ముంబయి మెరుపులు, కన్నడ తళుకులు దాటుకొని టాలీవుడ్లో ఎదిగే తెలుగింటి బొమ్మలు తక్కువే! అందులోనూ తెలంగాణ అమ్మాయిలు మరీ తక్కువ. కానీ, తనదైన యాస, ప్రతిభతో రాణిస్తూ ప్రత్యేక ఇమేజ్ను సొంతం చేసుకున్నది తెలంగాణ ఆడబిడ్డ అనన్య నాగళ్ల. అమాయకత్వం రెండుపాళ్లు, హాట్‌లుక్స్ రెండుపాళ్లు కలగలిపి వరుస అవకాశాలు చేజిక్కించుకుంటూ ప్రేక్షకులను మెప్పిస్తున్నది. పట్టుదలతో శ్రమిస్తే ఏదైనా సాధ్యమే అంటున్న అనన్య పంచుకున్న కబుర్లు..
Ananya Nagalla | భిన్నమైన పాత్రలు ఎంచుకునేందుకు ప్రయత్నిస్తున్నా. సామాజిక అంశాలను ప్రతిబింబించే సినిమాల్లో నటించాలని ఉంది. సందేశాత్మక, ఆలోచనాత్మక సినిమాల్లో భాగం కావడానికి ఇష్టపడతాను.
తెలంగాణలోని సత్తుపల్లి అనే చిన్న పట్టణంలో నా ప్రయాణం మొదలైంది. నాకు చిన్నప్పటి నుంచే నటనపై ఆసక్తి ఉంది. కానీ, ఏ రంగంలో రాణించాలన్నా తగినంత చదువు తప్పనిసరి. అందుకే ఇంజినీరింగ్ పూర్తిచేసిన తర్వాతే నటనపై దృష్టి పెట్టాలని నిర్ణయించుకున్నా. అనుకున్నట్లుగానే చదువయ్యాకే సినిమాఅవకాశాల కోసం ప్రయత్నించా.
నా కెరీర్ షార్ట్‌ఫిల్మ్‌తో మొదలైంది. తర్వాత సినిమా అవకాశాలు వచ్చాయి. ‘మల్లేశం’ చిత్రంతో నా కెరీర్ ఊపందుకుంది. ఆ సినిమాలో పద్మ పాత్రలో లీనమవడానికి చాలా కష్టపడ్డా. ఆ ప్రాంత సంస్కృతి, జీవనశైలి అర్థం చేసుకున్నా.ఆ పాత్ర గురించి లోతుగా తెలుసుకోవడానికి నిజమైన పద్మతో మాట్లాడాను. నేను పడిన కష్టానికి ఆ సినిమా విజయం సాధించడం ఆనందాన్ని ఇచ్చింది.
‘వకీల్‌సాబ్‘ సినిమాలో కోర్టు సీన్ చేసేప్పుడు పవన్‌కల్యాణ్‌తో కలిసి నటించాను. అప్పుడు నా నటన చూసి ఆయన ‘మీ యాక్టింగ్‌లో ఎమోషన్ బాగా ఉంది. సీన్ రిపీట్ చేసినా అదే ఎమోషన్లో ఉంటున్నారు’ అని కాంప్లిమెంట్ ఇచ్చారు. ఆ ప్రశంసకు చాలా హ్యాపీగా ఫీలయ్యాను.
సోషల్ మీడియా ఎంత ఉపయోగమో అంత ప్రమాదకరమైంది కూడా! నలుగురు మెచ్చుకోగానే పొంగిపోతాం కానీ ఒక్కరు నెగెటివ్‌గా మాట్లాడినా తట్టుకోలేం. నెగెటివ్ ట్రోల్స్ తట్టుకోలేక మొదట్లో చాలా ఏడ్చేదాన్ని. కానీ, ఇప్పుడు ఎంత పెద్ద సమస్య అయినా అంతగా పట్టించుకోవడం లేదు. వీలైనంతవరకు ప్రశాంతంగా ఉండటానికి ప్రయత్నిస్తున్నా.
కొత్త విషయాలను నేర్చుకోడానికి ఎప్పుడూ సిద్దంగా ఉంటాను. ప్రయాణం కఠినంగా ఉండొచ్చు.. కొన్నిసార్లు ఇక ముందుకు వెళ్లలేం అనిపించవచ్చు. అవమానాలు, తిరస్కరణలు కూడా ఎదురుకావొచ్చు. కానీ, వాటిని దాటి నిలబడిన రోజు విజయం తప్పకుండా వరిస్తుంది. పట్టుదలతో శ్రమించాలి. నైపుణ్యాన్ని మెరుగుపరుచుకుంటూ ముందుకుసాగాలి.
నాకు సమంత నటన అంటే చాలా ఇష్టం. ఆమె తన కెరీర్‌ను నిర్మించుకున్న తీరు నాకు స్ఫూర్తి. పాత్ర ఎంపిక కూడా నచ్చుతుంది. క్యూట్‌గా కనిపిస్తూనే.. నటనకు ప్రాధాన్యం ఉన్న బలమైన పాత్రలను పోషించవచ్చని సమంత నటన చూశాక అర్థమైంది. అప్పటినుంచి ఆమె రూట్లోనే వెళ్తున్నా.
కథలో నా పాత్ర బలంగా ఉంటేనే సినిమా ఒప్పుకొంటున్నా. నేను ఎంచుకున్న పాత్రకు న్యాయం చేయడానికి వంద శాతం కృషి చేస్తా. ప్రేక్షకులు, విమర్శకుల నుంచి పాజిటివ్ ఫీడ్‌బ్యాక్ వచ్చినప్పుడు కష్టానికి తగిన ఫలితం దక్కిందనిపిస్తుంది. కథ, పాత్ర నచ్చి సినిమా చేస్తాం. కొన్నిసార్లు సినిమా ఆడకపోవచ్చు. అంతమాత్రాన కుంగిపోవాల్సిన పనిలేదు. ఫలితం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది.