‘బజరంగీ భాయిజాన్’లో చిన్నపాప గుర్తుంది కదా! అమాయకంగా నవ్వుతూనే మాయ చేసేసింది. ఒక్క సినిమాతో ఆల్ ఇండియా ఫేవరేట్ కిడ్‌గా మారిపోయింది. ఆ సినిమాలో పాకిస్థాన్ చిన్నారి పాత్రలో మెరిసిన హర్షాలీ మల్హోత్రా.. టాలీవుడ్లో రంగప్రవేశం చేసింది. బాలయ్య, బోయపాటి కాంబోలో తెరకెక్కిన ‘అఖండ 2’లో జనని పాత్రలో జీవించేసింది. బాలనటిగా మెప్పించిన హర్షాలీ.. నటిగానూ మంచి మార్కులు కొట్టేసింది. చక్కటి సినిమాలు చేస్తూ.. నటిగా గొప్పస్థాయికి చేరుకోవడమే తన లక్ష్యం అంటున్న హర్షాలీ పంచుకున్న కబుర్లు ఇవి..
నాకు చిన్నప్పటి నుంచి సినిమాలు అంటే చాలా ఇష్టం. అనుకోకుండా‘బజరంగీ భాయిజాన్’లో అవకాశం వచ్చింది. ఆ చిత్రంతో నేను ఓవర్‌నైట్ చైల్ట్ స్టార్‌గా మారిపోయాను. పెద్దయ్యే కొద్దీ సినిమాలపై ఇష్టమూ పెరిగింది. నటనపై ఆసక్తీ కలిగింది. పెద్ద స్క్రీన్ మీదనటీనటులను చూస్తుంటే.. నేనూ అలా కనిపించాలని అనుకునేదాన్ని. ఆ కోరిక ఇంత త్వరగా నెరవేరుతుందని అనుకోలేదు.
టీనేజ్‌లోకి వచ్చినప్పటి నుంచి మంచి సినిమా అవకాశం కోసం ఎదురుచూస్తూ ఉన్నాను. సినిమాలపై ఎంత ఇష్టం ఉన్నా.. చదువును నిర్లక్ష్యం చేయలేదు. టెన్త్‌లో 80 శాతానికిపైగా మార్కులు సాధించాను. కథక్ కూడా నేర్చుకున్నాను. చదువుకుంటూనే కొన్ని సీరియల్స్, ప్రకటనల్లో నటించాను. చదువులో తగ్గేది లేదు. యాక్టింగ్ వదిలేదు లేదు.
బజరంగీ భాయిజాన్’లో నా పాత్రకు మాటలు లేవు. వినికిడి శక్తి కూడా ఉండదు. అంత చిన్న వయసులో ఇలాంటి చాలెంజింగ్ రోల్ చేసే అవకాశం రావడం నిజంగా నా అదృష్టమనే చెప్పాలి. అప్పుడు కూడా రకరకాల డౌట్లు అడిగేదాన్ని. ఆ చిత్ర డైరెక్టర్ కబీర్ ఖాన్ సార్, హీరో సల్మాన్ ఖాన్ సార్ చాలా ఓపికగా నాకు అన్ని విషయాలూ చెప్పేవారు.
కొన్ని అర్థం అయ్యేవి, కొన్ని కాకపోయేవి. అర్థం కాకపోయినా.. అర్థమైనట్టు తల ఊపేదాన్ని. నటిగా నా జర్నీ ఇప్పుడే మొదలైంది. మంచి మంచి సినిమాలు చేయాలని ఉంది. రెగ్యులర్ పాత్రలు కాకుండా… కాస్త డిఫరెంట్ రోల్స్ ఎంచుకుంటాను. చాలెంజింగ్ పాత్రలు చేసినప్పుడే కదా.. ప్రేక్షకులకు గుర్తుంటాం.
యాక్టింగ్ కోసం నేను ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నది ఏం లేదు. నా జీన్స్‌లోనే నటన ఉందేమో! డైరెక్టర్ సన్నివేశం చెబుతున్నప్పుడు చాలా ఆసక్తిగా వింటాను. నాకు చాలా సందేహాలు వస్తుంటాయి. వాటిని నిర్మొహమాటంగా అడిగేస్తుంటా. ఈ సీన్‌కు ముందు సన్నివేశం ఏంటి? తర్వాత సీన్ ఏం ఉంటుంది? ఇవన్నీ అడుగుతాను. ఆ పాత్రకంటూ ఒక యాటిట్యూడ్ ఉంటుంది కదా! దానిని దృష్టిలో ఉంచుకొని పెర్ఫార్మ్ చేస్తాను.
తెలుగులో బాలకృష్ణ సార్ నా ఫేవరేట్ యాక్టర్. అల్లు అర్జున్, ప్రభాస్ అన్నా ఇష్టమే! ఇక సంజయ్ లీలా భన్సాలీ, రాజమౌళి సార్ నా ఫేవరేట్ దర్శకులు. వారితో సినిమా చేసే చాన్స్ వస్తే మాత్రం అస్సలు వదులుకోను.
చూస్తుండగానే పదేండ్లు గడిచిపోయాయి. ఇప్పుడు పూర్తిస్థాయి నటిగా మీ ముందుకు వచ్చాను. తెలుగులో మొదటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నాననే చెప్పాలి. మొదట్లో కష్టం అనిపించినా… ఇప్పుడు తెలుగు బాగానే అర్థమవుతున్నది. బాలకృష్ణ లాంటి లెజండరీ యాక్టర్‌తో పనిచేయడం గొప్ప అనుభూతిని ఇచ్చింది. ఆయనతో షూటింగ్ అంటే మొదట భయమేసింది. సీనియర్ నటుడు.. ఎలా రిసీవ్ చేసుకుంటారో అనిపించింది. షూటింగ్ మొదటి రోజే నా అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. నన్నెంతో అభిమానంగా చూసుకున్నారు.