సోషల్‌మీడియా టాలెంట్ అడ్డాగా మారింది. పల్లె ఆణిముత్యాలకు తిరుగులేని వేదికైంది. లక్షల వ్యూస్ మాత్రమే కాదు.. లక్షణమైన సంపాదన కూడా సాధ్యమవుతున్నది! అలాంటి ఓ చానల్ ‘విలేజ్ రత్నాలు 06’. సీరియస్ సన్నివేశాలకు హాస్యం జోడిస్తూ అందర్నీ మెప్పిస్తున్నారు ఐదుగురు పిల్లగాళ్లు!
వాళ్లంతా బడిపిల్లలు. అందరివీ పేద కుటుంబాలే. చదువులో ముందుంటూనే.. తమలోని టాలెంట్ చూపించేందుకు వాళ్లంతా ఒక్కటయ్యారు. ఇన్‌స్టాలో ఇలాయిస్తూ, రీల్స్‌లో రియల్ కామెడీ పండిస్తున్నారు. యూట్యూబ్‌లో నవ్వుల గత్తర లేపుతున్నారు. పోస్ట్ చేసిన నిమిషాల్లోనే వేల లైక్స్ కొల్లగొడుతూ పక్కా జాతిరత్నాలు అనిపించుకుంటున్నారు. భూపాలపల్లి జిల్లా మహ దేవపురం మండలంలోని బేగళూరుకు చెందిన ముల్కల శ్రీనివాస్‌కు సినిమాలంటే ఆసక్తి.
ఎప్పటికైనా మూవీ మేకింగ్‌లో మంచి పొజిషన్‌కు రావాలన్నది లక్ష్యం. ఆ ప్రయత్నంలో భాగంగా వీడియో టేకింగ్, ఎడిటింగ్, ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు. టాలెంట్ ఉన్నప్పుడు అవకాశం కోసం ఎదురుచూస్తూ కూర్చోవడం కాదు.. అవకాశాలను కల్పించుకోవాలన్నది శ్రీనివాస్ ఫిలాసఫీ. రూరల్ కంటెంట్ ద్వారా పల్లె ఆణిముత్యాలను వెలికితీయాలని అనుకున్నాడు. ఆ ప్రయత్నం కూడా కొత్తగా చేయాలనుకున్నాడు. ఆ ఆలోచనలోంచి వచ్చిందే.. స్పూఫ్. తెలుగులో స్పూఫ్ చానెల్స్ పెద్దగా లేవు. ఆ రంగంలో ట్రెండ్ సెట్ చేయాలని నిర్ణయించుకున్నాడు. ‘విలేజ్ రత్నాలు 06’ పేరుతో యూట్యూబ్ చానల్‌ను ప్రారంభించాడు. గత జూలై నుంచి వీడియోలు అప్లోడ్ చేస్తున్నాడు. ఇరవై రోజుల్లో కోటి వ్యూస్ వచ్చాయి. ఆ సంఖ్య ఇంకా ఇంకా పెరుగుతూనే ఉన్నది.
ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఫేస్బుక్ ఎక్కడ చూసినా విలేజ్ రత్నాలే! జనాలకు కనెక్ట్ కావడానికి ప్రధాన కారణం.. క్యారెక్టర్లు. టీమ్‌లో ఐదుమంది పిల్లలుంటారు. గంట ప్రశాంత్, గంట శ్రీజ, చల్ల బిందు, సీహెచ్ సుమంత్, మేరు దినేశ్.. అందరూ హైస్కూలు విద్యార్థులే. ఒక్కొక్కరిలో ఒక్కో టాలెంట్ ఉంది. రోజూ ఆ పిల్లలు ఆడుకుంటున్నప్పుడు శ్రీనివాస్ గమనించేవాడు. వాళ్లకో ప్లాట్‌ఫామ్ ఇవ్వాలనుకున్నాడు. మొదటి ప్రయత్నంగా ‘బాహుబలి’ స్పూఫ్ చేశారు. 20 రోజుల్లోనే 40వేల సబ్‌స్ర్కైబర్లు నమోదయ్యారు.
