e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, July 31, 2021
Home బతుకమ్మ తొలి తెలంగాణ సినీగేయ రచయిత్రి ‘శ్రేష్ఠ’

తొలి తెలంగాణ సినీగేయ రచయిత్రి ‘శ్రేష్ఠ’

తొలి తెలంగాణ సినీగేయ రచయిత్రి ‘శ్రేష్ఠ’

ఆమె కలం పడితే చాలు, పాటలు ఏరులై ప్రవహిస్తాయి. పండు వెన్నెల తోటలై పరిమళిస్తాయి.అందమైన పదాలు, స్వచ్ఛమైన భావాలు ఆమె పాటల్లో పరవళ్లు తొక్కుతాయి. ప్రేమ గేయాలైనా, రొమాంటిక్‌ గీతాలైనా ఆమె కలానికి ‘సలాం’ అంటాయి. ఆమే యువ కవయిత్రి, సినీగేయ రచయిత్రి శ్రేష్ఠ.

తెలుగు సినీరంగంలో ఇప్పటి వరకు గేయ రచయితలే ఉన్నారు. రచయిత్రులు మాత్రం తక్కువే. ఒకరో ఇద్దరో ఉన్నా.. ఒకటి రెండు పాటలు రాసి కనుమరుగైన వాళ్లే. అందులోనూ తెలంగాణనుంచి వచ్చినవాళ్లు అరుదు. ఇప్పుడిప్పుడే సినీరంగంలోకి అడుగుపెడుతూ తమ ప్రతిభను చాటుతున్నారు. అద్భుతమైన పాటలు అందిస్తూ ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగుతున్నారు. అలాంటి వారిలో శ్రేష్ఠ ఒకరు.

- Advertisement -

తొలి తెలంగాణ సినీగేయ రచయిత్రిగా సరికొత్త అధ్యాయాన్ని సృష్టించిన శ్రేష్ఠ స్వస్థలం మంచిర్యాల. తల్లిదండ్రులు చంద్రకళ, జాన్‌ శామ్యూల్‌ వెస్లీ. 1986 ఆగస్టు 30న జన్మించిన శ్రేష్ఠ, బీకాం తర్వాత ఎల్‌ఎల్‌బీ పట్టా అందుకున్నారు. ఆమె తాత వెంకట కిషన్‌ మంచి గాయకుడు. అందుకే, చిన్నప్పటి నుంచే పాటలు రాయడం, పాడటం అలవాటైంది. విద్యార్థి దశలో ‘మై కాలేజ్‌ లైఫ్‌’ అనే కవితా సంపుటిని ప్రచురించారు. కవయిత్రిగా తన ప్రతిభా పాటవాలేంటో మొదటి సంపుటితోనే నిరూపించుకున్నారు.

‘తొలి’ అడుగుతోనే ‘అవార్డు’
దర్శకుడు పి.సునీల్‌ కుమార్‌రెడ్డి పరిచయంతో 2012లో వచ్చిన ‘ఒక రొమాంటిక్‌ క్రైమ్‌ కథ’తో చిత్రసీమలో తొలి అడుగు వేశారు శ్రేష్ఠ. ఈ సినిమాలోని అన్ని పాటలనూ రాసే అవకాశాన్ని దక్కించుకున్నారు. ‘ఏంటో మరి ఈ అల్లరి.. గుండెల్లో పుట్టే లాహిరి.. వింటే మరి నీ సంగతి చూపుల్తో దోచావే మది’ అనే ప్రణయగీతంతో యువతరం మనసులు దోచేశారు. మనసులో తొలిప్రేమ చిగురు తొడిగాక పుట్టిన వింతగారడిని ఎంతో సున్నితంగా, సుమనోహరంగా ఆవిష్కరించారు. ఈ పాటలోని ‘నీ కనులలో కదలాడిన ఓ వింతభావం ఎంతో మధురమే’ అనే వాక్యంలో, ప్రేయసి తలపులతో నిండి ఉన్న ప్రియుడిలో, ఆమె జ్ఞాపకాలు చేస్తున్న సందడిని తెలియజెప్పారు. ఈ చిత్రానికి అవార్డునుకూడా అందుకున్నారు.

