సోషల్ మీడియాలో పూటకో కొత్త రూపు సంతరించుకుంటున్నా, ఓటీటీ సంచనాలు సృష్టిస్తున్నా.. స్మార్ట్ దునియాలో ఇప్పటికైతే యూట్యూబ్దే హవా! గిగాబైట్ల కొద్దీ ఎంటర్టైన్మెంట్ పంచుతున్న యూట్యూబ్ అడ్డాగా బాగుపడ్డవాళ్లు ఎందరో! కానీ, ఇదే యూట్యూబ్ వేదికగా విశృంఖల, విపరీత పైత్యాన్ని ప్రదర్శిస్తున్నారు కొందరు. ఘనాపాఠిని ఇంటర్వ్యూ చేసినా, మేటి నటిని పలకరించినా, గాన కోకిలతో ముచ్చటించినా.. వాళ్లు చెప్పే సంగతుల్లోని అసలు విషయాన్ని పక్కదారి పట్టించే మాయదారి థంబ్నెయిల్స్ పెడుతూ పబ్బం గడుపుకొంటున్నారు. అదేమిటంటే.. నెగెటివ్ థంబ్ నెయిల్స్ పెడితే హిట్లు ఎక్కువగా వస్తాయని వ్యాఖ్యానిస్తున్నారు.
దశాబ్దాలపాటు తెలుగువారిని అలరించిన ఓ ప్రముఖ గాయనిని మరో విశిష్ఠ యాంకర్ ఇంటర్వ్యూ చేసింది. అందులో చాలా విషయాలు చర్చకు వచ్చాయి. ఆ ఇంటర్వ్యూను ముక్కలు ముక్కలుగా యూట్యూబ్లో అప్లోడ్ చేశారు. ఇంతవరకు బాగానే ఉంది. ఒక్కోదానికీ ఒక్కో చెత్త థంబ్ నెయిల్ పెట్టారు. వీటిలో జాతిరత్నం ‘అసహ్యమైన పాటలు పాడించేవాడు’ అన్నది. తీరా వీడియోలోకి వెళ్తే అన్నీ మంచి విషయాలే! యాంకర్ అడిగే ప్రతి ప్రశ్నకూ.. ఆ గాయని హుందాగా, సహేతుకంగా సమాధానం చెప్పింది. ‘పిల్లలకు పాడాను, అబ్బాయి గొంతులా పాడాను, కొన్నిసార్లు చాలా అసహ్యంగా పాడాల్సిన పాటలూ ఉంటాయి. ఇళయరాజాకు ఎన్ని రకరాల వెరైటీలు పాడాను నేను’ అని చెప్పుకొచ్చింది. ఈ వీడియోకు ‘అసహ్యమైన పాటలు పాడించేవాడు’ అని థంబ్ నెయిల్ తగిలించి, ఇళయరాజా చిత్తరువును ఇన్సర్ట్ చేశారు.
అక్కడ ఆమె అన్నదేంటి? వీళ్లు పెట్టిదేంటి? పాట ఉన్నంత కాలం చెరగని కీర్తి మూటగట్టుకున్న ఆ మహాగాయని ప్రతిష్ఠకు భంగం వాటిల్లుతుందన్న ఇంగితం కూడా లేకుండా నీచమైన థంబ్నెయిల్ పెట్టి పైశాచిక ఆనందం పొందడం ఎందుకో అర్థం కాదు! మరో థంబ్నెయిల్ ‘ఇళయరాజాకి నేను పాడాను అంటే వచ్చి గొడవ చేసేవారు’ అని ఉంది. ఆ యూట్యూబర్ భావన ‘పాడను’ అంటే.. కానీ, తప్పును కూడా పద్ధతిగా చేయలేని దుస్థితిలో ఉండటం గర్హనీయం. ప్రముఖ గాయని ఇంటర్వ్యూలోనే ఇన్ని అర్థరహితాలు, దోషభరితాలు ఉంటే… ఓ మోస్తరు కళాకారుల విషయంలో ఇంకెంతటి వైపరీత్యాలు ప్రదర్శిస్తున్నారో ఊహించుకోవచ్చు.