‘ఈయన సినిమాలు ఓ పట్టాన అర్థం కావు!’ అంటారు కొందరు.‘అర్థం చేసుకోవాలే గానీ, అద్భుతంగా ఉంటాయి’ అంటారు ఇంకొందరు.‘ప్రతి చిన్న సంగతినీ పట్టిపట్టి చూపిస్తాడు ఎందుకో?’ అనేవాళ్లూ ఉంటారు.‘చిన్న విషయాన్నే అయినా చాలా లోతుగా చూపిస్తాడు’ అని కితాబు ఇచ్చేవాళ్లూ ఉంటారు. ఇదీ సంక్షిప్తంగా రచయిత, నటుడు, దర్శకుడు, నిర్మాత నగేశ్ కుకునూరు పరిచయం. తాజాగా ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’ యాంథాలజీ సిరీస్‌తో ఓటీటీ ప్రేక్షకులతో మేటి అనిపించుకున్న
ఈ పక్కా హైదరాబాదీ కథాకమామిషూ చదివేయండి.
నగేశ్ బాల్యమంతా హైదరాబాద్ నడిబొడ్డున నారాయణగూడలో సాగింది. పక్కనే దీపక్ మహల్ థియేటర్, చెంతనే శాంతి, రెండు అడుగులు వేస్తే శ్రీనివాస, అనాయాసంగా నాలుగు అడుగులు పడితే కాచిగూడ క్రాస్‌రోడ్స్‌లో మహేశ్వరి-పరమేశ్వరి. ఆయాసంగా పది అడుగులు వేస్తే ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో దేవీ, సంధ్య. ఇన్ని సినిమా థియేటర్ల మధ్య నగేశ్ పెరిగాడు. సినిమానే శ్వాసగా భావించేవాడు. చదువుపై ధ్యాస కూడా నిలిపేవాడు. ఉస్మానియా యూనివర్సిటీలో కెమికల్ ఇంజినీరింగ్ చదివాడు. తర్వాత అమెరికాకు వెళ్లి జార్జియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఎన్విరాన్మెంట్ ఇంజినీరింగ్‌లో పీజీ చేశాడు. అదే జోరులో ఎన్విరాన్మెంట్ కన్సల్టెంట్‌గా టెక్సాస్‌లో కొన్నాళ్లు, అట్లాంటాలో కొన్నాళ్లు కొలువూ చేశాడు. అక్కడే నటనలో శిక్షణ తీసుకున్నాడు. దర్శ కత్వంపై ఇష్టం పెంచుకున్నాడు.
కథ-నటన-దర్శకత్వం
నగేశ్ మంచి కథకుడు. చిన్నప్పటి నుంచి డైరీ రాసే అలవాటు ఉండేది. దినచర్యలా కాకుండా సీన్లు రాసినట్టుగా ఉండేవట ఆయన డైరీలోని పేజీలు. కొన్నాళ్లకు ఆ డైరీలోని సన్నివేశాలే ఓ సినిమాకు కథా వస్తువును అందించాయి. చిన్నప్పటి నుంచి నటుడు కావాలన్నది నగేశ్ ఆశ. పెద్దయ్యాక అది ఆశయంగా మారింది. నటుడిగా కన్నా దర్శకుడిగా, కథకుడిగా రాణిస్తాననే నమ్మకమూ కుదిరింది. ఆ నమ్మకంతోనే 1998లో ‘హైదరాబాద్ బ్లూస్’ చిత్రాన్ని స్వయంగా నిర్మించి, దర్శకత్వం వహించడమే కాకుండా, నటించాడు కూడా! ఇంగ్లిష్‌లో నిర్మించిన ఈ చిత్రం రొటీన్‌కు భిన్నమైన చిత్రాల జాబితాలో చోటు దక్కించుకుంది. మొదటి ప్రయత్నంతోనే విమర్శకుల ప్రశంసలు అందుకోవడంతో అదే ఉత్సాహంతో ముందడుగు వేశాడు నగేశ్.
ఓటీటీలోనూ మేటి
ఒకవైపు తనకు నచ్చిన, తనే రాసుకున్న కథలతో సినిమాలు తీస్తూనే, మరోవైపు ఓటీటీ ప్రేక్షకులనూ పలకరించాడు ఈ హైదరాబాదీ దర్శకుడు. 2019లో ‘సిటీ ఆఫ్ డ్రీమ్స్’తో ఓటీటీలోకి ఎంటరిచ్చాడు. పది ఎపిసోడ్ల ఈ వెబ్‌సిరీస్‌లో ప్రతి కథా విభిన్నమైన పంథా కలిగి ఉన్నదే! 2021లో అదే పేరుతో మరో వెబ్‌సిరీస్‌కు దర్శకత్వం వహించాడు. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ‘మోడ్రన్ లవ్ హైదరాబాద్’.. నగేశ్ కుకునూరు పేరును మరోసారి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీగా నిలిపింది. ఆరు కథలున్న ఈ యాంథాలజీ వెబ్‌సిరీస్‌లో మూడింటికి దర్శకత్వం వహించాడు. హైదరాబాద్‌తో పెనవేసుకున్న మానవ సంబంధాలను హృద్యంగా చూపించి అందరి మన్ననలూ అందుకున్నాడు నగేశ్ కుకునూరు.
విలక్షణ దర్శకుడు
1998 తర్వాత వరుస సంవత్సరాల్లో మరో రెండు ఆంగ్ల చిత్రాలు నిర్మించాడు నగేశ్. వాటిలో ఒకటి ‘రాక్‌ఫోర్డ్’. ఈ కథకు స్ఫూర్తి చిన్నప్పుడు డైరీలో తను రాసుకున్న అంశాలే! 2003లో ‘3 దీవారే’ హిందీ సినిమా దర్శకత్వం చేపట్టాడు. బాక్సాఫీస్ లెక్కలు ఎలా ఉన్నా.. కొత్తదనం కోరుకునే ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. మరుసటి ఏడాది ‘హైదరాబాద్ బ్లూస్ 2’ సినిమా తెరకెక్కించాడు. అదీ అలరించింది. నగేశ్ ప్రతిభను లెక్కించడానికి కొలబద్దలు అవసరం లేదని నిరూపించిన సినిమా ‘ఇక్బాల్’. ఓ బధిర బౌలర్, తాగుబోతు కోచ్ కథ ఇది. విభిన్నమైన కథాంశంతో అక్షయ్‌కుమార్ హీరోగా నిర్మించిన ‘8X6 తస్వీర్’ సినిమా కూడా అద్భుతః అనిపించుకుంది. జాన్ అబ్రహం హీరోగా ‘ఆశాయే’, ‘మోడ్’, ‘లక్ష్మి’ తదితర సినిమాలు బాలీవుడ్ విలక్షణ దర్శకుల జాబితాలో నగేశ్ కుకునూర్‌కు స్థానం కట్టబెట్టాయి. ఈ ఏడాది కీర్తి సురేశ్ కథానాయికగా ‘గుడ్‌లక్ సఖీ’ సినిమాతో తెలుగులోనూ ఎంట్రీ ఇచ్చాడు నగేశ్.