పురాతన కాలానికి చెందిన శాసనాలు ఒక రకంగా ఈ కాలం నాటి చట్టాల లాంటివే. మనదేశంలో సింధూ నాగరికతకు సంబంధించినవి లిపితో కూడిన ముద్రలు బయల్పడ్డాయి. బహుశా వీటినే మొదటి శాసనాలుగా పరిగణించవచ్చు. అయితే, సింధూ లిపిని ఇప్పటివరకు అర్థం చేసుకోలేదు. ఆ తర్వాత మౌర్య సార్వభౌముడు అశోకుడి శాసనాలు చరిత్ర ప్రసిద్ధి చెందినవి. ఆయన శాసనాలు తెలుగు నేల మీద కూడా లభించాయి. ఇక తెలంగాణ విషయానికి వస్తే లిపితో కూడిన శాతవాహనుల నాణేలు తొలి శాసనాలుగా భావించవచ్చు. పూర్తి శాసనాలు అంటే విష్ణుకుండినుల నుంచి మొదలవుతాయి.
ఇలా చారిత్రక యుగం ప్రారంభం నుంచి నిజాం నవాబుల కాలం వరకు వివిధ రాజవంశాలు, వారి సామంతుల పాలన కాలానికి సంబంధించి తెలంగాణలో లభించిన ఓ వంద ముఖ్యమైన శాసనాల వివరాలను పరిచయం చేస్తూ డాక్టర్ భిన్నూరి మనోహరి ‘శాసన పర్వం’ పేరుతో పుస్తకంగా వెలువరించారు. విష్ణుకుండినుల నాటివైన ఇంద్రపాలనగరం సంస్కృత శాసనం, హైదరాబాద్ చైతన్యపురి ప్రాకృత శాసనం అప్పటి మత, రాజకీయ పరిస్థితులను వివరిస్తాయి. తెలుగు భాషకు సంబంధించి ప్రసిద్ధిచెందిన కుర్క్యాల బొమ్మలగుట్ట శాసనం తెలంగాణ గడ్డకు చెందినది కావడం విశేషం. కన్నడ ఆదికవి పంపకవి సోదరుడు జినవల్లభుడు వేయించిన ఈ శాసనంలో జైనమత ప్రశస్తితో కూడిన మూడు కంద పద్యాలు ఉన్నాయి. తెలుగు భాషకు ప్రాచీన భాష హోదా విషయంలో కుర్క్యాల శాసనం కూడా కీలకంగా నిలిచింది.
వేములవాడలో కనుగొన్న అరికేసరి శాసనం వేములవాడ చాళుక్యుల వంశ వివరాలను అందిస్తుంది. సైదాపూర్ శాసనం వైద్యాచార్యుడు అగ్గలయ్య గురించి వివరిస్తుంది. కాకతీయ చక్రవర్తులకు చెందినవైతే లెక్కలేనన్ని శాసనాలు లభించాయి. బెక్కల్లు, కటుకూరు, వేయిస్తంభాల గుడి, పాలంపేట, గిర్మాజీపేట, గొనుగు కాలువ మొదలైన శాసనాలు కాకతీయుల కాలపు సామాజిక, ఆర్థిక, రాజకీయ విశేషాలకు ఆధారాలుగా నిలుస్తాయి.
ఆ తర్వాత కాలంలో మహమ్మదీయులైన కుతుబ్‌షాహీ పాలకులు కూడా ప్రజోపయోగకరమైన పనులు చేపట్టారని ఇబ్రహీం కుతుబ్‌షా కాలం నాటి రహమతుల్లా వేయించిన పానగల్లు శాసనం తేటతెల్లం చేస్తుంది. ఇక మొదటిసారిగా తెలంగాణ ప్రస్తావన తెల్లాపురం శాసనంలో కనిపిస్తుంది. ‘నమస్తే తెలంగాణ’ దినపత్రిక ‘చెలిమె’లో వారం వారం ప్రచురితమైన ఈ ‘శాసన పర్వం’ బహుళ ప్రజాదరణ పొందడం విశేషం. ఈ పుస్తకం చదివితే తెలంగాణకు సంబంధించి వివిధ కాలాల్లో భాష, మతం, రాజకీయాలు, సమాజం, ఆర్థికం, శిల్పకళ వృద్ధి వికాసాలు పాఠకులకు పరిచయం అవుతాయి.
రచన: డా.భిన్నూరి మనోహరి
పేజీలు: 273; ధర: రూ. 300
ప్రచురణ: ధ్రువ ఫౌండేషన్
ప్రతులకు: ఫోన్: 93479 71177
రచన: హెచ్.రమేష్‌బాబు
పేజీలు: 128; ధర: రూ. 125
ప్రతులకు: 77807 36386