జరిగిన కథ
తన ప్రయత్నానికి అడ్డురావద్దని ఆహవను హెచ్చరిస్తుంది భాణుసత్తి. ఈసాణుడు అవణాయరుతో సహా వామదేవుని, సౌగంధికను భయంకరమైన అడవిలో బంధిస్తాడు. పోటిసుడు.. కుసుమ శ్రేష్ఠిని కలిసి, కొన్ని గడియలపాటు బంధ విముక్తి కోసం ఒక భటునికి వేయి కార్షాపణాలు ఇవ్వాలని చెప్తాడు. మహారాజు సౌరిసంబ వద్దకు ఒక అనుమానితుణ్ని తీసుకొని వస్తారు భటులు. తర్వాత..
చిలుకవాడలో.. పెడరెక్కలు విరిచి కట్టి; చేతులకు, కాళ్లకు సంకెళ్లు తగిలించి ఒక బండి మీద మధ్యలో నిట్రాడు వంటి దూలానికి పోటిసుణ్ని కట్టేసి, పదిమంది వస్తాదులు సవరసత్తి గృహానికి తీసుకొని వచ్చినారు. ఈ విషయం ఒక పరిచారిక సవరసత్తికి తెలియజేయాలని ఆమె మందిరంలోనికి పరుగెత్తింది. అప్పటికే సవరసత్తినీ బంధించి ఉన్నారక్కడ. అయితే పోటిసుణ్ని కట్టేసినంత దారుణంగా కాకుండా, రెండు చేతులు వెనకవైపున కలిపి మణికట్టు వద్ద తాళ్లతో బంధించి ఉన్నారు. ఈసాణుని నమ్మినబంటు అలక్కుడు ఇట్లా అంటున్నాడు.. “చూడు తల్లీ! నేను రాజు చేతిలో కత్తిలాంటి వాడిని. మహారాజుల ఆజ్ఞను ఆచరణలో పెట్టడం తప్ప సొంత నిర్ణయాలు తీసుకోలేని వాణ్ని. తమరిక్కడ నిర్వహించిన కార్యకలాపాలన్నీ తెలిసి.. ఆయన తమరిని, పోటిసుణ్ని ఊరవతల మామిడి తోటలో ఒకరినొకరు చూస్తుండగా తలలు నరికి తీసుకొని రమ్మని చెప్పినారు..” “పోటిసుడా? అతనెవరు?” ఏమీ తెలియనట్లు కనుబొమలు ముడి వేసింది, కంగారును కప్పిపుచ్చుకుంటూ సవరసత్తి. “మీ గుట్టు మట్టులన్నీ మహారాజు కనిపెట్టేసినారమ్మా!” అంటూ.. ప్రశాంతంగా వివరించినాడు అలక్కుడు. “మియాంక తాతనే పోటిసుడు అన్న నిజం ఒక్కటే కాదు; అవణాయరు మందిరంలో చేరిన దేవి రూపంలోని వామదేవుడు, సుద్ది రూపంలోని సౌగంధిక, జాయప వేషంలో ఉన్న జయసేనుడు కూడా పట్టుబడ్డారు.
