గ్రౌండ్ ఫ్లోర్లో.. మన స్థలం వీధిని బట్టి ఆగ్నేయం లేదా వాయవ్యం లేదా దక్షిణం మధ్యలో, పడమర భాగంలో స్టాఫ్ గదులు కట్టుకోవచ్చు. అది శుభకరం. యజమానికి ఏదైనా గది ప్రత్యేకంగా అవసరం ఉంటే.. అతను దక్షిణ – నైరుతిలో ఒక గదిని కట్టుకోవచ్చు. ఈ స్థానాన్ని ప్రధానంగా గ్రౌండ్ ఫ్లోర్లో పార్కింగ్ కోసం వదులుతూ ఉంటారు. ఆ చోట యజమాని స్థానం వదిలి, మిగతా భాగం ఇతరులకు ఇవ్వాలి అనేది శాస్త్ర వచనం. కాబట్టి, ఆ చోటు వదిలి కట్టుకోండి. అది అనుకూలంగా ఉంటుంది. తూర్పు రోడ్డు ఉంటే.. ఆగ్నేయంలో, ఉత్తరం రోడ్డు ఉంటే.. వాయవ్యంలో స్టాఫ్ రూమ్ బాగుంటుంది. కొలతలు అనేవి ఈ ఉపగదులకు నిర్దిష్టంగా ఏమీలేవు. వాళ్లకు సరిపడేలా ఉండబుద్ధి అయ్యేలా గది ఉంటే బాగుంటుంది. వారికి ప్రత్యేకంగా టాయిలెట్, చిన్న వంటగది, మంచి వెంటిలేషన్ ఉన్న గదిమాత్రం తప్పనిసరి అవసరం. అవకాశం ఉంటే.. స్థలాన్ని బట్టి ఒక సింగిల్ బెడ్రూమ్ ఇంటిని కూడా కట్టి ఇవ్వవచ్చు. అది మన అనుకూలతను బట్టి ఉంటుంది.
నిట్టాడు గుడిశె కూడా వేసుకోవచ్చు. ‘ఇల్లు కడితే.. ఆర్సీసీతోనే కట్టాలి. భారీగా ఉండాలి. గొప్పగా కట్టాలి’ అని ఎవరూ శాసించరు. ఇల్లు అనేది ఇంటి యజమాని ఆర్థిక స్థితిగతుల మీద ఆధారపడి ఉంటుంది. ఊరిలో బురుజులు, కోటలు నిర్మించిన ఇండ్లు ఎన్నో ఉన్నాయి. పెద్దగా, చిన్నగా ఇండ్లు కట్టుకోవచ్చు. ఎవరు ఎలాంటి ఇల్లు కట్టినా.. అది వారి కుటుంబ జీవనాన్ని నిర్దేశిస్తుంది. వారి ఆరోగ్య, ఐశ్వర్య స్థితిగతులను ప్రభావితం చేస్తుంది. కాబట్టి, మంచి ఆరోగ్యకరమైన ఇల్లు కట్టుకొమ్మని మాత్రమే శాస్త్రం చెబుతుంది. అంతేకానీ, ఊరిలో ఆర్సీసీ ఇండ్లు కట్టొద్దు అని ఎప్పుడూ చెప్పదు. ఒకప్పుడు ఇంత టెక్నాలజీ లేదు కాబట్టి పెంకుటిండ్లు కట్టేవారు. అలాగని అవి తప్పు అనే భావన ఉండకూడదు. వసతితో కూడుకున్నదే వాస్తు శాస్త్రం. దానికి ధనిక – పేద తేడాలేదు. సర్వజనులు బాగుండాలి. అభివృద్ధి పొందాలి అంతే!
ప్రతి అపార్ట్మెంట్లో ఇప్పుడు చాలామంది ఎంజాయ్ చేయాలని మాస్టర్ బెడ్రూమ్కు బాల్కనీలు ఇస్తున్నారు. ఇది చాలా ప్రమాదకరం. మీరు బాల్కనీ బయటికి ఇచ్చి ఉన్నారు కాబట్టి.. వెంటనే దానిని వదిలివేయాలి. ఇంటిలో నుంచి బాల్కనీలోకి వెళ్లకుండా గోడ కట్టండి. పడక గదికి ఉన్న పెద్ద గ్లాస్డోర్ను తోసి, కింది నుంచి మూడు అడుగుల ఎత్తువరకు ఇటుక గోడ కట్టండి. ఆ గోడకు పశ్చిమ – వాయవ్యంలో కిటికీ అమర్చండి. మిగతా భాగం గోడ కట్టినా సరే.. లేదా గ్లాస్‌తో మూసినా సరే! మొత్తానికి మాస్టర్ గదికి బాల్కనీ మాత్రం ఉండకుండా చేయాలి. అటునుంచి బయటికి వెళ్లొద్దు. కొన్నిచోట్ల రూమ్‌ను కట్‌చేసి కూడా బాల్కనీ ఇస్తారు. ఎలా చేసినా.. బాల్కనీ మాత్రం ఉండకుండా, వెంటిలేషన్ ఉండేలా చూసుకొని మూసేయండి.
ప్రాచీన కాలంలో రాళ్లు, కర్రలు మొదలైన వాటితో ఇండ్లు నిర్మించారు. అప్పుడు ఆ రాళ్ల పొడవు, వెడల్పు, దూలాలు, వాటి పొడవులను బట్టి కప్పులు ఉండేవి. ఎనిమిది అడుగుల వెడల్పు గదులు వేసేవారు. అలాగే గూడు కూడా.. అనేక స్తంభాలు దగ్గరదగ్గరగా నిలబెట్టి కట్టేవారు. ఈరోజుల్లో అలాంటి ఇబ్బంది లేదు కదా! భారీ నిర్మాణాలు వచ్చాయి. కొలతలు పెంచుకొని కట్టుకోవచ్చు. ఏదేమైనా.. ఇంటికి కొలత అనే ప్రమాణం ఉంటుంది. అలాగని.. సినిమా హాల్ అంత ఇల్లు కట్టి ఉండగలమా? అంతపెద్ద బెడ్రూమ్ పెట్టగలమా? స్థలం, డబ్బు అనే కాదు ఇక్కడ. వందమంది వంటకు ఎంత మసాలా వాడాలో.. అంతే వాడాలి. ఇద్దరు వ్యక్తులకు ఎంత సామగ్రి వాడాలో.. అంతే వాడాలి అనే ఒక నిర్దిష్టత ఉంది కదా! ఇల్లు కూడా అంతే! ఎలుక శరీరం, ఏనుగు శరీరం ఒకటి కాదుకదా. అలా కుటుంబసభ్యులు, వారి అవసరాల మేరకు ఇంటి కొలతలు సరిచూసుకొని, గృహ రచన చేయాలి.