న్యూఢిల్లీ: డాలర్‌తో పోలిస్తే రూపాయి పతనం కావడం అనేది ఎక్కువగా చమురు దిగుమతులు, స్టాక్ మార్కెట్లు, వాణిజ్యలోటు కోణంలోనే చర్చకు వస్తున్నది. కానీ విదేశీ డిగ్రీ, చదువు తర్వాత మంచి ఆదాయం సంపాదించాలనే కలలతో ఇండ్లను వదిలివెళ్లిన లక్షలాది భారతీయ విద్యార్థులను సైతం ఇది తీవ్రంగా ప్రభావితం చేస్తున్నది. చదువు కంటే ఎక్కువగా రోజులు ఎలా గడుపాలన్న ఆలోచనలతో విద్యార్థులు సతమతమవుతున్నారు. బలహీనపడుతున్న రూపాయి విలువ విదేశాల్లో ఉన్న అనేక మంది భారతీయ విద్యార్థులను బతుకడానికి బడ్జెట్ వేసుకునేలా చేసింది.
అధికారిక పార్ట్ టైమ్ షిఫ్ట్లతోపాటు డిపార్ట్మెంటల్ స్టోర్లు, రైల్వేస్టేషన్లలో ఫ్లోర్లను తుడవడం వంటి కష్టతరమైన పనులు చేయడం నుంచి, రోజుకు ఒక పూట మాత్రమే తింటూ జీవించడం లేదా అసలు భోజనమే మానేయడం వరకు.. పతనమవుతున్న రూపాయి మధ్య విదేశాలలో చదువుకోవడం అనేది చాలా కఠినంగా మారింది. విపరీతమైన సంపన్న కుటుంబాల నుంచి వచ్చినవారు తప్ప మిగిలిన చాలామంది పరిస్థితి ఇదే. భోజనాలు మానేస్తూ కేవలం మనుగడ కోసమే నిరంతరం పోరాడుతున్నప్పుడు ఇక చదువుపై ఎప్పుడు దృష్టి పెడుతారు? ఈ పోరాటం కేవలం విద్యార్థుల బరువు తగ్గడంలోనే కాకుండా వారి గ్రేడ్లలో కూడా ప్రతిఫలిస్తున్నది.
మహారాష్ట్ర థానే జిల్లాలోని మధ్యతరగతి కుటుంబానికి చెందిన మాన్వి కోలి ఎడ్యుకేషన్ లోన్‌పై చదువుకోవడానికి లండన్ వెళ్లారు. రూపాయి పతనం ప్రభావం అక్కడి విద్యార్థులపై ఎలా ఉందో ఆమె వివరించారు. “లండన్‌లో 8 పౌండ్ల శాండ్విచ్ను కొనుగోలు చేయాలంటే, అది పారేయడానికి కొన్ని గంటల ముందు మాత్రమే సాధ్యమవుతుంది. ‘టూ గుడ్ టు గో’ యాప్ దీనిని 2.5 పౌండ్ల నుంచి 3 పౌండ్లకే విక్రయిస్తుంది. కానీ గడువు ముగిసిపోతున్న ఈ ఆహారాన్ని పొందడానికి విద్యార్థులం స్టోర్‌కు పరుగెత్తాలి. నేను సమయానికి వెళ్లకపోతే మరెవరైనా దానిని దక్కించుకోవచ్చు. కింగ్స్ కాలేజ్ లండన్ నుంచి నా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఈ ఏడాది మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చేముందు దాదాపు మూడు నెలలు నేను లండన్‌లో ఇలాగే తిని బతికాను” అని మాన్వి కోలి చెప్పారు. కోలి భారతదేశం వదిలి వెళ్లినప్పుడు యూఎస్ డాలర్ విలువ సుమారు రూ.85గా ఉండేది.
