e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Monday, August 2, 2021
Home బతుకమ్మ పుస్తక సమీక్ష

పుస్తక సమీక్ష

సినిమాద్భుతం!

సినిమా మాటలు నేర్చుకున్న తొలిదశలో ‘కళ కళకోసమే/ వినోదంకోసమే’ లేదా ‘వికాసం కోసమే’ అన్న విషయాలలో వాద వివాదాలుండేవి. అప్పట్లో రచయితలు, దర్శకనిర్మాతలు, నటీనటులూ ‘కాసు’ కోసమేగాక కాసింత ‘కళ’, ‘ప్రగతి’ అనే ధోరణులతో ఆలోచించేవారు, ఇప్పుడు ఏకవాదమే. సినిమా వ్యాపారం. లాభార్జనకే లక్ష్యమని తీసేవారికీ, చేసేవారికీ, చూసేవారికీ నమ్మకం ఏర్పడిపోయింది. లాభం కోరేవాడెప్పుడూ ప్రచారంపైనే దృష్టిపెడతాడు. అప్పనంగా ఉపగ్రహ ఛానల్స్‌ రావడం.. అవీ లాభాలకోసమే కావడంతో పరస్పరాధారితంగా సినిమాలకు ఊకదంపుడు ప్రచారం దొరుకుతున్నది. అసలు ‘సరుకు’లో సత్తా లేనప్పుడు ఆదరించడానికి ప్రేక్షకుడేం పిచ్చోడు కాడు. తిప్పికొడతాడు.. అందులో అభిమాన నటులవా, కాదా అన్నది చూడడు. పెద్ద, చిన్న సినిమాలంటూ తేడా చూపడు. ఇదే విషయాన్ని డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌ ఈ పుస్తకంలో సుస్పష్టంగా చెప్పారు. ఇవేగాక దాశరథి, వేటూరి పాటల గురించి, ఎన్టీయార్‌ రాజకీయ ప్రవేశ విశేషాల గురించి చక్కగా చెప్పారు. అక్షర నక్షత్రాల్లా ఇరవయ్యేడు ఖండికల్ని ముచ్చటగా మన ముందుకు తెచ్చారు రచయిత. ముఖచిత్రం ఆకర్షణీయంగా ఉంది. సినీప్రియులు, పాత్రికేయులకు ఉపయుక్తం ఈ పుస్తకం.

పుస్తక సమీక్ష
- Advertisement -

అల్లాఉద్దీన్‌ సినిమాద్భుతం
రచన: డా॥నాగసూరి వేణుగోపాల్‌
పేజీలు 143, వెల : రూ.125
ప్రతులకు: నవోదయ, కాచిగూడ,
హైదరాబాద్‌ (040- 24652387).
విజ్ఞాన ప్రచురణలు, నెల్లూరు (9440503061).
రచయిత: 9440732392

సరళం సుందరం

దీదీ పేరు దేశమంతా మార్మోగుతున్నదిప్పుడు. ఎన్నికల వేళ నుంచి రెండురోజులకు ఒకసారైనా మమత ఉగ్రరూపం ప్రసార మాధ్యమాల్లో కనిపిస్తూనే ఉంది. ఆమె సునిశిత విమర్శలు వినిపిస్తూనే ఉన్నాయి. ఉద్దండులతో పోటీపడి తలపండిన రాజకీయవేత్త అయింది మమత. చాలామందికి తెలియని మరోకోణం ఆమె మంచి కవయిత్రి. వంగదేశంలో పుట్టినందుకు కాబోలు, సాహితీ ప్రియురాలైంది. సవాళ్లు విసరడంలోనే కాదు, సందర్భోచితంగా కవితలు రాయడంలోనూ ఆమె దిట్ట. 1995లోనే ‘ఉపలబ్ధి’ పేరుతో మమత రాసిన బెంగాలీ కవితల సంపుటి విడుదలైంది. ఆమె కవితా సంపుటాలలో ‘నదీమ’ విమర్శకుల ప్రశంసలు సైతం అందుకుంది. పైకి కర్కశంగా కనిపించే మమతలో ఎన్ని మమతానురాగాలు ఉన్నాయో ఆమె కవితలే చెబుతాయి. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని, ప్రత్యర్థికి అర్థం కాని ప్రశ్నగా నిలిచిన ఈ హ్యాట్రిక్‌ ముఖ్యమంత్రి మనసులోని సందేహాలెన్నో ఆమె కవితల్లో ప్రతిఫలిస్తాయి. వాటికి సమాధానాలూ అందులోనే దొరుకుతాయి. మమత రాసిన కవితల్లోని కొన్నిటి సమాహారమే ‘సరళ సుందర సునిశిత మమత’. ఆమె బెంగాలీలో రాసిన అందమైన కవితలను ఏర్చి కూర్చి అంతే సరళంగా, సునిశితంగా అనువదించారు రచయిత్రి సామాన్య. ఇందులోని ప్రతీ కవిత మమతా బెనర్జీని పాఠకులకు కొత్తగా, మరింత స్పష్టంగా పరిచయం చేస్తుందనడంలో సందేహం లేదు.

