‘అనస్వర రాజన్’..మలయాళ సినిమాలు వీక్షించే ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరిది. టీనేజీలోనే నటిగా గొప్పపేరు సంపాదించింది. లెజెండరీ నటుడు మోహన్‌లాల్‌తో కలిసి ‘నెరు’ సినిమాలో అంధురాలిగా అద్భుతమైన నటన కనబరిచింది. ఒకవైపు మలయాళం, తమిళంలో అవకాశాలు అందిపుచ్చుకుంటూనే.. ఇప్పుడు టాలీవుడ్‌లోనూ ఎంట్రీ ఇస్తుంది ఈ అమ్మడు. నటుడు శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఛాంపియన్’లో హీరోయిన్గా చాన్స్ కొట్టేసింది. తాజాగా ‘గిర గిర’ అంటూ సాగే పాటలో తెలుగు ప్రేక్షకుల్లో క్రేజ్‌ను సంపాదించుకున్న మలయాళీ కుట్టి అనస్వర పంచుకున్న కబుర్లు..
తల్లిదండ్రులు తమ బిడ్డలను ప్రాణ సమానంగా చూసుకుంటారు. మా అమ్మకు మాత్రం నేను అంతకంటే ఎక్కువ. తనకు నేనొక ఎమోషన్. నేను జన్మించే రోజునే అమ్మ తనకు జన్మనిచ్చిన తల్లిని కోల్పోయింది. నా రూపంలో అమ్మమ్మే మళ్లీ తనకు జన్మించిందని అమ్మ భావన. నన్ను అమ్మగా చూసుకుంటుంది.
చిన్నప్పటి నుంచి సినిమాలంటే ఇష్టం. స్కూల్లో కల్చరల్ యాక్టివిటీస్‌లో పాల్గొనేదాన్ని. ఆ ఇంట్రెస్ట్ పెరిగి సినిమాల్లోకి వచ్చేంత వరకు సాగింది. అనుకోకుండా అవకాశం వచ్చినా.. నాకూ నటించాలనే ఆసక్తి ఉండటంతో ఓకే చెప్పాను. కెరీర్ బిగినింగ్‌లోనే మోహన్‌లాల్ గారితో కలిసి నటించే అవకాశం రావడం అదృష్టంగా భావిస్తున్నా.
రొటీన్ స్టోరీలు కాకుండా విభిన్న కంటెంట్ సినిమాలనే ఇప్పటివరకు ఎంచుకున్నా. 7/జీ బృందావన్ కాలనీ సీక్వెల్లో నటించే అవకాశం వచ్చింది. చేయాలా? వద్దా? అని ఆలోచిస్తున్నాను. త్వరలోనే ఆ వివరాలు మీతో పంచుకుంటా.
సినిమాల్లోకి రావడంతో సెలెబ్రిటీ హోదా కట్టబెట్టేశారు. కానీ, ఈ తరం అమ్మాయిని కావడంతో యూత్ ఫీలింగ్స్ ఎక్కువగా డామినేట్ చేస్తుంటాయి. అందుకే నా సంతోషాలన్నీ సోషల్‌మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులతో పంచుకుంటాను. కష్టాలు మాత్రం అమ్మతోనే పంచుకుంటా. చాలా మంది నన్ను ఓపెన్మైండెడ్ అంటుంటారు.
యాక్టింగ్ అంటే ఇష్టంతోనే ‘ఉదహరణం సుజాత’లో బాలనటిగా నా సినీ ప్రయాణాన్ని మొదలుపెట్టా. ఇప్పటివరకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నా. నెరు, యారియన్ 2, రేఖాచిత్రం, సూపర్ శరణ్య లాంటి సినిమాల్లోని నా పాత్రలను ఎప్పటికీ మర్చిపోలేను. వాటితో పాటు మిగతా సినిమాలు కూడా నాకు మంచి గుర్తింపునే తెచ్చాయి.
‘ఛాంపియన్’ సినిమాలో తాళ్లపూడి చంద్రకళగా మీ అందరినీ అలరించబోతున్నా. తెలుగు సినిమాలో అచ్చమైన పల్లెటూరి అమ్మాయి పేరు పెట్టుకొని చేయడం బాగుంది. సినిమా విడుదలైన తర్వాత నన్ను చంద్రకళ పేరుతోనే పిలుస్తారేమో! శ్రీకాంత్‌గారు నటించిన సినిమాలు చూశా. ఆయన కొడుకు రోషన్ యాక్టింగ్‌లో జెమ్. ఆయనతో పోటాపోటీగా నటించా.