e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Thursday, June 24, 2021
Home బతుకమ్మ దిశ మార్చిన.. దిగంబర భైరవుడు!

దిశ మార్చిన.. దిగంబర భైరవుడు!

దిశ మార్చిన.. దిగంబర భైరవుడు!

ఉత్తరానికి ప్రవహిస్తున్న గోదావరిని తూర్పు వైపునకు మళ్లించేందుకు స్వయంగా భైరవుడే దిగి వచ్చాడు. గోదారమ్మకు అడ్డుగా, దిగంబరంగా నిల్చొని నదిని దారికి తెచ్చాడు. అఖండ గోదావరి దిశను మార్చి ఆ ప్రాంతాన్ని పరమ పవిత్రం చేశాడు. అప్పటి నుంచీ ‘కోరిన కోర్కెలు తీర్చే దైవం’గా భక్తుల పూజలు అందుకుంటున్నాడు.

పురాణాల ప్రకారం మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి సమీపంలోని గుట్టపై వెలసిన భైరవుడికి ఘనచరిత్ర ఉంది. మహారాష్ట్ర నాసిక్‌ సమీపంలోని త్య్రంబకంలో జన్మించిన గోదావరి ఆంధ్రప్రదేశ్‌లోని అంతర్వేదివద్ద సముద్రంలో కలిసేవరకూ తూర్పువైపునకే ప్రవహిస్తుంది. అయితే, చెన్నూర్‌ మండలం పొక్కూరు సమీపంలోకి వచ్చేసరికి తన దిశను మార్చుకొని ఉత్తరం వైపు ప్రవహిస్తుంది. ఇక్కడ గోదావరిని దారి మళ్లించేందుకు భైరవుడే దిగివచ్చాడనీ, పారుపల్లి గుట్టపై దిగంబరంగా నదికి అడ్డంగా నిలుచున్నాడనీ, దాంతో గోదారమ్మ తూర్పువైపు మళ్లిందని స్థలపురాణం. పొక్కూరు గ్రామం నుంచి పారుపల్లి వరకు సుమారు 5 కోసుల దూరం వరకు గోదావరి ఉత్తరదిక్కులో ప్రయాణిస్తుంది. ఈ ప్రవాహ దూరం కారణంగానే గోదావరి నదికి ‘పంచక్రోశ ఉత్తరవాహిని’ అని పేరు పడింది. కాశీవద్ద పవిత్ర గంగానది కూడా ఇలాగే ఉత్తరదిశలో 6 కిలోమీటర్లు ప్రవహిస్తుందనీ, అలాంటి అద్భుత దృశ్యం మళ్లీ చెన్నూర్‌ గోదావరివద్దే దర్శనమిస్తుందని పండితులు చెబుతున్నారు. ‘పంచక్రోశ ఉత్తర వాహిని’లో స్నానమాచరిస్తే ఎనలేని పుణ్యమని ప్రజల విశ్వాసం.

భైరవుడికి నిత్య పూజలు
గోదావరి దిశను మార్చి ఈ ప్రాంతాన్ని పరమ పవిత్రం చేసిన భైరవుడిని పారుపల్లితోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అత్యంత భక్తిశ్రద్ధలతో కొలుస్తారు. పారుపల్లి భైరవకోనపై వెలసిన భైరవుడిపై చెన్నూర్‌ మార్వాడీలు ప్రత్యేక శ్రద్ధ కనబరిచారు. గుట్టపై నిరాదరణకు గురవుతున్న స్వామికి నీడ కల్పించారు. ప్రతి ఆదివారం ఈ ప్రాంతాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. స్థానికుల సహకారంతో మరింత అభివృద్ధి చేస్తున్నారు. ‘భైరవకోన భైరవుడికి ఎంతో ప్రశస్తి ఉన్నది. స్వామివారిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలి వస్తుంటారు. భైరవుడి చెంత మొక్కిన మొక్కులు వెంటనే నెరవేరుతాయని ప్రగాఢ విశ్వాసం. ఇన్నాళ్లూ కోటపల్లి, చెన్నూర్‌ భక్తులు మాత్రమే వచ్చేవారు. ప్రస్తుతం పొరుగుజిల్లా నుంచికూడా సందర్శకులు వస్తున్నారు’ అని చెబుతారు నారాయణ దేవ్‌డా అనే భక్తుడు.

ఎవరీ భైరవుడు?
భైరవుడు శివాంశ. పంచభూతాలు, సూర్య చంద్రాది గ్రహాలు భైరవుడి అదుపాజ్ఞలలో ఉంటాయని అంటారు. అలా కాలాన్ని శాసిస్తాడు కాబట్టి, కాలభైరవుడనే పేరు వచ్చింది. భీషణాత్‌ భైరవ స్మృతః – అంటుంది శివ పురాణం. దుష్టులకు సింహస్వప్నం అన్న అర్థంతోనూ వ్యవహరిస్తారు. చెడు చేసేవారూ, చెడు తలపులు ఉన్నవారూ స్వామిని చూడగానే వణికిపోతారట. కాబట్టే, భైరవుడి ఉపాసకులకు అంత ధైర్యం. ‘స్వామీ! మృత్యువు కూడా నీ భక్తులను చూసి పారిపోతుంది’ అంటుంది స్కాంద పురాణం. ఇలా, కాలుడిని గెలిచి కూడా భైరవుడు, కాలభైరవుడయ్యాడు. పురాణాల ప్రకారం మొత్తం ఎనిమిదిమంది భైరవులు.. అసితాంగ భైరవ, రురు భైరవ, చండ భైరవ, క్రోధ భైరవ, ఉన్మత్త భైరవ, కపాల భైరవ, భీషణ భైరవ, సంహార భైరవ.

మృత్యుదర్పనాశనం
కపాల మాలికాధరం
కాశికాపురాధినాథ
కాలభైరవం భజే!

.. అంటూ కాలభైరవుడి రూపాన్నీ, గుణాలనూ వర్ణిస్తారు శంకరభగవత్పాదులు. ఒంటినిండా కపాలహారాల్ని ధరించి కాశీ పురవీధులలో తిరుగుతుంటాడట కాలభైరవుడు. వారణాసి క్షేత్రపాలకుడు కాలభైరవుడే. ‘నేను వేరు, కాలభైరవుడు వేరు కానేకాదు..’అని స్కాందపురాణంలో ప్రకటించాడు పరమశివుడు. అందుకేనేమో, మహేశ్వరుడి మానస పుత్రుడిగా భైరవుడిని కీర్తిస్తారు. పూర్వం బ్రహ్మదేవుడికి ఐదు ముఖాలు ఉండేవనీ, శివుడి ఆజ్ఞమేరకు భైరవుడు ఓ ముఖాన్ని ఖండించాడని చెబుతారు! అంతటి శక్తిమంతుడైన స్వామి ఇక్కడ కొలువై ఉండటం స్థానికుల అదృష్టం.

-టి. యువరాజ్‌ గౌడ్‌

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
దిశ మార్చిన.. దిగంబర భైరవుడు!

ట్రెండింగ్‌

Advertisement