చిన్నప్పట్నుంచీ నాకు ఎంతో ఇష్టమైన పండుగ.. బతుకమ్మ! ఇందుకు రెండే కారణాలు. ఒకటి, ఎండాకాలం సెలవుల తర్వాత మళ్లీ దాదాపు పది పన్నెండు రోజులు బడి గోల లేకుండా సెలవులొస్తాయని. రెండవది, మిగతా పండుగల్లా కాకుండా.. పూజలూ, నోములూ, వంటలూ అయ్యేదాకా ముట్టుకోవద్దు అనడాలూ, పెద్దవాళ్ల ప్రమేయాలు లేకుండా కేవలం పిల్లలమే.. అదికూడా ఒక ఆటలా చేసుకునే పండుగ అని కూడా!
బాల్యంలో నాకు గుర్తున్న మూడో ఏటినుంచీ.. పదిహేనేళ్లు వచ్చేదాకా ప్రతిసారీ దసరా సెలవులకు ‘ఛలో బమ్మెర’ అంటూ వెళ్లిపోయేవాళ్లం. మా అమ్మ.. రోజుల పిల్లగా ఉన్నప్పుడే వాళ్ల తల్లి చనిపోయిందనీ, తాతా, మేనమామల దగ్గరే పెరిగిందనీ.. ఆమెకు అది అమ్మమ్మగారిల్లు అనీ మాకు చాలా రోజులవరకు తెలియదు. మాకూ అదే అమ్మమ్మ గారిల్లు. క్వార్టర్లీ ఎగ్జామ్స్ ఆఖరి రోజున.. ‘రేపట్నుంచి సెలవులు’ అని క్లాస్లో నోటీస్ రాగానే.. నా గుండెలో ఎద్దుల గంటలు మోగేవి. మీరు సరిగ్గానే చదివారు.. గుడి గంటలు కావు. ఎద్దుల గంటలే! పెతరమాసను మా ఊర్లో చేసుకునే వాళ్లం.
ఆ తెల్లవారే బమ్మెర నుంచి మాకోసం సవారీ కచ్చడం వచ్చేది. మేము తొందరగా భోజనం చేసి, బండివాడు కూడా తిన్నాక.. పెట్టే బేడా సర్దుకుని బయల్దేరే వాళ్లం. సరిగ్గా మధ్యదూరంలో ఇప్పగూడెం దగ్గర దట్టంగా పెరిగిన చెట్ల మధ్య.. నిమ్మలోళ్ల బావి ఉండేది. అక్కడ ఎడ్లకు నీళ్లకోసం బండిని ఆపేవారు. మాకు అప్పటికే జఠరాగ్ని దహించేది. అమ్మ ఒక స్టీల్ డబ్బా తీసి, అందులోంచి ఇంటి దగ్గర చేసి తెచ్చిన గోధుమ
రొట్టెల పైన వెన్న రాసి గుండ్రంగా చుట్టి నాకూ, అక్కకూ ఇచ్చేది. తను ఎప్పుడూ తిన్నట్టు గుర్తు లేదు. అజ్ఞానాంధకారంలో ఉండే మేము.. ఎన్నడూ ‘నువ్వు తిన్నవా అమ్మా?’ అని అడిగినట్లు కూడా గుర్తులేదు. ఒకసారి జోరువానలో మధ్యలో ఒక వాగు పొంగుతూ ఉంటే.. అందులోంచి కూడా సాహసం చేసి బండివాడు మమ్మల్ని తీసుకుపోయిన జ్ఞాపకం.
బమ్మెర ఊర్లో అడుగుపెట్టి.. గడీ గోడలు కనిపించగానే మా మనసులు అంతకంటే ముందే పోయి అక్కడ వాలేవి. మా ఆడ కజిన్స్ అందరూ కలిసి మేమంతా ఇరవయ్యొక్క మందిమి ఉండేవాళ్లం. మాయాబజార్ సినిమాలోలా ‘అలమలం అక్కా! అలమలం చెల్లే!’ అనుకోకపోయినా.. ఇంచుమించు అంతటి స్వాగత
సన్నాహాలు ఉండేవి.