అవణాయరుతో సహా ఆ ముగ్గురినీ మహారణ్య మధ్యంలో మట్టు పెట్టేందుకు తీసుకొని పోయినారు మహారాజు ఈసాణుల వారు” ఉలిక్కిపడింది సవరసత్తి! ‘ఎంతో పటిష్టమైన యోజనతో ముందుకెళుతున్నాం’ అనుకున్నది సవర. కానీ, ఇంత తొందరగా ఈసాణునుడికి దొరుకుతామని అనుకోలేదు! అందరూ ఒకేసారి దొరికిపోవడం మరింత బాధకు లోను చేసిందామెను. తాను నాలుగు రోజుల క్రితమే పోటిసుణ్ని చంద్రహత్థిని కలుపుతానని మాట ఇచ్చింది కూడా. పరిస్థితులు ఎందుకు ఇట్లా మారిపోయినాయి? ఎవరో తొందరపాటును ప్రదర్శించి ఉంటారు! అందుకే ఈ దుస్థితి. ఎవరు చేసి ఉంటారు??? ‘వామదేవుడు సౌగంధిక చాలా జాగ్రత్తగానే ఉంటారు; జయసేనుణ్ని శంకించడానికి లేదు; పోటిసుడు కూడా మియాంకు తాత వేషంలో బాగా ఒదిగిపోయినాడు..’ ఆమె ఆలోచనలు అవణాయరు దాకా వెళ్లలేదు. అతని భటుడు అల్లడు ఈ డొంకంతా కదలడానికి తీగగా మారినాడన్నది ఆమె ఊహకు అందలేదు. ‘ఇంకా నయం! చంద్రహత్థిని కూడా బంధించలేరు. పాపం! అన్నెం పున్నెం తెలియని అమాయకురా..’ అనుకుంటుండగానే.. “తమరినిప్పుడు ఇంతటి కుట్ర నడిపించిన ప్రత్యేక ప్రదేశానికి తీసుకొని వెళ్లవలసి ఉన్నది. పోటిసుణ్ని కూడా అక్కడికే తీసుకొని పోతున్నాం!” అన్నాడు అలక్కుడు. “ఎక్కడికి?” ఏమీ తెలియనట్లు పైకి అన్నది సవర. “మామిడి తోటలో ఉన్న భూ..గృ..హా..నికి..” ఒక్కొక్క అక్షరం వత్తి పలికినాడు అలక్కుడు. సవర కాళ్ల కింద నేల కదిలినట్లయింది.
ఈసాణుడు, అతని ముఖ్య అనుచరుడు అలక్కుడు అంతఃపురంలో లేరని నిర్ధారణ చేసుకున్న చీకటి గదుల కాపలాదారు.. కుసుమ శ్రేష్ఠిని బంధించి ఉంచిన గది వద్దకు చేరుకున్నాడు. ‘నిన్నటి రోజు వెయ్యి కార్షాపణాలు ఇస్తానన్నాడు కదా! ఎప్పుడు ఇస్తాడో, ఎట్లా ఇస్తాడో తెలుసుకొని.. కొన్ని గడియల కోసం అతణ్ని పంపించాలి!’ అనుకుంటూ గది తెరిచి లోపలికి వెళ్లి, కుసుమ శ్రేష్ఠిని దర్శించుకున్నాడు. “స్వామీ! తమరు వాగ్దానం చేసిన కార్షాపణాలు..” “నాయనా! ఇప్పటికిప్పుడు నావద్ద ధనం లేదు! ఉన్న ఆభరణాలన్నీ మీ రాజు.. అదే ఈసాణుడు వొలుచుకున్నాడు. నేను విడుదలైన పిమ్మట పదివేల కార్షాపణాలు ఇవ్వగలను!” అన్నాడు శ్రేష్ఠి. “అవును లెండి! ఇప్పటికిప్పుడు తమరివ్వలేరు! విడుదలైన పిదప ఎప్పుడు ఇస్తారు? ఎలా ఇస్తారు?” కాపలాదారు సందేహం. “నన్ను సందేహించనవసరం లేదు నాయనా! విడుదల కాగానే నిన్ను కూడా మావెంట తీసుకొని పోతాం. నీకు వాగ్దానం చేసిన ధనం మొత్తం ఒకేసారి ఇచ్చి పంపిస్తాను!” అన్నాడు గంభీరంగా. అతనికి శ్రేష్ఠి మాటల మీద నమ్మకం ఏర్పడ్డది. గది బయటికి తీసుకుని వచ్చి, కొన్ని నిమిషాలపాటు అక్కడనే కూర్చొమ్మని చెప్పి, ఎక్కడికో పోయినాడు. అతను తిరిగి వచ్చేటప్పటికి శ్రేష్ఠి వెలుతురుకు కాస్త అలవాటు పడ్డాడు.
