న్యూఢిల్లీ: తనను కేంద్ర మంత్రివర్గం నుంచి తొలగించడానికి కుట్ర జరుగుతున్నదని కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరమ్ ఆరోపించారు. తన ప్రతిష్ఠను దిగజార్చేందుకు ప్రయత్నించేవారి చేతులు నరికేస్తానని బెదిరించారు. బీజేపీ జనరల్ సెక్రటరీ మానస్ మొహంతీతో భేటీ అనంతరం ఓరమ్ ఈ వ్యాఖ్యలు చేశారు.ఇతర పార్టీల నుంచి బీజేపీలో చేరిన కొందరు నేతలు తనను బద్నాం చేసేందుకు యత్నిస్తున్నారని పేర్కొన్నారు. తనకు వ్యతిరేకంగా పనిచేస్తున్నవారు తనను రాజకీయంగా ఎదుర్కొనేందుకు సవాల్ విసురుతున్నారన్నారు.
ప్రభుత్వ నిర్వహణలోని సర్క్యూట్ హౌస్‌లో నేరస్థులకు ఆశ్రయం కల్పించారనే ఆరోపణలపై ఓరమ్ అనుచరుడు ప్రకాశ్ పాశ్వాన్‌ను పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఓరమ్ ఈ వ్యాఖ్యలు చేశారు. బీజేపీ యువమోర్చా రాష్ట్ర కార్యవర్గ కమిటీ నుంచి పాశ్వాన్‌ను బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మన్మోహన్ సమల్ సస్పెండ్ చేశారు. ఓరమ్ 1998లో తొలిసారి ఎంపీ అయ్యారు. సుందర్‌గఢ్ నుంచి ఆరుసార్లు ఎంపీగా విజయం సాధించారు. ప్రతిపక్ష బిజూ జనతా దళ్, కాంగ్రెస్ ఓరమ్ చేసిన హింసాత్మక బెదిరింపులను ప్రశ్నించాయి.