పుస్తక సమీక్ష

సరళ సుందర సునిశిత మమత
(మమతా బెనర్జీ కవిత్వం)
అనువాదం: సామాన్య
పేజీలు: 117, వెల: రూ.100
ప్రతులకు: 98487 87284

పిల్లల కోసం
బాలల కోసం వస్తున్న పుస్తకాలు చాలా తక్కువ. పిల్లలను అలరించే, చదివించే రచనలు అందుబాటులో ఉంటే, ఈ తరంలోనూ పఠనాసక్తిని పెంచవచ్చు. ఈ ప్రయత్నంలో భాగంగా వచ్చిన బాలల కథాసంపుటి ‘ఎత్తు పెరిగిన తాత’. అందమైన బొమ్మలతో ముస్తాబైన ఈ పుస్తకం శీర్షికలోనే కొత్తదనం, చదివించే లక్షణం ఉంది. ఇందులో ఉన్నవన్నీ చిన్నచిన్న కథలే. అందమైన కథలే. చదివేకొద్దీ చదవాలనిపించే కథలే. పిల్లలకు చక్కటి సందేశాన్నిచ్చేవే. ప్రతి కథా చదువుతున్నంత సేపూ కండ్లముందు కదలాడుతుంది. ఆయా పాత్రలు, వాటి వైఖరులు.. అన్నీ మనోఫలకంపై సాక్షాత్కరించేలా రాశారు రచయిత విద్వాన్‌ చొప్ప వీరభద్రప్ప. చక్కటి పల్లెవాతావరణాన్ని పరిచయం చేస్తూ, భాషా పరిమళాలను పంచుతూ 20 కథలతో చిన్నారులకు వినోద, విజ్ఞాన నిధిని అందించారు. ‘ఎవరి గొప్ప వారిది’, ‘పొరుగుతో అనుబంధం’, ‘తుంటరి స్నేహం’, ‘తప్పుడు సలహా’ తదితర కథలన్నీ చందమామ కథలంత హాయిగా సాగిపోతూ.. మంచి విలువలు చెబుతాయి. పిల్లలకు మౌలిక గుణాలను నేర్పించడంలో, వారి వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దడంలో ఈ కథలు తోడ్పడుతాయనడంలో సందేహం లేదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఈ చిన్నకథల పుస్తకం పిల్లలకు పెద్దబాలశిక్షలా ప్రయోజనం కలిగిస్తుంది.

పుస్తక సమీక్ష

ఎత్తు పెరిగిన తాత
రచన: విద్వాన్‌ చొప్ప వీరభద్రప్ప
పేజీలు: 80, వెల: రూ.100
ప్రతులకు: పాలపిట్ట బుక్స్‌- 040 2767 8430
[email protected]

-చంద్రప్రతాప్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
పుస్తక సమీక్ష
పుస్తక సమీక్ష
పుస్తక సమీక్ష

ట్రెండింగ్‌

Advertisement