జరిగిన కథ కళింగాదిత్య మహారాజు సమక్షంలోనే తానే రాజునని ప్రకటించుకుంటాడు ఈసాణుడు. శారీరకంగా, మానసికంగా కుంగిపోయిన చంద్రహత్థిని పరీక్షించి గుణమందియుడు ఏదో చెప్పబోతాడు. ఆ తర్వాత..
గుణ మందియుని సందేహం అర్థం చేసుకున్న రాయహత్థి ఆ వైద్య శ్రేష్ఠునితో ఈ విధంగా పలికింది.. “స్వామీ! మీరు సందేహ పడనవసరం లేదు. ఈ కటిలుడు నీచుడు. వీనికి, చంద్రకు ఏ సంబంధమూ లేదు కానీ, దీని ఈ పరిస్థితికి మరొక యువకుడు కారణమని నాకనిపిస్తున్నది. మూడు వారాల కిందట మీ వైద్యంతో బాగుపడిన పిల్లవాడు మీకు గుర్తుండే ఉంటాడు. అతని పేరు పోటిసుడు. వానిమీద చంద్ర మనసు పారేసుకున్నది. అతను కూడా దీన్ని ప్రేమించినాడు. హఠాత్తుగా వారం రోజుల నాడు దీన్ని ఒంటరిని చేసి వెళ్లినాడు. ఇదంతా ఆ సంఘటన ప్రభావమేనా? లేక మరేదైనా కారణం ఉన్నదా?” సిరివగ్గు దంపతుల వైపు చూసినాడు గుణమందియుడు. దిగులు పడుతున్న ఉల్లోలహత్థి, సిరివగ్గు మార్చిమార్చి తమ బిడ్డను, వైద్యుణ్ని చూడ సాగినారు. “భయపడవలసిన పనిలేదు. శరీరేంద్రియాలు చక్కగా పనిచేస్తున్నాయి. సమయానికి సరైన తిండి పెట్టి, మంచిగా నిద్రపోయేటట్లు చూసుకోండి! నిద్ర సరిగ్గా రావాలంటే మానసిక ఆందోళన తగ్గించే నాలుగు మంచి మాటలతో ఆమెను ఉత్సాహపరచాలి. ఆమె కోరుకున్నది ఆమెకు తప్పక లభిస్తుందనే నమ్మకం ఆమెలో నింపాలి. తొందరగా కోలుకుంటుంది” అని, శారీరకంగా బలంగా తయారయ్యేందుకు అవసరమైన చిట్కాలు చెప్పి, మందులు ఇచ్చినాడు.
పోదన నగరంలో.. కుసుమ శ్రేష్ఠి భవనం చుట్టూ మంటలు వేగంగా వ్యాపిస్తున్నాయి. అది చూస్తున్న ప్రేక్షకులు మహేంద్రజాలంలో మునిగి, అదంతా ప్రదర్శనలో భాగమని అద్భుతాశ్చర్యాలకు లోనవుతున్నారు. “ఆహా! జీవితంలో ఇంత అద్భుత ప్రదర్శన ఎప్పుడూ చూడలేదు. మేం నిజంగా లంకా నగరంలోనే ఉన్నాం. మా కన్నుల ముందే లంక దహించుకొని పోతుంది” అంటూ శ్రేష్ఠి భవనం తగలబడిపోవడం కూడా మాయగా భావిస్తూ.. “ఓహోహో! నిజంగానే కళ్లముందే పెద్దపెద్ద మేడలు తగలబడుతున్నాయి. మనకు సెగ తగులుతున్నట్లు కూడా అనిపిస్తున్నది కదా..” అని ఒకరితో ఒకరు ముచ్చటించుకుంటున్నారు. మరొక పక్క ఇటువంటిదేదో జరుగుతుందని ముందే పసిగట్టిన కువిందుడు తగిన ఏర్పాట్లు చేసుకున్నాడు కానీ, ప్రమాదం ఇంత తీవ్రస్థాయిలో ఉంటుందని మాత్రం ఊహించలేకపోయినాడు. ‘కోటలోని రక్షణదళాన్ని అప్రమత్తం చేసి, శత్రువులను ఎదిరించాలి. లోపల ఉన్న రాణులను, అంతఃపుర స్త్రీలను కాపాడుకోవాలి’ అనుకొని, రక్షణ దళం శత్రువుల మీద దాడిచేసే పని ఒక భటునికి అప్పగించి, తాను ఒక్క ఉదుటున మొదటి అంతస్తులోకి చేరుకున్నాడు. కానీ.. అప్పటికే ఆలస్యమైంది.
