గునుగూ పూలు కోయంగ.. గునుగూ పూలు కోయంగ.. గువ్వా లాలిరాయే.. అంటూ ఆప్యాయంగా పాడుకుంటారు జానపదులు. పాటల్లోనేకాదు బతుకమ్మ పేర్పులోనూ గునుగు పూల స్థానం ప్రత్యేకం. తెలుపు, గులాబీ వర్ణాల్లో ఉండే వీటికి మరింత అందం తీసుకువచ్చేందుకు ఎరుపు, ఆకుపచ్చ, నీలంలాంటి రంగుల్లో ముంచి తీస్తారు పడతులు. అయితే అలాంటి నిండైన రంగుల్లోనూ గునుగుపూలు పూస్తాయని మీకు తెలుసా? అంతేకాదు చిక్కటి గులాల్ రంగులో మన దగ్గర దొరికే సీతజడ పూలూ విభిన్న వర్ణాల్లో విరబూస్తాయని విన్నారా? వినేందుకు వింతగా ఉన్నా ఈ చిత్రాలన్నీ కొమ్మకు పూసినవే!
బతుకమ్మను పేర్చేందుకు వాడే పువ్వుల్లో తంగేడు తర్వాత గునుగుదే ప్రత్యేక స్థానం. అందుకే దాదాపు ప్రతి బతుకమ్మలోనూ గునుగుపువ్వు కనిపిస్తుంది. పొలాల గట్ల వెంటా, చేను చెలకల్లో పెరిగే ఈ చెట్టు పూలు పెట్టడం అన్నది జానపదుల ఆచారాలకు కొనసాగింపుగా చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం బతుకమ్మను మరింత అందంగా తీర్చిదిద్దడం కోసం తెలుపు, లేత గులాబీ వర్ణాల కలబోతగా ఉండే గునుగు పువ్వులకు కృత్రిమ రంగులను అద్దుతున్నారు. గునుగుపూలను కట్టలుగా కట్టి పొడి రంగులను నీళ్లలో కలిపి, ఆ రంగు నీళ్లలో ముంచి తీసి ఆరబెట్టి బతుకమ్మను పేర్చేందుకు వాడుతున్నారు. ఇలాంటి ఆలోచనలు మనకు వస్తాయని ముందే ఊహించాడో ఏమో పసుపు, ఎరుపు, గులాబీ, నారింజలాంటి నిండైన వర్ణాల్లో వీటిని సృష్టించాడు దేవుడు. గునుగుతో పాటు మనం బతుకమ్మలో వాడే సీతమ్మవారి జడబంతి పూలు లేదా సీతజడ పూలుగా పిలిచే పూలలోనూ ఆకుపచ్చ, గులాబీలాంటి రంగులతోపాటు ఎరుపు, పసుపు, గులాబీ పసుపులాంటి కలనేత రంగులూ కనువిందు చేస్తాయి. ఈ జాతిపూలను ‘సెలోషియా’లుగా పిలుస్తారు. వీటిలోని రకాలే గునుగు, సీతజడ పూలన్నమాట. భారత్, చైనాల్లో ఇవి ఎక్కువగా పూస్తాయి. అమెజాన్లాంటి వెబ్సైట్లలో ఈ గింజలను అమ్ముతున్నారు. వీటిని తెప్పించుకుంటే ఎంచక్కా రంగుల పూలు మనమూ పండించి అందర్నీ ఆశ్చర్యపరచొచ్చు. వాటి సహజ అందాన్ని ఆస్వాదించొచ్చు. నిజంగా ప్రకృతి ఎంత చిత్రమో కదూ!