Annusriya Tripathi | ‘రజాకార్’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన కన్నడ కుట్టి అనుశ్రియ త్రిపాఠి. ఆ చిత్రంలో నిజాం భార్య పాత్రలో కనిపించిన అనుశ్రియ తొలి అడుగులోనే చారిత్రక నేపథ్యంతో రూపొందిన కథను ఎంచుకోవడం సాహసోపేత నిర్ణయమే! తనదైన నటనతో అందరినీ ఆకట్టుకుని వరుస అవకాశాలు అందుకుంటున్న ఈ ముద్దుగుమ్మ చెబుతున్న ముచ్చట్లు…
నాన్న సీఏ. అమ్మ గృహిణి. నాన్న నాతో సివిల్స్ రాయించాలనుకున్నారు. దాదాపు మూడేండ్లు చదువుల్లోనే ఉన్నాను. కాలేజీ రోజుల నుంచే నటిని కావాలనే కోరిక బలంగా ఉండేది. ఆ కల నెరవేర్చుకునేందుకు హైదరాబాద్ వచ్చాను. ఇక్కడ థియేటర్స్ వర్క్‌షాప్స్ చేశాను.
తెలంగాణ చరిత్రలో ఎంతో ప్రాముఖ్యం కలిగిన కథతో రూపొందిన ‘రజాకార్’ సినిమాలో భాగమైనందుకు చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమాలో నిజాం భార్య పాత్ర కోసం వెతుకుతున్నారని తెలిసి సంప్రదించా. లుక్ టెస్ట్ చేసి ఓకే అన్నారు. వాస్తవ పరిస్థితులు నిజాంకు తెలిపే పాత్ర. అందుకే సవాల్‌గా తీసుకొని చేశాను. ఈ పాత్ర కోసం మూడు నెలలు మెథడ్ యాక్టింగ్‌లో ట్రైనింగ్ కూడా తీసుకున్నాను.
ఎంతో ప్రతిభ కలిగిన బాబీసింహ, రాజ్ అర్జున్, మకరంద్ దేశ్‌పాండే వంటి నటులతో కలిసి నటించే అవకాశం మొదటి సినిమాలోనే రావడం నా అదృష్టం. వారి నుంచి ఎన్నో విషయాలు నేర్చుకున్నాను. భవిష్యత్తులో మంచి పాత్రలు పోషించాలని ఉంది. కొన్ని కథలు వింటున్నా. కథలో నా పాత్ర ప్రాధాన్యాన్ని బట్టి సినిమా ఎంచుకుంటాను.
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో పుట్టాను. కానీ చదువంతా బెంగళూరులోనే. అక్కడే థియేటర్స్ గ్రూప్‌లో సభ్యురాలిగా ఉన్నాను. అక్కడే నటనపై ఆసక్తి పెరిగింది. విభిన్న పాత్రల్లో నటించడం, ఆ పాత్రల్లో లీనమవడం నాకు చాలా నచ్చింది. అందుకే థియేటర్ ఆర్టిస్ట్‌గా కెరీర్ స్టార్ట్ చేశా. మోడలింగ్ కూడా చేశాను. 2018లో చత్తీస్‌గఢ్ నుంచి ‘మిస్ ఇండియా’ పోటీల్లో పాల్గొన్నాను.
నాకు నగలు, చీరలంటే చాలా ఇష్టం. నా దగ్గర చాలా మంచి కలెక్షన్ ఉంది. అందంగా అలంకరించుకుని ఫొటోషూట్స్ చేస్తుంటా. వాటిని ఇన్‌స్టా వంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ప్రేక్షకులతో పంచుకునేందుకు ఇష్టపడతా. ‘రజాకార్’ విడుదల తర్వాత నా ఫాలోవర్స్ సంఖ్య రెట్టింపవడం నిజంగా ఆనందం కలిగించే విషయం.
రణబీర్ కపూర్, రామ్‌చరణ్ నటన అంటే చాలా ఇష్టం. రామ్‌చరణ్‌లో ఇంటెన్స్ ఎమోషన్ని చాలా ఇష్టపడతాను. ఇష్టమైన నటులతో కలిసి పనిచేస్తే ఆనందం రెట్టింపవుతుంది. జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్ పాన్ ఇండియా హీరోలు.. దేశవ్యాప్తంగా వారికి అభిమానులు ఉన్నారు. హీరోయిన్లలో ప్రియాంక చోప్రా, అనుష్క శెట్టి, కీర్తి సురేశ్ ఇష్టం. ‘మహానటి’లో కీర్తి గారి నటన అద్భుతం. భవిష్యత్తులో అలాంటి మంచి పాత్రలో కనిపించాలని ఉంది.