మారేడును దైవ వృక్షం అంటారు. శివుడి అర్చనలో బిల్వానికి ఎంతో ప్రాధాన్యం కనిపిస్తుంది. మూడు మారేడు ఆకులను కలిపి త్రిదళం అంటారు. “త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం” అంటూ మన పూజా విధానంలో బిల్వాష్టకమే ఉంది. కార్తీక సోమవారాల్లో బిల్వార్చన, లక్ష బిల్వార్చనలు చేయడం శ్రేష్ఠమని చెబుతారు పెద్దలు. మహా శివరాత్రి సందర్భంగా పరమేశ్వరుడికి బిల్వార్చన చేస్తే ఎంతో పుణ్యప్రదమని పురాణ వచనం. శివపూజలో తరించే మారేడు చెట్టును హిందువులు పవిత్రమైనదిగా భావిస్తారు. వినాయక చవితినాడు గణపతికి అర్పించే ఏకవింశతి పత్రాల్లో మారేడు రెండోది. మా వనంలో దాదాపు 20 మారేడు వృక్షాలున్నాయి.
మారేడు కాయలు గట్టి పెంకుతో వెలక్కాయల్లా ఇంకా కొంచెం పెద్దగానే కాస్తాయి. ఇందులో అనేక ఔషధ గుణాలు ఉంటాయి. అనేకసార్లు ఉత్తరాదివారు మారేడు కాయను పగులకొట్టుకొని లోపలి గుజ్జును పానీయంగా తయారు చేసుకుని తాగడం నేను చూశాను. ఆయుర్వేద ఔషధాల్లో దీన్ని వాడతారు. అనేక అనారోగ్య సమస్యలకు పరిష్కారాన్ని చూపే ఈ వృక్షం పదునైన ముళ్లను కూడా కలిగి ఉంటుంది. మారేడు చెట్లలో త్రిదళ బిల్వ వృక్షాలు ఎక్కువగా కనిపిస్తాయి. ఏక బిల్వం, మహా బిల్వం (ఐదు దళాలు) వృక్షాలు కూడా ఉంటాయి.
ఆయుర్వేదంలో మారేడు ఫలం, మారేడు బెరుడుతో అనేక ఔషధాలు తయారు చేస్తారు. అతిసార వ్యాధితో బాధపడుతున్న రోగికి ఈ పండ్లలోని గుజ్జుతో రసం చేసి తాగిస్తారు.
– ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు