కలుపుకొనిపోవడం అన్నది భారతీయులకు తెలిసినంతగా ఇంకెవరికీ తెలియదనే చెప్పాలి. ఒక్క మనుషుల్నే కాదు ఆహారాన్నీ, ఆచారాలనూ, దుస్తులనూ ఇలా…
వేటినైనా కలిపేసుకోవడం మనవాళ్లకు వెన్నతో పెట్టిన విద్య. అందుకే చైనీస్ ఫాస్ట్ఫుడ్లూ, జపనీస్ అలంకరణలు, వెస్ట్రన్ డ్రెస్‌లూ… అన్నీ భారతీయ ఫ్లేవర్లలో దొరుకుతున్నాయి.అంతేనా, ఇప్పుడు మన ఆర్టిస్టులు ప్రపంచ ప్రఖ్యాత మోనాలిసా చిత్రానికీ భారతీయతను అద్దుతున్నారు. చీరకట్టి, బొట్టుపెట్టి అందాన్ని రాశి పోసినట్టు తయారు చేస్తున్నారు.
మోనాలిసా… ప్రపంచంలోనే అత్యంత ప్రసిద్ధ పెయింటింగ్. ఇటలీకి చెందిన ప్రఖ్యాత చిత్రకారుడు లియోనార్డో డా వించీ గీసిన ఈ చిత్రం గురించి తెలియని వారు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఈ ప్యారిస్ బొమ్మను అందానికి చిరునామాగా, సౌందర్యానికి నిలువెత్తు ప్రతిరూపంగా చెప్పుకొంటారు కళాభిమానులు. ప్రపంచంలోనే అత్యధికులు చూసిన, అత్యధికులు మాట్లాడుకున్న, ఎక్కువ చోట్ల రాసిన, అత్యధిక పాటల్లో ప్రస్తావించిన చిత్రంగానూ దీనికి పేరుంది. అంతేకాదు, భూమ్మీద ఏ చిత్రానికీ లేనన్ని పేరడీలు దీనికి మాత్రమే ఉన్నాయట. ఇంత పేరున్న చిత్రాన్ని మన భారతీయులు మాత్రం ఆదరించకుండా, అభిమానించకుండా ఉంటారా?! అందుకే, దీనికి కాస్త ఇండియన్ టచ్ ఇచ్చి మోనాలిసాను మహారాణిని చేసేశారు. పాశ్చాత్య సౌందర్యానికి దేశవాళీ సొబగులు అద్దుతున్నారు.
ఎక్కడా ఆ చిత్రానికి ఉన్న కాంతిని తగ్గనీయకుండా పాత ఆర్ట్‌కు కొత్త కళ తెచ్చిపెడుతున్నారు. గులాబీ రంగు వర్కు చీర కట్టుకున్న భారతీయ మహారాణి, చేతిలో పువ్వు పట్టుకున్న మొఘల్ ముద్దుగుమ్మ, తలమీదుగా ఎర్ర మేలిముసుగు కప్పుకొన్న గుజరాతీ ఆడపడుచు… ఒకటనేమిటి ప్రతి బొమ్మా మోనాలిసమ్మే! భారతీయ చిత్రకళా సామ్రాజ్యానికి చక్రవర్తిగా చెప్పుకొనే రవివర్మ చిత్రాల్లోకీ ఈ సుందరిని ఆవాహన చేశారు మనవాళ్లు. ఈ చిత్రాలతో ఎగ్జిబిషన్లనూ ఏర్పాటు చేస్తున్నారు. అంతేకాదు వాల్ పోస్టర్లుగానూ, చొక్కాల మీద ప్రింట్లుగానూ ఇవి దర్శనమిస్తున్నాయి. చేతికి మెహిందీతో, మెడలో నల్లపూసలతో దర్శనమిస్తున్న ఈ ఇండియన్ వర్షన్ ఆఫ్ మోనాలిసాను చూస్తే దిష్టి తగులుతుందేమో అనిపించేలా లేదూ!