ప్రేమపాటల్లో మేటి
యువతలోని పులకింతల మైకాన్ని, గిలిగింతల సౌందర్యాన్ని తెలిపేలా ప్రేమపాటలు, శృంగారగేయాలూ రాయడంలోనూ మేటిగా నిలిచారు శ్రేష్ఠ. 2012లో వచ్చిన ‘మైత్రి’ సినిమాకోసం ‘జిల్‌ జిల్‌ జిల్‌ జిగేలే నే కన్నే గీటితే.. జల్‌ జల్‌ జల్‌ తేనెజల్లే నే పెదవే తాకితే’ అంటూ ఓ శృంగారగీతాన్ని అందించారు. యువతరంలోని సరస భావసోయగాన్ని సమృద్ధిగా పండించారీ పాటలో. అదే ఏడాది వచ్చిన ‘కో అంటే కోటి’ సినిమాలోనూ ‘ఓ మధురిమవే ఎందుకు వచ్చావే.. నా మనసునిలా ముక్కలు చేశావే’ అంటూ ప్రణయగీతం రాశారు. ప్రేయసివల్ల ప్రియుడిలో రేగిన కలవరాన్ని, విరహాన్ని ఈ పాటద్వారా తెలియజెప్పారు. ‘కలలా కలిసి గతమయ్యావే.. జతగా నడిచి కథవయ్యావే’ వంటి పంక్తుల్లో ప్రేయసి దూరమవడం వల్ల ప్రియుడి హృదయం ఎలా మథన పడుతుందో కండ్లకు కట్టారు. ‘వెయిటింగ్‌ ఫర్‌ యు’(2013) చిత్రంలో ‘ప్రాణం పురివిప్పిన వేళ పులకింతల సీమ పరిచింది ఈ నేల’ అనే పాటను అందించారు. ఇందులోని ‘ప్రాణం పురి విప్పడం’, ‘పులకింతల సీమ’ వంటి ప్రయోగరీతులు శ్రేష్ఠ కలానికున్న పటిష్ఠతను, విశిష్టతను తెలుపుతాయి. ఈ పాటలోని ‘కలే పండే ఒడే నిండే.. మనసున కురిసే జడివానే’ అనే పంక్తుల్లో ఒక అమ్మాయి తన కలలు నెరవేరి, ఒడిలోకి చేరబోతున్న పసిబిడ్డను తలచుకుని, తాను పొందనున్న మాతృత్వానికి ఎలా అనుభూతి చెందుతుందో వివరిస్తుంది.

సరళమైన పదబంధాలతో..
చిలిపి వయసులో సాగే కొంటె కథలను, మనసుతో వయసు చెప్పే తుంటరి సంగతులను ఎంతో లాలిత్యంగా వివరిస్తూ, 2019లో వచ్చిన ‘దొరసాని’ చిత్రం కోసం ఓ అందమైన ప్రేమపాటను అందించారు శ్రేష్ఠ. ‘కళ్లల్లో కలవరమై.. గుండెల్లో పరవశమూ వరమై’ అంటూ సాగే ఈ పాట తొలిప్రాయంలో ఎగిసిన వలపు గుబాళింపుల్ని, ఆనందపు క్షణాల్ని నింపుకొన్నది. ఇందులోని పదబంధాలు కూడా ఎంతో సరళంగా, సహజంగా ఒదిగాయి. ఆ తర్వాత ‘ప్రెషర్‌ కుక్కర్‌’ (2020) చిత్రం కోసం ‘నీ హృదయంతో నా హృదయం కలుసుకోనీ.. ఈ సమయం మధు ఊహలతో తేలిపోనీ’ అంటూ రాసిన ప్రణయ సౌందర్యగీతం కూడా రసభరితమైందే. రెండు మనసులు ఒక్కటవ్వాలని, నిండుగా బతుకును పండించుకోవాలని భావిస్తూ, తొలిప్రేమ పరవశాన్ని తమలో నింపుకొని పాడుకునే పరమానంద గీతమిది. నిండైన ప్రేమకు సజీవసాక్ష్యంగా నిలిచిన గీతమిది. యూత్‌ ఫుల్‌ లవ్‌, యుద్ధం శరణం, అభిమన్యుడు, ఆటగాళ్లు లాంటి సినిమాలకు కూడా ఆమె సాహిత్యాన్ని అందించారు. పాటను పదునైన ఆయుధంగా చేసుకుని ప్రయాణిస్తున్న శ్రేష్ఠ తన సుమధురగీతాలతో మనలను మరింత అలరించాలని ఆశిద్దాం.

సమ్మోహన గీతాలు
యువతరాన్ని ఉర్రూతలూగించే పాటలే కాదు, సమ్మోహనంగా సాగే మెలోడీ గీతాలను రాయడంలోనూ తనకు తానే సాటి. 2016లో వచ్చిన ‘పెళ్ళిచూపులు’ (2016) సినిమా కోసం రాసిన ‘మెరిసే మెరిసే మనసే మురిసేనేలా? చెలి నీవలనే చిరు చిరు ఆశలు విరిసేగా’ అనే పాట చిలిపి ఆశలతో మురిసే మనసుల కథలను వివరిస్తుంది. ప్రేమికుల హృదయాల్లో చెప్పలేని పారవశ్యం కలిగినపుడు ఆ హాయి ఎలా ఉంటుందో ఈ పాటతో తెలుస్తుంది. ఆ హాయి ‘కడలే ఎదలో మునకేసేనా?’ అన్న రీతిలో ఉందని చెప్పడం ఎంతో బాగుంది. ఇదే చిత్రంలో ‘చినుకు తాకే జడిలో చిగురు తొడిగే’ అనే పాటకూడా వీరు రాసిందే. ఈ రెండు పాటలతో శ్రేష్ఠకు చిత్రసీమలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఆ తర్వాత ‘అర్జున్‌రెడ్డి’ చిత్రం శ్రేష్ఠ కలానికున్న పదునును మరోసారి తెలిపింది.

-తిరునగరి శరత్‌ చంద్ర ,6309873682

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తొలి తెలంగాణ సినీగేయ రచయిత్రి ‘శ్రేష్ఠ’
తొలి తెలంగాణ సినీగేయ రచయిత్రి ‘శ్రేష్ఠ’
తొలి తెలంగాణ సినీగేయ రచయిత్రి ‘శ్రేష్ఠ’

ట్రెండింగ్‌

Advertisement