అంతలో ఆ కాపలాదారు.. మహారాజును ఈ శ్రేష్ఠిగారు కలవడానికి అడ్డంకులు ఏమైనా ఉన్నాయేమో చూసుకొని వచ్చినాడు. తర్వాత తానే స్వయంగా మహారాజు కళింగాదిత్యుల మందిరానికి తోడుకొని పోయినాడు. కళింగాదిత్యుడు కుసుమ శ్రేష్ఠిని గుర్తించినాడు. కుసుమ శ్రేష్ఠి జరిగిన కథనంతా వివరించినాడు. “శాంతి మార్గం మంచిదే! కానీ, మన మంచితనం బలహీనతగా; మన సహనం అసమర్థతగా; మన యుద్ధ విముఖత పిరికితనంగా భావించి శత్రువులు మన మీద దాడికి సిద్ధపడ్డా ఏమరుపాటు లేకుండా తిప్పి కొట్టగలిగితేనే మనం క్షేమం గా ఉండి, రాజ్యాన్ని సుభిక్షంగా ఉంచగలం! పౌరులకు భద్రమైన జీవితాన్ని ఇవ్వగలం!” అంటూ తన దుస్థితికి తానే కారణం అన్న కోణంలో ఇంకా ఏదో చెప్పబోయినాడు కళింగాదిత్యుడు. “మన్నించండి మహారాజా! మీరు ఆత్మ విమర్శ చేసుకోవడం అవసరమే. అట్లాగని మిమ్ములను మీరు తక్కువ చేసుకోవడం మాత్రం సరికాదు! మీపై బయటి శత్రువులు ఎవరూ దాడి చేయలేదు. ఇది అంతశ్శత్రువుల కుట్ర! నమ్మిన వాళ్లు చేసిన మోసం! దగా!” అన్నాడు ఒకింత ఆవేశంగా కుసుమ శ్రేష్ఠి. “అవును! ఇప్పుడు సమయం లభించింది! సందర్భం కుదిరింది! అప్రమత్తం కావలసిన తరుణమిది! ఈ విషయాలన్నీ మహారాణితో చర్చించి తగినవిధంగా ముందుకు సాగడం మంచిది. ఈ లోపున తమరు స్నానాదికాలు పూర్తి చేసుకొని రండి!”అంటూ ఒక పరిచారికను చూసినాడు. ఆమె దగ్గరగా వచ్చింది. “ఆజ్ఞ ప్రభూ!” అన్నది. “మహారాణి గారిని తోడుకొని రా!” అన్నాడు.
ఆమె కదలబోయింది.. “మహారాజు గారి ఆజ్ఞ లేకుండా ఎవరూ కదలడానికి లేదు!” అంటూ పరిచారికను ముందుకు వెళ్లకుండా అడ్డుకున్నాడు ఈసాణుడు నియమించిన ప్రత్యేక బంటు.. విదగ్ధుడు. సహించలేక పోయినాడు మహారాజు కళింగాదిత్యుడు. గబుక్కున లేచి, చరచరా వాని వద్దకు పోయి చెంప పగులగొట్టినాడు! ఎంత బలంగా కొట్టినాడంటే.. ఆ దెబ్బకు వాడు అల్లంత దూరాన పడిపోయినాడు. “ఎవడ్రా మహారాజు? ఎవరు రాజో.. ఎవరు రాజు కాదో గుర్తించలేని అజ్ఞాని!” అన్నాడు. వాడు మరుక్షణం లేచి సంధించిన బాణంలా అక్కడి నుంచి పరుగు లంకించుకున్నాడు. అంతలో.. “ప్రభూ! శ్రేష్ఠిగారిని పంపండి. వారిని యథాస్థానంలో ఉంచవలె!” అన్నాడు ఇంతకుముందు కుసుమ శ్రేష్ఠిని అక్కడ వదిలిన కాపలాదారు. “ఒరేయ్.. నీ పేరేమిటి?” ఆగ్రహం నిగ్రహించుకుంటూ అడిగినాడు కళింగాదిత్యుడు. “ప్రభూ! నా పేరు మానుడు” తలవంచుకొని వినాయంగా చెప్పినాడు వాడు. “ఒరేయ్ మానుడూ! ఈ రాజ్యానికి రాజెవ్వరు రా?” “తమరే ప్రభూ!” “నిన్ను ఆజ్ఞాపించిన వారెవరురా?” “సేనాధిపతులవారు.. ఈసాణ మహారాజు!” “నేను మహారాజునై ఉండగా.. ఈసాణుడు మహారాజు ఎట్లయినాడు రా?” “సేనాపతి గారు అట్లా పిలువమన్నారు ప్రభూ!” “సేనాపతి రేపు నన్ను చంపమంటే చంపేస్తావా?” తల వంచుకున్నాడు మానుడు.
