‘మ్యాడ్’ సినిమాతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మలయాళ నటి అనంతిక సనీల్ కుమార్. మొదటి సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల మనసుదోచేసిన అనంతిక ‘8 వసంతాలు’ సినిమాతో అందరినీ అబ్బురపరిచింది. రొమాంటిక్ డ్రామాగా రూపొందిన ఈ సినిమాలో రచయిత్రి, మార్షల్ ఆర్టిస్ట్‌గా నటించి విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఆ చిత్రంలో ‘శుద్ధి అయోధ్య’గా మెప్పించి వరుస అవకాశాలు అందుకుంటున్న అనంతిక పంచుకున్న కబుర్లు..
నేను కేరళలో పుట్టి పెరిగాను. అమ్మానాన్న సనీల్ కుమార్, సుజాత. స్కూల్ డేస్‌లోనే నటనపై ఆసక్తి పెరిగింది. డ్రామాలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనేదాన్ని. ‘మ్యాడ్’ సినిమాకు ఆడిషన్స్‌లో పాల్గొన్నప్పుడు సెలెక్ట్ అవుతానని అనుకోలేదు. అనుకోకుండా ఆ సినిమాలో అవకాశం వచ్చింది.
మ్యాడ్ సినిమా.. నాకు తెలుగు ప్రేక్షకుల్లో గుర్తింపుతోపాటు నా కెరీర్‌కు బలమైన పునాది వేసింది. కానీ ‘8 వసంతాలు’ నా కెరీర్‌ని మలుపు తిప్పింది. అందులో నేను చేసిన శుద్ధి పాత్రలో చాలా వేరియేషన్స్ ఉన్నాయి. రచయిత్రి, మార్షల్ ఆర్టిస్ట్, మంచి కూతురు, ప్రేమికురాలు ఇలా కనిపిస్తాను. ఆ పాత్ర జీవితంలోని 8 ఏండ్ల ప్రయాణం చక్కగా చూపించారు.
సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటాను. ముఖ్యంగా ఇన్‌స్టాగ్రామ్‌లో ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతుంటాను. రెగ్యులర్‌గా ఫొటోలు షేర్ చేస్తుంటాను. నా తల్లిదండ్రులు ప్రతి విషయంలో నాకు అండగా ఉన్నారు, వారి ప్రోత్సాహమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది. ప్రస్తుతం కొన్ని తెలుగు, మలయాళ చిత్రాల కోసం ఆడిషన్స్‌లో బిజీగా ఉన్నా.
‘8 వసంతాలు’లో నటించడం సవాలుగా, అదే సమయంలో ఆనందంగా అనిపించింది. ఊటీ, కశ్మీర్, వారణాసిలో జరిపిన షూటింగ్ అద్భుతమైన అనుభవాల్ని పంచింది. ప్రకృతి అందాల మధ్య షూట్ చేయడం మరచిపోలేని అనుభూతి. ముఖ్యంగా వారణాసిలో ఫైట్ సీన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఆ ఫైట్ కోసం మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేకంగా శిక్షణ తీసుకున్నా.
నాకు రొమాంటిక్ డ్రామా, కామెడీ జానర్లు ఇష్టం. ‘మ్యాడ్’లో కామెడీ, ‘8 వసంతాలు’లో రొమాన్స్ ఇలా రెండు సినిమాల్లో నాకు నచ్చిన తరహా పాత్రలే చేశాను. కెరీర్ ఇలాగే సాగుతుందని ఆశిస్తున్నా. డిఫరెంట్ రోల్స్ చేయాలని ఉంది. అనుష్క, ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ అంటే ఇష్టం. వారు చాలా సహజంగా యాక్ట్ చేస్తారు. అయినా చాలా డెప్త్ ఉంటుంది.
పచ్చదనం అంటే చాలా ఇష్టం. హిల్ స్టేషన్స్‌లో విహరిస్తుంటే మనసు ఆనంద తాండవం చేస్తుంది. మున్నార్, అలెప్పీ నా ఫేవరెట్ డెస్టినేషన్స్. విదేశాల్లో అయితే స్విట్జర్లాండ్ చూడాలని కల. పెట్స్ అన్నా ఇష్టమే. ఒక కుక్కను పెంచుకుంటున్నా! దాంతో గంటలు గంటలు గడిపేస్తా. కేరళ ైస్టెల్ సీఫుడ్ అన్నా, బిర్యానీ అన్నా తెగ ఇష్టపడతా!!