ఎల్బీనగర్, ఆగస్టు 29: కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులను దగా చేసిందని, ఇప్పటికే ఒక్కో దివ్యాంగుడికి రేవంత్‌రెడ్డి సర్కారు రూ.66 వేలు బాకీ పడిందని మాజీ మంత్రి, శాసనసభా పక్ష ఉప నేత తన్నీరు హరీశ్‌రావు విమర్శించారు. ఎల్బీనగర్లోని జీఎస్ఆర్ కన్వెన్షన్‌లో ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన దివ్యాంగుల సమర శంఖారావం సభకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడుతూ దివ్యాంగుల పట్ల ఈ ప్రభుత్వానికి కనీసం మానవత్వం లేదని విమర్శించారు. దివ్యాంగులను మోసం చేసిన రేవంత్‌రెడ్డికి గట్టిగా బుద్ది చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
ప్రతి దివ్యాంగుడు ఒక్కో గ్రామాన్ని చైతన్యం చేయడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వం చేసిన మోసాలను ఎండగట్టాలన్నారు. గతంలో దివ్యాంగులకు ఉన్న రూ. 500 పెన్షన్‌ను రూ. 4.016 చేసింది కేసీఆరేనని అన్నారు. ఎన్నికలకు ముందు దివ్యాంగుల కోసం ఇచ్చిన హీమీలు, మెనిఫెస్టోలో పెట్టిన హామీలు అధికారంలోకి వచ్చి రెండేైళ్లెనా నెరవేర్చకుండా వారిని కనీసం పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న తీరుపై ఆయన మండిపడ్డారు. దివ్యాంగులకు ఇస్తామన్న రూ. 6 వేల పెన్షన్, బ్యాక్లాగ్ పోస్టులు, ఉచిత బస్సు ప్రయాణం ఏమైందని ఆయన ప్రశ్నించారు.. దివ్యాంగులకు కల్పించాల్సిన సౌకర్యాలకు డబ్బులు లేవంటున్న రేవంత్‌రెడ్డి బడా కాంట్రాక్టర్లకు ఇస్తే కమీషన్లు వస్తాయని, దివ్యాంగులకు ఇస్తే రావని నిధులు ఇవ్వడం లేదని విమర్శించారు.
అందాల పోటీలకు, ఫుట్‌బాల్ సోకులకు, ఫ్యూచర్ సిటీ, మూసీ కోసం డబ్బులు ఉన్నాయి కానీ పింఛన్లకు లేవా అని ఆయన ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి 30 వేల కోట్ల భూములు అమ్మాడని, వందల కోట్ల ఆస్తులు తమ్ముడికి కట్టబెట్టాడని, హామీలు అడిగితే తప్పు బడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేసీఆర్ నాడు దివ్యాంగులను కుటుంబ సభ్యులుగా చూసుకున్నారని, పెన్షన్ల కోసం రూ. 54 వేల కోట్లు ఖర్చు చేస్తే అందులో దివ్యాంగుల కోసమే రూ. 10,300 కోట్లు అందించారన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా దివ్యాంగులకు డబుల్ బెడ్రూం ఇండ్లలో 5 శాతం రిజర్వేషన్, విద్యా, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించింది కేసీఆరేనని అన్నారు.
తెలంగాణలో దివ్యాంగుల హక్కుల చట్టాన్ని అత్యుత్తమంగా అమలు చేసి దేశంలోనే నెంబర్‌వన్‌గా అవార్డులు గెలుచుకుందన్నారు. రేవంత్‌రెడ్డి ప్రతినెలా ఇవ్వాల్సిన పింఛన్లు కూడా ఒక నెల ఇస్తూ మరో నెల ఎగ్గొడుతున్నారని ఆరోపించారు. రేవంత్‌రెడ్డి అధికారంలోకి వచ్చి 33 నెలలు గడిచిందని, రాష్ట్రంలోని 5.11 లక్షల మంది దివ్యాంగులకు కాంగ్రెస్ ఇచ్చిన హామీ ప్రకారం లెక్కిస్తే ఒక్కొక్కరికి రూ.66 వేలు బాకీ పడ్డారన్నారు. ఎన్నికలు దగ్గర పడే సమయంలో ఆరు మాసాల పింఛన్ విదిలించి ప్రజలను మభ్యపెట్టొచ్చని అనుకుంటున్నారేమోనని, దివ్యాంగులు మీ మోసాలను మర్చిపోరు, మీమ్మల్ని వదలరని అన్నారు. దివ్యాంగులు తమ సత్తా, శక్తి ఏమిటో రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వానికి చూపించాలన్నారు.