“సేనాపతి ఎవరి ఆజ్ఞను పాటించాలి?” “తమరి ఆజ్ఞనే మహారాజా!” “తప్పు చేస్తే దండించే అధికారం ఎవరికి ఉంటుంది?” “సేనాపతికే ప్రభూ!” “సేనాపతి తప్పు చేస్తే?” “తమరే దండించాలి ప్రభూ!” “అంటే.. ఎవరు తప్పు చేసినా దండించే అధికారం సేనాపతికి ఉన్నదా? నాకున్నదా?” విషయం అర్థమై ఉన్నచోటనే మోకాళ్ల మీద కూలబడి, చేతులు జోడించి, కన్నీళ్లు పెట్టుకున్నాడు మానుడు. “ప్రభూ! నన్ను క్షమించండి! దయచేసి దండించకండి!” అన్నాడు. అప్పుడు మహారాజు కళింగాదిత్యునికి ఒక ఆలోచన వచ్చింది. “ఒరే మానుడూ! నిన్ను క్షమించాలి అంటే నీవు ఒక పని చేయాలి!” “చిత్తం ప్రభూ!” అన్నాడు వాడు. “వెంటనే అంతఃపురంలో ఎంతమంది భటులు, పరిచారకులు, పరిచారికలు ఉన్నారో లెక్కించు! అందర్నీ వెంటనే నా సమక్షంలోకి వచ్చి నిలబడుమని చెప్పు!” ఆజ్ఞాపించినాడు అసలైన మహారాజు. “చిత్తం! మహారాజా!” అంటూ పరుగెత్తినాడు మానుడు.
ప్రేమ అనేది విచిత్రమైన పదార్థం. మనసు లాగే అది అమూర్తం. అంటే కనులకు కనిపించనిది. నిజానికి అదొక భావన. దాన్ని ఎప్పుడూ కోరిక అంటిపెట్టుకొని ఉంటుంది. కోరిక కీర్తిని అంటి పెట్టుకుంటే అది దేశం వైపు; ప్రభువు వైపు; సమాజం వైపు;పది మందికి సాయం చేసే దిశగా ప్రయాణిస్తూ ఉంటుంది. కుటుంబం పట్ల నిలిచి ఉంటే తన కుటుంబ శ్రేయస్సును, సంక్షేమాన్ని పెంచేందుకు ఆరాటపడుతూ ఉంటుంది. అదే ప్రేయసి యెడలనో, ప్రియుని యెడలనో ఉంటే వాళ్లకోసం ఎంతకు తెగించడానికైనా, ఏం చేయడానికైనా వెనుకాడదు. భాణుసత్తి, ప్రణాలానందులను ఇప్పుడు ఆ ప్రేమ కాంక్ష పట్టిపీడిస్తున్నది. నిన్నటి వరకు భాణుసత్తి వైపు నుండి ఏకపక్షంగా సాగిన ప్రేమ.. సూదంటురాయి రాపిడితో ఇనుప ముక్క కూడా సూదంటురాయిగా మారినట్లు.. ప్రణాళానందుడు కూడా ఇప్పుడు పూర్తిగా ప్రణయ స్వరూపుడైనాడు. ఆహవకు ఏం చేయాలనో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. కోడలిని ఆనందునికి చేరువ చేసింది పెద్దరాణి గారే. ఆమె ఆలోచనలు ఆమెవి. లేని వానికోసం ఉన్నవాణ్ని వదులుకో లేనని, ఎవరైనా అడ్డొస్తే వాళ్ల అంతం చూస్తానని తెగింపును ప్రకటించింది చిన్న రాణి.
