ఫ్లోరిడా: బ్లూ రంగులో మెరుస్తున్న భూమికి చెందిన అద్భుతమైన ఫోటోలను నాసా రిలీజ్ చేసింది. ఆర్టెమిస్-2(Artemis II)లో ప్రయాణిస్తున్న ఆస్ట్రోనాట్స్ ఆ పిక్స్‌ను తీశారు. చంద్రుడిని చుట్టి వచ్చేందుకు ఆర్టెమిస్2 వెళ్తున్న విషయం తెలిసిందే. అయితే మిషన్ కమాండర్ రీడ్ వైజ్‌మ్యాన్ అద్భుతమైన భోగోళ పిక్స్‌ను తీశారు. జాబిలి దిశగా వెళ్తూ వెళ్తూ.. అందమైన భూమిని కూడా షూట్ చేసినట్లు ఆస్ట్రోనాట్స్ తెలిపారు. తొలి ఇమేజ్‌కు హల్లో, వరల్డ్ అని పేరు పెట్టారు. అట్లాంటిక్ సముద్రంలో నీలి రంగులో కనిపిస్తున్న దృశ్యం ఆకట్టుకుంటోంది. సూర్యుడి వల్ల స్వల్పంగా మెరుస్తున్నట్లుగా కనిపిస్తూ.. ఇక ద్రువాల వద్ద గ్రీన్ రంగులో ఆరాలు విరజిమ్ముతున్న ఫోటో థ్రిల్ చేస్తోంది.
ఆ ఫోటోలో భూమి తలకిందుగా ఉన్నట్లుగా కనిపిస్తోంది. పశ్చిమ సహారా, ఐబీరియా ద్వీపకల్పం ఆ పిక్‌లో ఎడమ వైపు ఉన్నాయి. ఇక తూర్పు వైపున దక్షిణ అమెరికా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక భూమి కింద భాగంలో దివ్యంగా వెలుగుతోన్న స్పాట్‌ను వీనస్ గ్రహంగా నాసా శాస్త్రవేత్తలు గుర్తించారు. ట్రాన్స్ లూనార్ బర్నింగ్ జరిగిన తర్వాత అంటే, భూ కక్ష్యను ఓరియన్ స్పేస్‌క్రాఫ్ట్ వీడిన తర్వాత ఈ పిక్స్ తీశారు.
ఆర్టెమిస్‌లో ఉన్న నలుగురు వ్యోమగాములు సుమారు 2 లక్షల మైళ్లకు పైగా దూరం ప్రయాణించనున్నారు. నాసా అంచనాల ప్రకారం ఏప్రిల్ 6వ తేదీన చంద్రుడి అవతలి వైపున ఆర్టెమిస్ రౌండ్ కొట్టి రానున్నది. ఏప్రిల్ 10వ తేదీన మళ్లీ ఆ వ్యోమనౌక భూమిపై దిగనున్నది. భూకక్ష్య దాటగానే వ్యోమగాములందరూ ఆర్టెమిస్ కిటికీలకు అతుక్కుపోయినట్లు మిషన్ స్పెషలిస్టు జెర్మీ హన్సెన్ తెలిపారు. జాబిలి వెలుతురులో మిరుమిట్లు గొల్పుతున్న అందమైన భూమిని వీక్షిస్తున్నట్లు తెలిపారు.
శుక్రవారం మద్యాహ్నం వరకు ఆర్టెమిస్ వ్యోమగాములు భూమి నుంచి సుమారు లక్షా 80 వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించారని, ఇంకా చంద్రుడికి సుమారు రెండున్నర లక్షల కిలోమీటర్ల దూరంలో ఉన్నట్లు నాసా శాస్త్రవేత్తలు చెప్పారు. సోమవారం నాటికి వాళ్లు డెస్టినేషన్ చేరుకుంటారన్నారు.
We see our home planet as a whole, lit up in spectacular blues and browns. A green aurora even lights up the atmosphere. That’s us, together, watching as our astronauts make their journey to the Moon. pic.twitter.com/6JkKufBgtJ
— NASA (@NASA) April 3, 2026