ఇప్పుడు అందరి నోటా అరైట్టె! అన్న మాటే వినిపిస్తున్నది. ‘ట్రై కరో’ అంటూ తెగ ఇన్స్టాల్ చేసేస్తున్నారు. అందుకే చెన్నైకి చెందిన జోహో కార్పొరేషన్ ఇప్పుడు తెగ పాపులర్ అయిపోయింది. ఇప్పటికే అరైట్టె డౌన్లోడ్ల సంఖ్య కోటి మార్క్ దాటి పరుగులు తీస్తున్నది. ‘డేటా అనేది గోల్డ్ అయితే, భద్రత అనేది దానికి లాక్ రూమ్!!’ అంటూ.. ఈ అరైట్టె ప్రైవసీ లాక్ రూమ్పైనే ఫోకస్ చేసింది! మరైతే, ఇందులోని ఫీచర్స్, ప్రైవసీ సంగతులేంటో చూద్దాం!
నిన్న మొన్నటి వరకూ మెసేజింగ్ అంటే ప్రపంచానికి వాట్సాప్ మాత్రమే గుర్తొచ్చేది. కానీ ఆ ప్లాట్‌ఫామ్ డేటా సెక్యూరిటీ, ప్రైవసీ విషయంలో చాలామందిని పెద్ద కన్ఫ్యూజన్లో పడేసింది. వ్యక్తిగత డేటా ఎక్కడికి వెళ్తుందో, ఎవరు ట్రాక్ చేస్తున్నారో అన్న భయాలు యూజర్లలో పెరుగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో, విదేశీ యాప్‌లకు ప్రత్యామ్నాయంగా, టెక్నాలజీ దిగ్గజం జోహో నుంచి అరైట్టె ఉచిత మెసేజింగ్ ప్లాట్‌ఫామ్ మార్కెట్లోకి బిగ్ ఎంట్రీ ఇచ్చింది. తమిళంలోని ‘అరైట్టె’ అనే మాటకు తెలుగులో ‘సాధారణ సంభాషణ’ అని అర్థం. ఈ యాప్ కేవలం స్వదేశీ ప్రత్యామ్నాయం (మేడ్ ఇన్ ఇండియా) మాత్రమే కాదు, గోప్యత, భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తుండటం అసలు మ్యాటర్. వినియోగదారుల సమాచారం థర్డ్ పార్టీలకు షేర్ చేయబోమని జోహో గ్యారంటీ ఇస్తున్నది. ఈ యాప్ వాయిస్, వీడియో కాల్స్, మీడియా షేరింగ్, గ్రూప్ చాట్, ఆన్లైన్ మీటింగ్స్ లాంటి అనేక సౌకర్యాలను అందిస్తున్నది. అంతేకాదు డేటా సేఫ్టీ, స్పీడ్ విషయంలో వాట్సాప్‌కు గట్టి సవాలే విసిరింది అరైట్టె!
ఐదు ఫీచర్స్ అదుర్స్
లోకల్ సపోర్ట్
ఇది ప్రాంతీయ భాషలకు చక్కని సపోర్ట్ ఇస్తుంది. తక్కువ స్టోరేజీ, డేటాను తీసుకుని, 2G/3G స్మార్ట్ఫోన్లలో కూడా సులభంగా పనిచేస్తుంది. ఇక ప్రైవసీ విషయానికి వస్తే.. వాట్సాప్‌లో అన్ని కమ్యూనికేషన్లకు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉంది. అరైట్టె యాప్‌లో ప్రస్తుతానికి వాయిస్, వీడియో కాల్స్‌కు మాత్రమే ఎన్క్రిప్షన్ ఉంది. టెక్ట్స్ మెసేజెస్‌కు ఈ సదుపాయం లేదు. గ్రూప్స్ విషయానికి వస్తే.. అరైట్టెలో 1,000 మందితో గ్రూప్ క్రియేట్ చేయొచ్చు. వాట్సాప్‌లో 1,024 మెంబర్స్‌తో గ్రూప్స్ క్రియేట్ చేయొచ్చు. అరైట్టె మీటింగ్స్ పేరుతో మీటింగ్ షెడ్యూల్ చేసుకునే సదుపాయం కూడా ఉంది. వాట్సాప్‌లో లేని ‘ఆండ్రాయిడ్ టీవీ సపోర్ట్’ ఫీచర్ ఇందులో ఉంది. యూజర్లు ఆండ్రాయిడ్ టీవీలో తమ అరైట్టె అకౌంట్లోకి లాగిన్ అయి పెద్ద స్క్రీన్ మీద చాటింగ్ చేసుకోవచ్చు. గ్రూప్ కాల్స్ చేసుకునేవారికి ఈ కనెక్టివిటీ మెరుగైన ఎక్స్‌పీరియెన్స్‌ను ఇస్తుంది. అరైట్టె కేవలం ఆండ్రాయిడ్‌కు మాత్రమే కాదు, విండోస్, మాక్, లైనక్స్ సహా ఐదు సాఫ్ట్‌వేర్స్‌ను సపోర్ట్ చేస్తుంది. ఇది తక్కువ మెమరీ ఉన్న స్మార్ట్ఫోన్లలో కూడా ఏ ఇబ్బందీ లేకుండా పని చేస్తుంది. అరైట్టె మీ ఫోన్ బుక్ కాంటాక్ట్స్‌ను ఆటోమేటిక్‌గా సెర్చ్ చేసి.. ఎవరు ఈ యాప్‌ను ఉపయోగిస్తున్నారో చూపిస్తుంది.