ఆనందుడే వీళ్లిద్దరి కంటే నయం. అతను తప్పు చేయలేదు; తప్పు చేయకుండా అతణ్ని ఏదో శక్తి అడ్డుకుంటున్నది. కానీ.. నిన్న మధ్యాహ్నం నుండి అతను కనిపించడం లేదు! ఎక్కడికి వెళ్లినాడో!? ఈ భాణుసత్తి అప్పటి నుంచీ గుమ్మానికి తన కళ్లను వేలాడదీసి కూర్చున్నది. హఠాత్తుగా ప్రత్యక్షమైనాడు ఆనందుడు! అతన్ని చూడగానే ఆనందించవలసిన భాణు కూడా ఆశ్చర్యపోయింది ఆహవతోపాటు. అతను అచ్చంగా శ్రమణకుడై వచ్చినాడు! నున్నగా గీసుకున్న తల; గడ్డం. కాషాయ వస్త్రాలు; చేతిలో ఔషధపు మొక్కలు.. “అమ్మా! ఒక్కసారి మాతృమూర్తిని బయటికి రమ్మను!” అన్నాడు ఆహవతో. ఆహవ మరింత ఆశ్చర్యపోయింది. మనిషి వేషంతోపాటు భాష కూడా మారిపోయింది. ఆనందం పట్టలేక ‘బావా!’ అని పిలవాలి అనుకొని, బలవంతంగా తనను తాను అదుపు చేసుకున్నది. అంతలోనే తేరుకొని, చెప్పిన పని యాంత్రికంగా చేసింది. “ఎందుకు నాయనా లోపలికి రాలేదు” అన్నది కమలసత్తి, వాత్సల్యం ఉట్టిపడుతుండగా. “అమ్మా! నీకు కంటి చూపును పూర్తిగా తేగలిగే దివ్యౌషధం తీసుకొని వచ్చినాను. ఈ ఆకుపసరు కంటిలో వేసుకుని నాలుగు గడియలపాటు కదలకుండా పడుకోవాలి. తర్వాత నెమ్మది నెమ్మదిగా కనులు తెరవాలి. ఆ తర్వాత చన్నీటితో కడుక్కోవాలి. ఇక ఆపై మీరు అన్నీ స్పష్టంగా చూడగలుగుతారు” “ముందుగా నిన్నే చూడాలి నాయనా!” సంతోషం కన్నీటి ప్రవాహమైంది కమలసత్తికి.
“మన్నించాలి మాతా! మీరు కనులు తెరిచేటప్పటికి నేను చేరుకోలేనంత దూరంలో ఉంటాను. ఇది భగవదాదేశం! దీన్ని ఎవ్వరూ మీరలేరు!” అని, ఆహవతో.. “అమ్మా! ఈ దివ్యౌషధం ఆమె శుచి అయిన తర్వాత దక్షిణ దిశగా తల చేసి పడుకోబెట్టి, రెండు కన్నుల్లో మూడేసి చుక్కలు చొప్పున వేయండి!” అంటూ ఆకు రెమ్మలను ఆహవ చేతికిచ్చి వెనుదిరిగి చూడకుండా వెళ్లినాడు ప్రణాలానందుడు. కొద్దిసేపటి వరకు శిలా ప్రతిమలా కూర్చుండిపోయింది భాణు. ఆహవ శ్రద్ధగా కమలసత్తికి వైద్యం చేయడంలో లీనమైంది. హఠాత్తుగా భాణు లేచి గడప దాటి వెళ్లడం ఆహవ గమనించలేదు. భాణు గుమ్మం దాటి చూడగా ఆనందుడు మలుపు తిరుగుతున్నాడు. పరుగు లాంటి నడకతో అతణ్ని చేరుకున్నది భాణు. దారికి అడ్డంగా వెళ్లి నిలబడి, అతని మనసును చదివేందుకు కళ్లలోకి చూసింది. ఆనందుడు కూడా ఆమెను ఆరాధనగా చూస్తూ ఉండిపోయినాడు.. అతని మోము నామె; ఆమె మోము నతండు వలపు నిండి, రెప్ప వాల్చకుండ చూచుకొనుచు నిలిచి చోద్యమ్ముగా బాహ్య జగతి మరచినారు సంభ్రమమున! (ఆమె అతని ముఖాన్ని; అతను ఆమె ముఖాన్ని ప్రేమ నిండిన చూపులతో రెప్పవాల్చకుండా చూస్తున్నారు. ఈ లోకాన్ని మరచి సంభ్రమంగా ఒకరినొకరు అట్లా చూసుకుంటూ నిలబడిపోవడం విచిత్రంగా ఉన్నది)