అశ్వగంధనే వాడుక భాషలో ‘పెన్నేరు గడ్డ’ అంటారు. ఇది ఔషధ మొక్క. ఆయుర్వేద వైద్యంలో ముఖ్యమైన దినుసు. అశ్వగంధ పొదలాగా ఎదుగుతుంది. ఒకటిన్నర మీటర్ల ఎత్తు వరకు పెరుగుతుంది. కాండం నుంచి కొమ్మలు విశాలంగా విస్తరిస్తాయి. కాండానికి ఆకులు దట్టంగా ఉంటాయి. కాండం, కొమ్మలకు నూగు (చిన్న ముల్లులు) ఉంటుంది. పువ్వులు ఆకుపచ్చ రంగులో, పండు ఆరెంజ్, ఎరుపు రంగుల్లో ఉంటాయి. వేళ్లు అనేక ఔషధ గుణాలు కలిగి ఉంటాయి. దీని పండ్లు, విత్తనాలు కూడా అనేక ఔషధాలకు నెలవులే.
అశ్వగంధ లేహ్యం గురించి వినని వారుండరు. అశ్వగంధ ఉదర సంబంధమైన వ్యాధుల నివారణకు దివ్యంగా పనిచేస్తుంది. ఇది జ్ఞాపకశక్తి పెంచుతుంది. కండర వ్యాధుల నివారణలో, నీరసాన్ని తగ్గించడానికి, ఒత్తిడిని నివారించడంలో ఉత్తమంగా పనిచేస్తుందంటారు. క్యాన్సర్ చికిత్సలోనూ దీనిని ఉపయోగిస్తారు. ఈ అశ్వగంధలో విథనోలైడ్స్, ఆల్కలైడ్స్, ట్రిపిల్ టీ గ్లోరైటోన్ అనే రసాయనాలు ఉంటాయి. అశ్వగంధ పొడిని నెయ్యితో కలిపి పంచదారతో తీసుకుంటే నిద్రలేమి సమస్య పరిష్కారం అవుతుంది. అశ్వగంధతో ఏమందు తీసుకున్నా దాని పనితనం రెండింతలు అవుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతారు. అశ్వగంధ ఉత్పత్తులు ఉల్లాసాన్నిచ్చి, ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాయి.
ఇన్ని గుణాలున్న అశ్వగంధకు ప్రపంచ వ్యాప్తంగా ఎంతో డిమాండ్ ఉంది. సమశీతోష్ణంగా ఉండే మన దేశంలో బాగా పెరుగుతుంది. ఉత్తరాది రాష్ట్రాల రైతులు వాణిజ్య పంటగానూ దీనిని పండిస్తున్నారు. పీవీ వనంలో ఈ సంవత్సర కాలంలో ఏకంగా వంద అశ్వగంధ మొక్కలను నాటాం. ఈ మొక్కలను మన వనానికి ఉచితంగా అందించిన గిరిజన సోదరులకు ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
-ఎమ్మెల్సీ సురభి వాణీదేవి, పీవీ కూతురు