారదా శ్రీనివాసన్ గారి గొంతు, భావ ప్రకటన ఎంతగానో నచ్చేవి. జీడిగుంట రామచంద్ర మూర్తి, ఇలియాస్, జ్యోత్స్న వంటి వారు గొంతుల ద్వారానే సుపరిచితులు.
నాన్నకు వార్తలు వినడం కూడా ఇష్టమే. జాతీయ వార్తల్ని అద్దంకి మన్నార్, ఏడిద గోపాలరావు, పన్యాల రంగనాథరావు, జోలెపాళెం మంగమ్మ, వాడ్రేవు పురుషోత్తం గార్లు చదివేవారు. “అద్దంకి మన్నార్ కొంకు కొసరు లేకుండ వార్తలు బాగ చదువుతడు” అని అమ్మ అంటే.. “ఇదివరకు కొంగర జగ్గయ్య కూడ అట్లనే చదువుతుండే!” అనేవాడు నాన్న. ఇక ప్రాంతీయ వార్తలైతే.. మామిళ్లపల్లి రాజ్యలక్ష్మి, మాడపాటి సత్యవతి, పార్వతీ ప్రసాద్ గార్లు ఎక్కువగా చదివేవారు. “వాండ్ల తెలుగు చూసి.. తెలుగు ఎట్ల చదువాల్నో నేర్చుకోండి” అనేది అమ్మ మాతో.
రేడియో సిలోన్ మరొక మరపురాని జ్ఞాపకం. మధ్యాహ్నం పూట.. ‘నమస్కారం! ఇది శ్రీలంక ఆసియా సేవా కేంద్రము, నేను మీనాక్షి పొన్నుదురైని మాట్లాడుతున్నాను’ అనే మాటలు చిరపరిచితాలు. ‘మీనాక్షి అక్కయ్యా!’ అంటూ ఎంతోమంది ఆ ప్రోగ్రాంకు ఉత్తరాలు రాసేవారు. ఆమె శ్రోతలు మెచ్చే సినిమా పాటలు వినిపించేవారు. అందులో.. ‘మహాబలుడు’ చిత్రంలోని ‘ఓ ఓ ఓ.. విశాల గగనములో చందమామా, ప్రశాంత సమయములో కలువలేమా!’అనేపాట మాత్రం తప్పనిసరి. వారానికి ఓసారి వచ్చే ‘శ్రోతల ఉత్తరాల కార్యక్రమం’ కూడా వదిలేవాళ్లం కాదు. జగిత్యాల పోచమ్మవాడ నుంచి అత్తినేని రాజమల్లయ్య, యాదగిరిగుట్ట నుంచి యాలాల కాశీనాథ్, యాలాల సుజాత అనేవారు దాదాపు అన్ని ప్రోగ్రామ్స్కూ ఉత్తరాలు రాసే శ్రోతలు.
ఆ ఫిలిప్స్ రేడియో ఏమాత్రం రిపేర్లు లేకుండా మా ఇంట్లో ఎన్నో ఏళ్లు పనిచేసింది. మేము డబ్భు ఆరులో కొత్త ఇంటికి వచ్చాక కూడా రేడియో వినేవాళ్లం. ముఖ్యంగా వేసవి రాత్రుల్లో ఆరుబయట మంచాలేసుకుని పడుకున్నప్పుడు.. ఆ రేడియోను బయట పెట్టుకుని రాత్రిపూట వచ్చే పాటలు వింటూ నిద్రపోయేవాళ్లం. మా ఇంటికి 1984లో తెలుపు – నలుపు టీవీ వచ్చాక.. రేడియో చిన్నబోయి మావంక దీనంగా చూస్తున్నట్టు అనిపించేది.
-నెల్లుట్ల రమాదేవి
రచయిత్రి