రెండు ప్రదేశాల్లో కూర్చున్న జట్లలో అణులచ్చి బృందానికి మంటలు అంటున్నాయి. “అయ్యో! లంకానగరం మంటలు మనదాకా వచ్చినాయి..” అంటూనే ఆనందంతో కూడిన హాహాకారాలు చేస్తూ, తాము తగలబడిపోతున్న సంగతి కూడా గ్రహించలేకపోతున్నారు వాళ్లు.
మరొక ప్రదేశంలో కూర్చున్న పెద్దరాణి, చిన్నరాణి, అలసుద్ది పరిస్థితి కూడా ఇంచుమించు అట్లాగే ఉన్నది. కాకపోతే మంటలు వీళ్లకు ఇప్పుడిప్పుడే అంటుకుంటున్నాయి. ముందుగా అది గ్రహించిన రోహాదేవి అత్తని చూస్తూ.. “అత్తమ్మా! మంటలు మీ వస్ర్తాల దాకా వచ్చినాయి!” అన్నది సంభ్రమాశ్చర్యాలతో. “నిజంగా ఇవి మంటలేనా? ఈ ప్రదర్శకులు మనకు భ్రమ కలిగిస్తున్నారా!?” నమ్మకం కుదరక అంటున్నది పెద్దరాణి సిరిసత్తి. “ఇదంతా నిజంకాదు మహారాణీ! అంతా భ్రమ! చూస్తూ ఉండండి ఆంజనేయస్వామి సముద్రంలో తన తోకను చల్లార్చుకోగానే మంటలు అన్నీ ఆరిపోతాయి..” అలసుద్ది మితిమీరిన ఆనందోత్సాహాలు చూసి చిర్రెత్తుకొచ్చింది కువిందునికి. చెంప ఛెళ్లు మనిపించినాడు. ఆ దెబ్బ ఎంత బలంగా తగిలిందంటే.. ఆరు గజాల అవతల పడ్డది అలసుద్ది. “సుద్దీ!” సింహ గర్జన చేసినాడు కువిందుడు. స్పృహలోకి వచ్చింది అలసుద్ది. “తాతా!” అన్నది చెంప తడుముకుంటూ.
“తాతనే! ఆ ప్రదర్శకులు చెప్పినప్పుడు కళ్లు మూసుకోవద్దని చెప్పినాను కదనే! ఇది లంక కాదే, మన కోట! అంతా తగలబడి పోతున్నదే! నీవు వెంటనే చిన్నరాణి గారిని మెట్ల కింది రహస్య ద్వారం వద్దకు తీసుకొని పో!” దుఃఖం, కోపం కలగలసిన గొంతుతో అరచినాడు కువిందుడు. నిజం గ్రహించిన అలసుద్ది అప్రమత్తమై రోహాదేవిని గుంజుకుని పోసాగింది. పెద్దరాణితో మాట్లాడేంత సమయం లేకపోవడంతో కువిందుడు సరాసరి ఆమెను తన భుజాలకి ఎత్తుకొనబోయినాడు. అంతలో ఎవరో అతన్ని బలంగా తన్నినారు. శత్రువులు ఇంత తొందరగా చొచ్చుకొని వస్తారనుకోలేదు కువిందుడు. మంటల్లో పడిపోబోతూ తనను తాను అదుపు చేసుకొని నిలదొక్కుకున్నాడు. గిరుక్కున వెనుకకు తిరిగి, అరక్షణంలో ఒరలో నుంచి కత్తిని తీసి, ఆగంతకుని కడుపులో దించినాడు. ఆ వెంటనే మరొకడు కత్తితో తన ముందుకు దూకడం చూడగానే.. ఆలస్యం చేయకుండా కిందపడిన వాని కత్తిని కూడా తీసుకొని రెండు చేతులతో కత్తులు పట్టుకుని శత్రువులతో పోరాడ సాగినాడు కువిందుడు. ముందుగా చేసిన సూచనను అనుసరించి కొందరు మొదటి అంతస్తుపైకి నీళ్లు చల్లసాగినారు. అవి మంటలను ఆర్పలేక లేకపోయినాయి కానీ సిరిసత్తి మీద పడి, ఆమెను పూర్తిగా తడిపేసినాయి. దానివల్ల ఆమె మహేంద్రజాలం నుంచి కొంతమేర బయటపడింది, కాకపోతే మంటలు కళ్లలోకి పోవడం వలన ఆమెకు కళ్లు కనిపించడం లేదు. భయం వల్లనో, హఠాత్పరిణామం వల్లనో గానీ, ఆమె కదలలేని స్థితికి చేరుకున్నది. నలుగురిని మట్టికరిపించిన కువిందుడు ఆలస్యం చేయకుండా సిరిసత్తిని భుజానికి ఎత్తుకొని రహస్య ద్వారం వద్దకు చేరుకున్నాడు.
అక్కడ అలసుద్ది ఎదురుచూస్తున్నది.