ఆమె తిరిగి వచ్చేసరికి అది దాదాపు రూ.93కి చేరింది. ప్రస్తుతం 95 దాటిపోయింది. ఏ క్షణంలోనైనా 100 మార్కును తాకొచ్చని నిపుణులు అంటున్నారు. యూకేలోనే కాకుండా అమెరికాలోని యూనివర్సిటీల్లో ప్రస్తుతం చదువుతున్న తన కజిన్, ఫ్రెండ్స్, ఇతర విద్యార్థులు సైతం ‘టూ గుడ్ టు గో’ వంటి యాప్‌ల ద్వారా లభించే డిస్కౌంట్లపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారని కోలి గుర్తు చేసుకున్నారు. కోస్టా కాఫీ, స్టార్‌బక్స్ వంటి ఫుడ్ అవుట్లెట్లు గడువు ముగిసిపోతున్న ఆహారాన్ని ఈ యాప్‌ల్లో ఉంచుతాయి. ఆ లిస్టింగ్ లైవ్‌లోకి వచ్చిన వెంటనే పరుగెత్తాల్సిందే.
ఎందుకంటే ఎవరైనా దానిని మొదట బుక్ చేసుకుంటే అది కొన్ని సెకన్లలోనే అయిపోతుంది అని కోలి అన్నారు. డబ్బు ఆదా చేయడానికి అమెరికాలోని చాలామంది విద్యార్థులు యూనివర్సిటీ నిర్వహించే ఆహార పంపిణీ కార్యక్రమాలపై ఆధారపడతారని న్యూయార్క్ యూనివర్సిటీ విద్యార్థిని సంజన ఎం కుమార్ చెప్పారు. చాలా యూనివర్సిటీలు వారానికి ఒకసారి కూరగాయలు, పాలు, కిరాణా సామగ్రిని పంపిణీ చేస్తాయి. విద్యార్థులు వాటిని తమ రిఫ్రిజిరేటర్లలో నిల్వ చేసుకుంటారని తెలిపారు. విద్యార్థులు అపార్ట్మెంట్లను పంచుకొంటారు. కిరాణా సామగ్రిని కలిసి కొంటారు. డాలర్ బలపడినప్పుడు బయటకు వెళ్లడం, బయట తినడం, సామాజికంగా కలువడం వంటికి మొదటగా కట్ చేయబడతాయి అని సంజన అన్నారు.
చాలా విదేశీ యూనివర్సిటీలు సెమిస్టర్ వారీగా ఫీజులు వసూలు చేస్తుంటాయి. రూపాయి పతనం కావడంతో చివరి సెమిస్టర్ల నాటికి అసలు ఎడ్యుకేషన్ లోన్ మొత్తం సరిపోవడం లేదు. మిగిలిన ఫీజును కవర్ చేయడానికి కుటుంబాలు టాప్ అప్ లోన్లు తీసుకోవాల్సి వస్తున్నది. యూకే, యూఎస్, ఆస్ట్రేలియా, సింగపూర్‌లోని విద్యార్థులందరిదీ ఇదే కథ. విద్యార్థులు కేవలం బయట తినడం మాత్రమే ఆపడం లేదు. క్యాలెండర్ల నుంచి నైట్ అవుట్లు మాయమవుతున్నాయి. క్యాబ్‌ల మాట దేవుడెరుగు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కూడా ఖరీదైనదిగా అనిపించడం ప్రారంభమవుతున్నది.