రేవంత్‌రెడ్డికి, కాంగ్రెస్ ప్రభుత్వానికి కేవలం రియల్ ఎస్టేట్ దందాలు మాత్రమే తెలుసు కానీ బీఆర్ఎస్కు ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేయడం తెలుసని అన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీల ప్రకారం వంద రోజులు అని చెప్పిన కాంగ్రెస్‌కు వెయ్యి రోజులు పూర్తయ్యాయని, హామీలు ఇంకేప్పుడు నెరవేరుస్తారని ఆయన ప్రశ్నించారు. దివ్యాంగుల హక్కుల సాధన కోసం త్వరలోనే ఇందిరాపార్కు వద్ద మహా ధర్నా చేపడుతామని ఆయన హెచ్చరించారు. ఎన్నికల ముందు ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీల పేరిట డిక్లరేషన్లు ఇచ్చి అధికారంలోకి వచ్చాక ఒక్కటంటే ఒక్క హామీని అమలు చేయడం లేదన్నారు.
చంద్రబాబును గురువుగా ఆదర్శంగా చెప్పే రేవంత్‌రెడ్డి పక్క రాష్ట్రంలో పెన్షన్ రూ. 6 వేలు ఇస్తుండగా ఇక్కడ ఎప్పుడు ఇస్తారని నిలదీశారు. పేద అడబిడ్డలకు అండగా ఉన్న కల్యాణలక్ష్మీ, షాదీ ముబారక్ పథకాలను కూడా నిలిపివేసే కుట్రలు చేస్తున్నారని, కోర్టు స్టే పేరుతో తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారని, అదే హైడ్రా కూల్చివేతలను ఆపాలని కోర్టు స్పష్టంగా ఆదేశించినా ఎందుకు అమలు చేయడం లేదని ఆయన ప్రశ్నించారు. కేసీఆర్‌తో మాట్లాడి త్వరలోనే బీఆర్ఎస్లో దివ్యాంగుల విభాగాన్ని ఏర్పాటు చేసి నిరంతరం సమస్యలకు అండగా ఉంటామన్నారు. మాజీ మంత్రి, సనత్‌నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ అధికారం కోసం దివ్యాంగులను మోసం చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానిదేనని అన్నారు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వెయ్యి రోజులైనా ఒక్క హామీ అమలు చేయలేదన్నారు.
సమస్యల పరిష్కారం కోసం దివ్యాంగుల సంఘాలన్నీ ఒక్కతాటిపైకి రావాలని, కలిసికట్టుగా పోరాటం చేయాలని కోరారు. సెప్టెంబర్ 4వ తేదీన ఇందిరాపార్కు వద్ద నిర్వహించే భారీ ధర్నాను విజయవంతం చేయాలన్నారు. మాజీ మంత్రి, మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ దివ్యాంగుల న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం పోరాటం చేస్తామన్నారు. దివ్యాంగులకు అన్ని విధాలుగా అండగా ఉంటామన్నారు. రేవంత్‌రెడ్డి ప్రభుత్వం దివ్యాంగులనే కాకుండా అన్ని వర్గాల ప్రజలను మోసం చేసిందన్నారు. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి మాట్లాడుతూ దివ్యాంగులకు అమలు కాని హామీలిచ్చి తీరా అధికారంలోకి వచ్చాక ఆ హామీలను అమలు చేయకుండా దగా చేస్తోందన్నారు.
దివ్యాంగుల హక్కుల సాధన కోసం బీఆర్ఎస్ అన్ని విధలుగా అండగా ఉంటుందన్నారు. దివ్యాంగులకు చేసిన అన్యాయాలను ఎండ గట్టేందుకే దివ్యాంగుల సమర శంఖారావాన్ని నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి, వికలాంగుల సహకార సంస్థ మాజీ ఛైర్మన్ వాసుదేవరెడ్డి, తెలంగాణ వికలాంగుల నెట్వర్క్ అధ్యక్షుడు ఎం.శ్రీనివాస్, మాజీ కార్పొరేషన్ ఛైర్మన్లు ఎర్రోళ్ల శ్రీనివాస్, దేవీ ప్రసాద్, పల్లె రవికుమార్, నాయకులు కటికరెడ్డి అరవింద్‌రెడ్డి, మాధవరం నర్సింహా రావు, లింగాల రాహుల్ గౌడ్, చెన్నగోని శ్రీధర్ గౌడ్, వికలాంగుల సంఘాల నాయకులు నాగభుషణం, రాజ్యలక్ష్మి, వెంకట్‌రెడ్డి, గిద్దె రాజేష్, సైదులు, మల్లేష్, ధనమ్మ, ధండు శంకర్, నయీం తదితరులు పాల్గొన్నారు.