సిరిసత్తిని అక్కడ దించి..
“వెంటనే తీసుకొని పో! ఆలస్యం చేయకు!” అని గట్టిగా అరచినాడు.
పెద్దరాణిని లోపలికి గుంజుకొని..
“తాతా! నీవు కూడా వచ్చేసేయ్!” అన్నది అలసుద్ది.
“లేదు! నీవు వీళ్లను తోడుకొని పో! నేను ఈ దుర్మార్గుల సంగతి తేల్చుకొని బయట నుంచి వచ్చి, మిమ్ములను కలుస్తాను! తొందరగా పో!” అన్నాడు. “తాతా! ఈ తలుపు ఒకసారి మూసుకుంటే మళ్లా తెరుచుకోదని అన్నావు కదా! వచ్చేసెయ్ తాతా!” ఏడుస్తూ, బతిమాలుతున్నట్లు అన్నది అలసుద్ది. “ఆ సంగతి నాకు తెలుసు! ముందు ద్వారం మూసేయ్!” గట్టిగా గద్దించినాడు కువిందుడు. తప్పనిసరై ద్వారం మూసివేసింది అలసుద్ది. అప్పుడే అక్కడికి చేరుకున్న కల్లణసీహుని మనుషులు వెనుక నుండి కువిందుని మీద మూకుమ్మడిగా దాడి చేసినారు.
రాత్రి రెండవ జాము. జీవితం చాలా అందమైనదని; ఆనందమయంగా, స్వతంత్రంగా గడిపేందుకు ఇన్నాళ్లు పోరాటం చేసి; తనకు నచ్చిన మనిషితో కొత్త జీవితాన్ని ప్రారంభించవచ్చునని అన్ని రకాలుగా సంసిద్ధమైంది సౌగంధిక. అన్నీ అనుకున్నట్లే సాధించుకో గలిగింది కానీ, చివరిక్షణంలో అంతా తలకిందులైపోతున్నది. అందమైన, ఉత్తముడైన వామదేవునితో పరిచయం తన జీవితాన్ని కొత్త మలుపు తిప్పుతుందని అనుకున్నది. మలుపు తిరిగింది నిజమే! కానీ అది తాను అనుకున్నట్లు మాత్రం కాదు! దినమూ రేయీ మదన సామ్రాజ్యాన్ని ఏలుకోవచ్చు అనుకున్నది. ఆమె కలలన్నీ కల్లలైనాయి. ఇప్పుడు క్షణక్షణం – భయంభయంగా గడపవలసి వస్తున్నది! ‘ఆ కత్తికి రెండు వైపులా పదును’ అన్నట్లు ఇప్పుడు ప్రమాదం ఇద్దరి వైపు నుండి తరుముకొస్తున్నది.
తనను వెంబడిస్తూ ఏదో ఒకరకంగా లోబరచుకోవాలన్న దురాలోచనతో ఈసాణుడి మనుషులు వెంటపడి తరుముతున్నారు. దీనివల్ల ప్రియుడు వామదేవుడు కూడా ప్రమాదం చూరుకు వేలాడుతున్నాడు. మరొకపక్క వామదేవుడు అతని మిత్రునికి తోడుగా వచ్చిన నేరానికి; తన ప్రేమను ఆమోదించిన పాపానికి అడకత్తెరలో పోకచెక్క తీరుగా నలుగుతున్నాడు. వామదేవుని పరిస్థితి తలచుకోగానే దుఃఖం ఆగలేదు సౌగంధికకు. అదే సమయంలో దూరాన ఒక ప్రియుడు విరహ గీతం ఆలపిస్తున్నాడు. అది ఆ నిశ్శబ్ద రాత్రిలో స్పష్టంగా వినిపిస్తున్నది. భూ గృహం మధ్యలో నెగడు మండుతున్నది. దూరాన ఓ ప్రియుని గుండె మండుతున్నది. పరిస్థితిని తలుచుకుంటుంటే సౌగంధిక మనసు మండుతున్నది. ఆ మంటల వెలుగులో ఆమె కన్నీటి మెరుపు వామదేవుని కంటపడింది. “సౌగంధీ! ఎందుకు ఏడుస్తున్నావు?” ఆందోళనగా అడిగినాడు. తన బాధను గుండె మాటున దాచుకొని, చమత్కారంగా ఇట్లా అన్నది సౌగంధిక.. “చెఱకు విలుకాని బాణము కఱకఱ మనుచు నెదలోని గాయము దాకన్ వెఱపు గొలుపఁ బాడె ప్రియుడు నఱయుము మన బాధ యట్లె అధికము కాగన్!” (మదనుని చెరకు బాణము కరకరమని కోస్తూ మనసులోని బాధ అనే గాయాన్ని కెలికి.. ఆ పుండు బాధను అధికం చేయగా, భయంకరంగా పాడుకుంటున్నాడు ఒక ప్రియుడు. అది మన బాధలాగే ఉన్నది కదా!). ఎక్కడున్నాడో వాడు పాపం!” అన్నది. జాగ్రత్తగా చెవి ఒగ్గి ఆ పాట విన్నాడు వామదేవుడు.