విద్యార్థులు కొన్నిసార్లు 10 కిలోమీటర్ల మేర సుదూర ప్రయాణాలను కాలినడకన సాగిస్తున్నారు. “యూకేలో పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ చాలా ఖరీదైనది. పీక్ అవర్స్‌లో వన్‌వే ట్యూబ్(మెట్రో) రైడ్ కోసం ఐదు పౌండ్లు ఖర్చవుతుంది. మీరు మెట్రో ఎక్కేముందు రెండుసార్లు ఆలోచిస్తారు” అని కోలి తెలిపారు. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లేదా ఖరీదైన క్యాబ్ రైడ్ల కోసం డబ్బులు ఖర్చు పెట్టడానికి బదులుగా చాలామంది సుదూర ప్రాంతాలకు కాలినడకన వెళ్తున్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఎడిన్బర్గ్లో చదివిన ఐశ్వర్య సేథ్ మాట్లాడుతూ.. చాలామంది విద్యార్థులు పౌండ్రూపాయి ఎక్సేంజ్ రేట్ మెరుగుపడుతుందనే ఆశతో క్వార్టర్లీ వసతి చెల్లింపులను ఆలస్యం చేస్తారు. కానీ చివరికి ఎక్కువ వడ్డీని చెల్లించాల్సి వస్తుంది.
రేటు తగ్గుతుందని ఎదురుచూస్తూ ప్రజలు ఇరుక్కుపోతారని ఆమె చెప్పారు. విద్యార్థులు వారి అవసరాలు తీర్చుకోవడానికి కనీస వేతనం కంటే చాలా తక్కువ వేతనాలకే అదనపు క్యాష్ జాబ్స్ చేస్తారని వివరించారు. ప్రజలు వేర్‌హౌస్ పనులు, రెస్టారెంట్ల కోసం చెత్త సేకరించడం, తుడవడం, మాపింగ్ వంటివి చేస్తారు. చాలామంది రోజుకు ఒకపూట భోజనంతో బతుకుతారు. విపరీతంగా బరువు తగ్గుతారు. ఖర్చులు తగ్గించుకోవడానికి ఒకే గదిని ఏడెనిమిది మంది షేర్ చేసుకొంటారు. ఊహించుకొన్న విద్యార్థి జీవితాన్ని గడపడానికి బదులుగా ఎక్కువ సమయం పని చేయడానికే కేటాయిస్తారని అన్నారు.
నేను యూకే వచ్చినప్పుడు పౌండ్ సుమారు రూ.110గా ఉండేది. ఇప్పుడు అది రూ. 129ని తాకుతున్నది. ఇది ఎడ్యుకేషన్ లోన్లపై చదువుకొనే విద్యార్థులకు భయానకంగా ఉందని లాంకాస్టర్ యూనివర్సిటీ విద్యార్థిని ఆశ్లేష జాదవ్ చెప్పారు. యూకేలోని చాలామంది విద్యార్థులు ఇప్పుడు ‘ఓలియో’ వంటి యాప్‌లపై ఆధారపడుతున్నారని జాదవ్ తెలిపారు. ఇది గడువు ముగియబోతున్న కిరాణా సామగ్రిని ఉచితంగా పంపిణీ చేస్తుంది. నాకు ఆ యాప్ అందుబాటులో లేకపోతే నేను ఆకలితో అలమటించాల్సి వచ్చేదని అన్నారు.
ముంబయికి చెందిన విదేశీ విద్యా సలహాదారు యశ్మెహతా మాట్లాడుతూ.. చాలా మధ్యతరగతి కుటుంబాలు పిల్లలను విదేశాలకు పంపేముందు కేవలం స్పష్టంగా కనిపించే ఖర్చులను మాత్రమే బడ్జెట్ వేసుకుంటారని అన్నారు. ప్రజలు ట్యూషన్ ఫీజులు, రెంట్, విమాన ఛార్జీలను లెక్కిస్తారు. కరెన్సీ హెచ్చుతగ్గులు ఈ ప్రతి ఖర్చును ఎలా పెంచుతాయో వారు పూర్తిగా పరిగణనలోకి తీసుకోరని తెలిపారు. ఎడ్యుకేషన్ లోన్లు రూపాయల్లో తీసుకుంటారు. కానీ ఫీజులు డాలర్లు, పౌండ్లు లేదా యూరోలలో చెల్లించాల్సి ఉంటుంది. కాబట్టి రూపాయి పతనం వారి కుటుంబాలకు భారమని చెప్పారు.