డబుల్ బెడ్రూమ్ ఇండ్లలో 5శాతం ఇవ్వాలి
కాంగ్రెస్ ప్రభుత్వం దివ్యాంగులకు ఇచ్చిన ఆరు హామీలను నెరవేర్చలేదు. కేసీఆర్ గతంలో ఇచ్చిన హామీలను నెరవేర్చారు. దివ్యాంగుల సమస్యలపై ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి సభ పెట్టడం ఎంతో సంతోషం. డబుల్ బెడ్రూంలో 5 శాతం ఇవ్వడానికి కూడా సీఎం రేవంతరెడ్డి సంకోచిస్తున్నాడు. ఈ రోజు పది వేలు కట్టి తర్వాత ఆరు లక్షలు సకలాంగులతో పాటుగా వికలాంగులు కూడా కట్టాలంటే ఎక్కడ నుండి తెస్తాం. పెన్షన్ మాత్రమే కాదు, బ్యాక్లాగ్ పోస్టులు, ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం కల్పించాలి. వికలాంగుల మహిళలను కూడా మహిళా శాఖలో కలిపేశారు. వికలాంగులకు మహిళా శాఖ నుండి వేరు చేస్తామని హామీ ఇచ్చిన రేవంత్‌రెడ్డి తర్వాత పట్టించుకోవడం లేదు. మేం ఎన్నో ఇబ్బందులతో ఉన్నాం. ఆర్థికంగా ఎంతో ఇబ్బందులు పడుతున్నాం. మాకు అన్ని విధాలుగా అన్యాయం చేస్తున్న రేవంతరెడ్డి ప్రభుత్వం పోయి కేసీఆర్ ప్రభుత్వం రావాలని కోరుతున్నాం.
– దోరపల్లి ధనమ్మ, విశ్వవిద్యాలయాల దివ్యాంగుల ఫోరం, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు
ఉద్యోగాల్లో 4శాతం రిజర్వేషన్లు కల్పించాలి
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఉద్యోగాల్లో 4 శాతం, ప్రభుత్వ పథకాల్లో 5 శాతం అమలు చేస్తామని చేయడం లేదు. స్థానిక సంస్థల్లో వికలాంగులకు అవకాశం కల్పిస్తామని చెప్పి రెండున్నర ఏళ్లుగా స్పందన లేదు. చత్తీస్గడ్ మాదిరిగా ఇస్తామన్నారు. కానీ పట్టించుకోవడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హీమీలు నెరవేర్చనందుకే ఈ పోరాటం. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ వికలాంగులకు అండగా నిలుస్తోంది. దీనిని మేం హర్షిస్తున్నాం. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డికి వికలాంగుల సంఘాలతో దాదాపు 40 ఏళ్ల అనుబంధం ఉంది. ఈ నేపథ్యంలోనే సుధీర్‌రెడ్డి మాకు అండగా నిలిచారు. అదే రీతిలో ప్రతి ఎమ్మెల్యే వికలాంగులకు అండగా ఉండాలి. వికలాంగుల అంశంపై అసెంబ్లీలలో ప్రస్తావించాలి. బీఆర్ఎస్లో వికలాంగుల విభాగాన్ని ఏర్పాటు చేస్తే క్రీయాశీలకంగా పనిచేస్తాం. మా హక్కుల కోసం పోరాడుతాం.
– ఎం. శ్రీనివాసులు, తెలంగాణ వికలాంగుల నెట్వర్క్ అధ్యక్షుడు
ఇచ్చిన ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదు
27 నెలల్లో దివ్యాంగుల సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం కనీసం పట్టించుకోలేదు. ఏ ఒక్క హామీనీ నెరవేర్చలేదు. కాంగ్రెస్ ప్రత్యేకంగా మేనిఫెస్టోలో దివ్యాంగుల సంక్షేమం కోసం 4వేల పెన్షన్‌ను ఆరువేలు చేస్తామన్నారు. నేటికీ ఆర్టీసీలో ఉచిత బస్సు ప్రయాణం కల్పించలేదు. దివ్యాంగుల 2016 యాక్ట్‌ను పకడ్బందీగా అమలు చేస్తామని, కనీసం రివ్యూ మీటింగ్ కూడా పెట్టలేదు. బ్యాక్ లాగ్ ఉద్యోగాలపై పోరాటం చేస్తే మొన్న జీవో ఇచ్చి వదిలేశారు. దీనికి ఎన్ని రోజులు పడుతుందో. దివ్యాంగుల సమాజానికి ఇచ్చిన హామీలు నెరవేర్చాలి. పక్క రాష్ట్రంలో మీ గురువు చంద్రబాబు దివ్యాంగుల సమస్యలను పరిష్కారం చేస్తున్నాడు కదా. అలాగే నెరవేర్చండి. మిగతా వాటికి డబ్బులు ఉంటాయి. దివ్యాంగుల పనులకే పైసలు లేవా?. మీ ఇంట్లోనే స్వయంగా పిల్లను ఇచ్చిన మామ దివ్యాంగుడు ఉన్నాడు కదా, దివ్యాంగుల పట్ల కనీసం కనికరం కూడా లేదా, మానవతా దృక్పథంతో దివ్యాంగుల సమస్యలు పరిష్కరించాలి. ఒక వేళ అసెంబ్లీ సమావేశాలలో దివ్యాంగుల సమస్యలకు పరిష్కారం చూపకుంటే పోరాటం ఉదృతంగా చేస్తాం.
– వికలాంగుల సహకార సంస్థ మాజీ ఛైర్మన్ వాసుదేవరెడ్డి