ఇక వారం రోజులు ఎడతెగని ఆటలు ఆడేవాళ్లం. సద్దుల బతుకమ్మ రోజు కొండంరాజు అనే ఆయన వచ్చి.. అయిదారు బతుకమ్మలను పేర్చేవాడు.‘ఇక్కడ నిల్చోండమ్మా! మీ ఎత్తు బతుకమ్మ పేరుస్తా!’ అంటూ పిల్చేవాడు. మాలో ఎవరు ముందు తయారవుతే వాళ్లు వెళ్లి, ఆయన ముందు నిలబడేవాళ్లం. అదో ఆనందం! సాయంత్రం మూడింటి నుంచే మమ్మల్ని తయారు చేసేవాళ్లు. ఒకళ్లమా, ఇద్దరమా.. ఇందరి తలలుదువ్వి, నాగరం, జడపువ్వు, జడకుచ్చులు లాంటి ఆభరణాలతో కూడిన పూలజడలు వేసి, లంగా జాకెట్లు వేసి.. ఆనక అమ్మ, చిన్నమ్మలూ, అత్తమ్మ తయారయేవాళ్లు. ఆ ఒక్కరోజే చెరువుకు వెళ్లేవాళ్లం. మేము బయటికి వచ్చేసరికే.. గడీ బయట ఊరి ఆడవాళ్లంతా తలలపైన బతుకమ్మలతో సిద్ధంగా ఉండేవారు.
తరువాత రోజుల్లో బమ్మెరలో వాళ్లెవరూ ఉండక పోవడం వల్ల మేము వెళ్లడం తగ్గిపోయింది. మా ఊర్లోనే పండుగ చేసుకునే వాళ్లం. మాకు పాటలన్నీ మా నానమ్మే నేర్పేది. పెతరమాసకు పదిహేను రోజుల ముందు బొడ్డెమ్మల పున్నమికే పుట్టమన్ను తెప్పించి పీటమీద బొడ్డెమ్మను చేసేది నానమ్మ. ఇంట్లోనే మేము చుట్టూ తిరిగి ఆడుతుంటే.. ఆమె శ్రావ్యమైన గొంతుతో పాటలు పాడేది. సద్దుల పండుగ రోజు పులిహోరా, చిత్రాన్నాలూ, గారెలు, పాయసం లాంటివి చేస్తూ అమ్మ వంటింట్లో బిజీ! ఇక తలంటు అనే అతిపెద్ద గండం (నిజంగా గండమే! నాకు పేద్ద జుట్టు ఉండేది) దాటాక.. బతుకమ్మ కోసం పూలు సేకరించే పనిలో పడేవాళ్లం నేనూ, అక్కా. అయితే, మాకంత అవకాశం లేకుండా మా నానమ్మ పొద్దున్నే పూలు తెంపి, వాడిపోకుండా వాటిపైన తడిబట్ట కప్పి ఉంచేది. నానమ్మ బతుకమ్మ పేరుస్తుంటే పువ్వులన్నీ కట్టలు కట్టి ఇచ్చేవాడు నాన. నానమ్మ పోయాక నేను, అక్కా.. అందులో కొంత ప్రావీణ్యం సంపాదించాం కూడా! చెదిరిపోకుండా, ఒకే తీరుగా, రకరకాల పూల కలయికతో అందంగా పెద్ద బతుకమ్మను పేర్చడం నిజంగా ఒక కళే. అందరి బతుకమ్మల కన్నా మా ఇంటి బతుకమ్మ అందంగా వచ్చేది. ఇప్పటికి కూడా! బతుకమ్మ పెద్దగా ఉండటం, మనదే బాగుండాలని అనుకోవడం ఒక ప్రిస్టేజ్ ఇష్యూ.
డప్పులవాళ్లు వాయిస్తుంటే ఊరేగింపుగా చెరువు కట్టకు వెళ్లడం గొప్ప మజాగా ఉండేది. మేమంతా ఓ పక్కగా నిలబడి ఉంటే.. పెద్దవాళ్లంతా బతుకమ్మలు ఆడేవాళ్లు. కానీ, మా దృష్టంతా.. ఎంపలి చెట్టూ, ఏదో మంత్రం ఏమీ లేకుండా లయ తప్పని అడుగులతో వంగి లేస్తూ, చప్పట్లు కొడుతూ గుండ్రంగా తిరుగుతూ బతుకమ్మ ఆడే ఇతర బృందాల మీద ఉండేది. కొన్నాళ్లు సహించాక తిరుగుబాటు ప్రకటించుకుని వాళ్లలో కలిసి ఆడేవాళ్లం. మా పొలం పనులు చూసే లచ్చీ, ఎంకటీ, అరుణా, రాజీ.. ‘రాండి దొర్సానీ!’ అంటూ మమ్మల్ని తమ బృందంలో కలుపుకొనేవారు. ఒక జోష్తో ఆడీ ఆడీ.. అలసిపోయి.. అప్పుడు వాళ్లు ‘గంగదారి వాగులో వెలదు మాను, వెలదు మాను.. సొమ్ముల పెట్టెలు పోయెరో గంగదారి’ అని శ్రావ్యంగా పాడుతూ ఇంటిదారి పడుతున్నప్పుడు.. మేము మళ్లీ వచ్చి మా నిలబడే బ్యాచ్లో వచ్చిచేరేవాళ్లం.
-నెల్లుట్ల రమాదేవి , రచయిత్రి