“నిజమే! ఎవడో విరహబాధితుడు పేగులు మెలిపెట్టేలా బాధపడుతూ పాడుకుంటున్నాడు. సౌగంధీ! ఎంత బాగా కనిపెట్టినావు! అంతకుమించి అద్భుతమైన పోలికతో వాని బాధను మనసుకు తాకేటట్లు చెప్పినావు! చెరకు ఎంత అందంగా ఉంటుందో దాని ఆకు అంత కరుకుగా ఉంటుంది. తెగిందంటే నరకమే! చెరకు బాణంలోని కరకుటమ్ము గుండెను కరకరమని కోయడం ఎంత గొప్ప పోలిక! గుండె కోతను తెలపడానికి ఇంతకు మించిన ఉపమానం ఉండదు సుమీ! పాపం! ఎవడో ఆ బాధితుడు.. ఎక్కడున్నాడో..” అన్నాడు సానుభూతితో. నిజానికి ఆ పాట దూరం నుండి కాదు; అదే భూగృహంలో ఒక మూలన ఎవరికీ కనిపించకుండా కూర్చుని, లోగొంతుకలో చంద్రహత్థిని తలుచుకుంటూ పాడుకుంటున్నాడు పోటిసుడు. అతనిలో అంతర్మథనం ప్రారంభమైంది. అది గుండెలో పెరిగి, శరీరమంతటా నిండి, మెదడును ఆక్రమించేస్తున్నది. చంద్రహత్థిని బాధపెట్టి హఠాత్తుగా బయలుదేరి రావడం అప్పుడు తప్పనిపించలేదు. కానీ తాను తీసుకున్న నిర్ణయానికి తనని నమ్ముకున్న చంద్ర విలవిలలాడిపోవడం, కన్నీటి ముద్దయి తనను అల్లుకొని, దీనంగా చూస్తూండటం కళ్లకు కట్టినట్లుగా ప్రతిక్షణం గుర్తుకొస్తున్నది.
తనను తనకంటే అధికంగా ప్రేమించిన చంద్రహత్థిని ఒకరకంగా వంచించినానేమో అన్న పశ్చాత్తాపం అతణ్ని బాగా కుంగదీయ సాగింది. తన జీవితంలో ప్రేమ విత్తనం చల్లింది అలసుద్ది. కానీ, దాన్ని అంకురింపజేసింది కచ్ఛితంగా చంద్రహత్థి మాత్రమే. అంతేకాదు, దానికి నీళ్లు పోసి ఎరువు వేసి అందమైన చెట్టుగా పెంచింది కూడా ఆమే. అటువంటి ప్రేమమూర్తిని కాదని కర్తవ్యం అనే పేరుతో బంధాలను తెంచుకొని, కాలాన్ని చీల్చుకుంటూ అందనంత దూరం వచ్చేసినాడు. ఇక్కడ పరిస్థితి అంతా అయోమయంగా ఉన్నది. ముందుకు సాగడమా? వెనుకకు వెళ్లడమా? అని సందిగ్ధంలో కొట్టుకోసాగినాడు. ఇప్పుడు వెనుకకు వెళ్లడం కంటే తప్పిదం మరొకటి ఉండదు. బయలుదేరేటప్పుడు గబుక్కున కార్యసాఫల్యం అవుతుందనే ఆశతో ఉన్నాడు కానీ ఇక్కడ పరిస్థితి చాలా దారుణంగా ఉన్నది. భవిష్యత్తు అంతా అగమ్యగోచరంగా అనిపిస్తున్నది. అక్కడ చంద్రహత్థిని వదిలివేసి వచ్చిన పరిస్థితుల కంటే ఈ పరిస్థితులను చక్కదిద్దుకొని, తన లక్ష్యం చేరుకోకుండా వెళ్లడం మరింత దారుణమే కాదు; అవమానకరం; మానవత్వానికి మచ్చ! అది తన నైతిక పతనానికి సంకేతంగా నిలబడుతుంది. అందుకే ఏది ఏమైనా, ఎంత సంక్షోభం తనను కుదిపేసినా తను చేయదలుచుకున్న పని పూర్తిచేయడం ఒక్కటే మార్గంగా అతనికి అనిపించింది. సరిగ్గా అప్పుడే ఎవరో ఒక అపరిచితుడు వామదేవుని వెతుక్కుంటూ అక్కడికి వచ్చినాడు.