Suriya | తమిళ స్టార్ హీరో సూర్య నటిస్తున్న తాజా రూరల్ యాక్షన్ ఎంటర్టైనర్ ‘కరుప్పు’ ఇప్పటికే సినీ వర్గాల్లో మంచి బజ్ క్రియేట్ చేసింది. గ్రామీణ నేపథ్యంతో పక్కా మాస్ అంశాలతో తెరకెక్కుతున్న ఈ సినిమా వేసవి కానుకగా మే 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల తమిళ సినిమాలను అదే టైటిల్స్‌తో తెలుగులో విడుదల చేయడంపై ప్రేక్షకుల నుంచి కొంత అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ‘కరుప్పు’ చిత్ర యూనిట్ కీలక నిర్ణయం తీసుకుంది. తెలుగు ప్రేక్షకుల నేటివిటీని దృష్టిలో ఉంచుకుని ఈ సినిమాకు ‘వీరభద్రుడు’ అనే పవర్ఫుల్ టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ నిర్ణయం తెలుగు ప్రేక్షకుల్లో సినిమాపై ఆసక్తిని మరింత పెంచుతోంది. టైటిల్ నుంచే మాస్, యాక్షన్ ఎలిమెంట్స్ స్పష్టంగా కనిపిస్తుండటంతో సినిమా కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
ఈ చిత్రానికి ఆర్.జె. బాలాజీ దర్శకత్వం వహిస్తున్నారు. కంటెంట్ ఓరియెంటెడ్ సినిమాలతో మంచి గుర్తింపు పొందిన ఆయన… ఈసారి పూర్తి స్థాయి మాస్ ఎంటర్టైనర్తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యారు. సూర్య సరసన త్రిష హీరోయిన్గా నటిస్తోంది. వీరి కాంబినేషన్‌కు ఇప్పటికే మంచి క్రేజ్ ఉండటంతో ఈ జంటపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి సంగీతం సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఆయన ఇచ్చే బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కీలకంగా మారనుంది. డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్‌పై ఎస్.ఆర్. ప్రకాష్ బాబు, ఎస్.ఆర్. ప్రభు ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ప్రొడక్షన్ విలువలు కూడా ఈ సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయని సినీ వర్గాలు చెబుతున్నాయి.
‘వీరభద్రుడు’లో సూర్య మార్క్ యాక్షన్, గ్రామీణ బ్యాక్‌డ్రాప్, ఎమోషన్స్ అన్నీ కలిపి ఒక ప్యాకేజీగా సినిమా రూపొందుతున్నట్లు సమాచారం. ముఖ్యంగా మాస్ ప్రేక్షకులను టార్గెట్ చేస్తూ తెరకెక్కిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లు సాధించే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మొత్తానికి, సూర్య – ఆర్.జె. బాలాజీ కాంబినేషన్లో వస్తున్న ‘వీరభద్రుడు’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పవర్ఫుల్ టైటిల్, మాస్ ఎలిమెంట్స్ కలిసి ఈ సినిమాని బాక్సాఫీస్ దగ్గర ఎంత పెద్ద హిట్ చేస్తాయో చూడాలి.