పర్యాటకులకు ఆనందాన్ని పంచే హోటళ్లు అనేకం ఉండవచ్చు. కానీ దుబాయ్‌లోని ‘అట్లాంటిస్’ ప్రత్యేకత మాత్రం ప్రపంచంలోని మరే లగ్జరీ హోటల్‌కూ ఉండదు. అదో భూలోక స్వర్గం. మనిషై పుట్టినవాడు ‘అట్లాంటిస్’లో ఒక్క రోజైనా మకాం వేయాల్సిందే. ఈ హోటల్ ఒకేసారి 65 వేల మందికి ఆతిథ్యం ఇవ్వగలదు. విందులు, వినోదాల సంగతి పక్కన పెడితే.. జలకాలాటలు,జలచరాలతో ఆటలే ఇక్కడ అసలైన మజా!
ఆకులో ఆకునై.. అన్నట్టు, చేపల్లో చేప అయిపోతే ఎంత బావుంటుందీ? దుబాయ్‌లోని ‘అట్లాంటిస్’ హోటల్ ఆ కలను నిజం చేస్తుంది. మందపాటి ఫైబర్ గ్లాస్‌తో నిర్మించిన భారీ అక్వేరియంలోకి వెళ్లిపోయి చుట్టూ విహరిస్తున్న జలచరాలను చూస్తుంటే భలేగా ఉంటుంది. అట్లాంటిస్ అద్భుతాల్లో ఇదొకటి. టూరిస్టు గైడ్లానే, అట్లాంటిస్లో ఆక్వారిస్ట్ గైడ్ ఉంటాడు. తను ఈ అక్వేరియానికి వచ్చే పర్యాటకులకు చుట్టూ సంచరించే చేపల విశేషాలు చెబుతుంటాడు. వాటి సంరక్షణ గురించీ వివరిస్తాడు. ఇక్కడి చేపలకు ఇచ్చే ఆహారం ఫైవ్ స్టార్ రేంజ్లో ఉంటుంది.
ఫిష్ హాస్పిటల్
అట్లాంటిస్లో ప్రపంచంలోనే అతిపెద్ద వాటర్ పార్క్ ఉంది. ఇందులో డాల్ఫిన్లు, సముద్ర సింహాలు, జెల్లీ చేపలు, ఎండ్రకాయలు, డామ్సెల్, ఈగల్ రేస్, తిమింగలాలు.. ఇంకా మరెన్నో సముద్ర జీవులు ఉంటాయి. వీటి సంరక్షణ కోసం డాక్టర్లు, ఆక్వారిస్టులు, డైవర్లు ఉంటారు. మెరైన్ బయాలజీ (సముద్ర జీవశాస్త్రం)లో, ప్రత్యేకించి చేపల గురించే అధ్యయనం చేసిన ఇఖ్తియాలజిస్టులు కూడా ఇక్కడ పని చేస్తున్నారు.
‘చికిత్స కన్నా ముందుజాగ్రత్తే మేలు’ అనే హెచ్చరిక చేపలకూ వర్తిస్తుందని అంటారు నిపుణులు. చేపల ప్రధాన బాధ్యత ఆక్వారిస్టులదే. వాటి ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు తనిఖీ చేయాల్సిందే. ఫిష్ హాస్పిటల్‌కు తీసుకొచ్చే ప్రతి చేపను ముందుగా బరువు తూస్తారు. తర్వాత చేపల ఉత్సాహం, చర్మం రంగు, మచ్చలు, గాయాలు, బరువు, ఆకలి ఆధారంగా చేపల ఆరోగ్య స్థితిని బేరీజు వేస్తారు.
సంతాన సాఫల్య కేంద్రం
అంతరిస్తున్న సముద్ర జీవుల సంతతిని పెంచడానికి ఫిష్ హాస్పిటల్లో ఎంతో కృషి జరుగుతున్నది. గుడ్డుపెట్టే దశలో ఉన్న చేపలకు ఆశ్రయమిచ్చి వాటి సంతానోత్పత్తిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. సముద్ర గుర్రం లైంగిక సామర్థ్యం పెంచుతుందని జపాన్ ప్రజల నమ్మకం. దీంతో వాటిని తినేందుకు ఎగబడతారు. ఆ పిచ్చి నమ్మకం వాటి ప్రాణాల మీదికి తెచ్చింది. చివరికి సముద్ర గుర్రం చేపలు అంతరించే స్థితికి వచ్చాయి. వాటిని గుడ్లు పెట్టించి, సంరక్షించే ప్రయత్నాలు చేస్తున్నారిక్కడ.