వీటితో పాటు..
‘మీ టూత్‌పేస్ట్‌లో ఉప్పుందా?’ వీడియోను యూట్యూబ్ రీల్స్‌లో 1.5 లక్షల మంది చూశారు. ‘సూరీడూ.. ఓ సూరీడూ.. ఏడున్నావయ్యా’ వీడియోను 1.3 లక్షలమంది, ‘నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మొగాడింకా పుట్టలేదు మామా’ వీడియోను 5.8 లక్షలమంది చూశారు. ‘మా దగ్గర ఇంకా కొత్తకొత్త కాన్సెప్ట్స్ ఉన్నాయి. త్వరలోనే కొత్త స్పూఫ్స్ విడుదల చేస్తాం’ అంటాడు శ్రీనివాస్.
సీన్-1
‘ముఖేష్ కథ’ విలేజ్ రత్నాలు చానెల్‌కు ఈ వీడియో కొత్తబలాన్ని ఇచ్చింది. సీన్ ఇలా సాగుతుంది.. ‘నా పేరు ముఖేష్. నేను ఒకే సంవత్సరంలో 20 లక్షల అప్పుచేసి ఎగ్గొట్టాను. వాళ్లు నన్ను కొట్టారు. బహుశా నాకిప్పుడు ఎక్కడా అప్పు పుట్టకపోవచ్చు. బయటికెళ్లాలంటే సిగ్గుగా ఉంది’.. ఇదీ డైలాగ్.‘ఈ దిక్కుమాలినోని అప్పు జేయవట్టి మా అమ్మ రెండు గాజులు అమ్ముకోవాల్సొచ్చింది’ .. ఇదీ పంచ్. చూస్తున్నవాళ్లు పగలబడి నవ్వేస్తారు. ఈ వీడియోకు 50K+ లైక్స్ వచ్చాయి. 2.5K టైమ్స్ షేర్ అయ్యింది.
సీన్-2
‘కాలకేయా.. మా రాజ్యాన్ని విడిచి పెట్టిపో’ అనగానే.. ‘ఇయ్యాల నీ ఈపులు పలగ్గొట్టుడే’ అనేది కాలకేయుల కౌంటర్. ‘మాహిష్మతి చివరి అవకాశం ఇస్తుంది. తక్షణమే రాజ్యాన్ని విడిచివెళ్లిపోండి. కట్టప్పా సమరశంఖం పూరించూ..’ అనగానే.. ‘ఏంటిది పూరించుతవ్? వాళ్లేమో రెండు లక్షలమందున్నరు. మనం రెండు వందల మందిమి. ఆ కర్రోడు సూడు ఎట్లున్నడో. పండవెట్టి తొక్కుతరు. బాహుబలికి ఫోన్‌చేసి అట్నుంచి అటే పారిపోమని చెప్పు’ అంటూ సాగే.. ఈ వీడియోకు 100K+ లైక్స్ రాగా 6.1K+పైగా షేర్ అయ్యింది.
సీన్-3
‘కట్టప్పా.. ఈసారి కూడా నా కొడుకుకు రాజ్యాధికారం రానట్టేనా?’ ..చింపిరి జుట్లతో, గోనె బస్తాలు కట్టుకొని చెప్పే డైలాగ్స్, టేకింగ్ పండాయి. ‘నాకు దక్కాల్సిన సింహాసనం నా తమ్ముడికిచ్చారు. ఇప్పుడు నా కొడుక్కి దక్కాల్సిన సింహాసనం నా తమ్ముడి కొడుక్కి ఇస్తున్నారు’ అంటూ గోడను కొడతాడు ఓ పాత్రధారి. గట్టిగా దెబ్బ
తగలడంతో ‘కట్టప్పా ఒక్క నిమిషం ఆగూ.. అబ్బా.. ఈ చెయ్యిగూడా ఇరగ్గొట్టుకున్నా?’ అంటూ ఏడుస్తూ అందర్నీ నవ్వించే ఈ వీడియోకు 50K+ లైక్స్ వచ్చాయి. 1000+ సార్లు షేర్ అయ్యింది.