ఎలా ఇన్స్టాల్ చేయాలి?
గూగుల్ ప్లే, యాప్ స్టోర్స్ నుంచి ‘అరైట్టె’ యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. జోహో కార్పొరేషన్ డెవలపర్‌గా ఉన్న యాప్‌ను మాత్రమే ఇన్స్టాల్ చేయండి. థర్డ్‌పార్టీ APKల జోలికి పోవొద్దు. యాప్ ఓపెన్ చేసి, మొబైల్ నంబర్‌తో ఓటీపీ వెరిఫై చేయండి. కాంటాక్ట్స్, మైక్రోఫోన్ పర్మిషన్స్ అడిగినప్పుడు జాగ్రత్తగా ఆలోచించి అనుమతులు ఇవ్వండి.
డేటా భద్రత కీలకమైన పాయింట్‌గా అరైట్టె చెబుతున్నది. యూజర్ల డేటా మొత్తం భారతీయ డేటా సెంటర్లలోనే స్టోర్ అవుతుందని కంపెనీ స్పష్టంగా పేర్కొన్నది. ప్రస్తుతం వాయిస్, వీడియో కాల్స్‌కు ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ ఉన్నా.. టెక్ట్స్ మెసేజ్‌లకు పూర్తి భద్రత లేదు. దీనిపై సీఈఓ స్పందిస్తూ.. ’ఎండ్ టు ఎండ్ ఎన్క్రిప్షన్ త్వరలో తీసుకురావడం తమ ప్రధాన లక్ష్యం’ అని ప్రకటించారు.
వాట్సాప్ నుంచి అరైట్టెకి
వాట్సాప్ వాడుతున్న యూజర్లు తమ రోజువారీ కమ్యూనికేషన్స్‌కు ఇబ్బంది లేకుండా, తమ పాత చాట్ హిస్టరీని అరైట్టెకి ఈజీగా ట్రాన్స్ఫర్ చేసుకునే అవకాశం ఉంది. ఈ యాప్‌ను డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కాంటాక్ట్స్ యాక్సెస్ అనుమతి ఇవ్వాలి. వాట్సాప్‌లోకి వెళ్లి ‘ఎక్స్పోర్ట్ చాట్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి. కావాల్సిన కాంటాక్ట్‌లను సెలెక్ట్ చేసుకుని, ‘అటాచ్ మీడియా’పై క్లిక్ చేసి, ఆప్షన్స్‌లో ‘అరైట్టె’ని ఎంచుకుంటే మీ వాట్సాప్ చాట్ అంతా సులువుగా బదిలీ అవుతుంది. ట్రాన్స్ఫర్ చేసే ముందు వాట్సాప్‌లో ‘చాట్ బ్యాకప్’ సెట్ చేసుకుని జీమెయిల్లో బ్యాకప్ తీసుకోవడం ముఖ్యం. వాట్సాప్ సెట్టింగ్స్‌లోకి వెళ్లి చాట్ బ్యాకప్ ఆప్షన్‌ను ఎంచుకుని జీమెయిల్లో వీటిని బ్యాకప్ చేసుకోవచ్చు. అయితే, ఈ చాట్ ట్రాన్స్ఫర్ పూర్తి కావాలంటే మీరు ఎంచుకున్న కాంటాక్ట్ కూడా అరైట్టె ఉండాలి.
-అనిల్ రాచమల్ల
వ్యవస్థాపకులు ఎండ్‌నౌ ఫౌండేషన్