వయసుడిగిన అవ్వకు.. పనులు చేయలేని దివ్యాంగులకు.. తోడులేని వితంతువులకు… అండగా ఉండే ప్రభుత్వాలు ఆసరా పింఛన్లిస్తున్నాయి. ఎన్నికల్లో పింఛన్ ప్రధాన ప్రచారాస్త్రంగా మారింది. ఎన్నికలే లేని కాలంలో.. అన్నార్తులకు ఆసరాగా ఉండాలని ఓ రాజు ఇలాంటి పథకం పెట్టాడంటే నమ్ముతారా? అయితే.. మైసూర్ మహారాజు కృష్ణరాజ నాలుగో వడయార్ గురించి తెలుసుకోవాల్సిందే! అంతేకాదు. తరతరాల అడ్డుగోడలు బద్దలుకొట్టిన రిజర్వేషన్ల చట్టం.. విద్య, విద్యుత్, వ్యవసాయంలో మైసూర్ ప్రగతిని చదవాల్సిందే!
Krishnaraja Wadiyar | విలాసాలకు పరాక్రమాలకు రాజులు పేరుగాంచిన వాళ్లు. గతకాలపు రాజులకు భిన్నంగా కృష్ణరాజ వడయార్ జ్ఞానం, దయ, ప్రగతి అనే ఆదర్శాలకు పేరుగాంచాడు. మైసూర్‌ని పాలించే వడయార్ రాజ కుటుంబంలో 1884లో ఆయన జన్మించారు. పదకొండేళ్ల వయసులోనే మైసూర్ ప్యాలెస్‌లో ఆయనకు పట్టాభిషేకం చేశారు. ఆయనకు పద్దెనిమిదేళ్లు వచ్చేవరకు తల్లి మహారాణి వాణి విలాస్ సన్నిధాన రాజ్య పాలన పర్యవేక్షించారు.
విద్య, లౌకిక జ్ఞానం, రాజధర్మం, రాజ్యపాలనలో శిక్షణ పొందుతూ కృష్ణరాజ పెద్దవాడయ్యాడు. ఆయన కత్తిసాము, మల్ల యుద్ధంలో ఆరితేరినవాడు కాదు. సకల విద్యాపారంగతుడు. మాతృభాష కన్నడతోపాటు ఇంగ్లిష్, సంస్కృత భాషల్లో ప్రావీణ్యం సాధించాడు. కళ లపట్ల అమితాసక్తి ప్రదర్శించేవాడు. అధికారాలు ఆయన చేతికి వచ్చాక పాలన అంటే ఏమిటో చూపించాడు.
కృష్ణరాజ గద్దెనెక్కడంతో మైసూర్ రాజ్యంలో సంఘ సంస్కరణ శకం ఆరంభమైంది. ఆయన హయాంలో నిచ్చెనమెట్ల కులవ్యవస్థలో అట్టడుగు కులాల అవస్థలు రూపుమాపాలనుకున్నాడు. అంటరానితనాన్ని నిషేధించాడు. బాల్య వివాహ నిషేధ చట్టాన్ని తీసుకువచ్చాడు. ఆడపిల్లలకు ఎనిమిదేళ్ల లోపు వివాహం చేయడాన్ని నేరంగా పరిగణిస్తూ శాసనం చేశాడు. వితంతు మహిళల దీనగాథలు విన్నాడు. ఒంటరితనమే కాకుండా ఆర్థిక స్వావలంభన లేక దయనీయమైన జీవితం గడుపుతున్న మహిళలకు రాచరిక ప్రభుత్వం అండగా ఉంటుందని ప్రకటించాడు. పేద వితంతు మహిళలకు ప్రభుత్వం తరపున పింఛన్లు మంజూరు చేశాడు.
శారీరక శ్రమకు వైకల్యం ఆటంకంగా ఉన్న దివ్యాంగుల సంక్షేమం కోసం ఆయన ఏటా రూ.60 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. 1915లో మైసూర్ సోషల్ ప్రొగ్రెస్ అసోసియేషన్‌ని ప్రారంభించాడు. పీడిత కులాల అభ్యున్నతి కోసం సర్ లెస్లీ మిల్లర్‌ని ఆహ్వానించి, సామాజిక అభ్యుదయం కోసం చేపట్టాల్సిన పాలనాపరమైన సంస్కరణలకు సూచనలు కోరాడు. మైసూర్ రాజ్యంలో ప్రభుత్వ కొలువుల్లో 25 శాతం బ్రాహ్మణేతరులకు రిజర్వ్ చేస్తూ 1918లో చట్టం చేశాడు. కృష్ణరాజ పాలనలో మైసూర్ రాజ్యంలో స్వర్ణయుగం మొదలైంది.
బాలలందరికీ నిర్బంధ ప్రాథమిక విద్యను అమలులోకి తెచ్చాడు కృష్ణరాజ. దీనిని అమలు చేసేందుకు 1915 బడ్జెట్లో రూ.6.90 లక్షలు కేటాయించాడు. విద్యారంగానికి పెరిగిన ప్రాధాన్యం వల్ల 1927 బడ్జెట్లో రూ.46.80 లక్షలు వెచ్చించాడు. మైసూరు రాజ్యంలో అయిదు లక్షల మంది విద్యార్థుల చదువు కోసం ఎనిమిది వేల పాఠశాలలు నడపడం విశేషం. కేవలం పాఠశాలల స్థాపన, నిర్వహణే కాకుండా భవిష్యత్ అవసరాల కోసం అనేక ఉన్నత విద్యా, పరిశోధనా సంస్థలకు అంకురార్పణ చేశాడు. మైసూర్ సంస్కృత కళాశాల స్థాపించాడు. సీవీ రామన్ పరిశోధనల కోసం పదెకరాల భూమిని దానం చేశాడు. జంషెడ్జీ టాటా స్థాపించిన నేటి ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (బెంగళూరు) స్థాపనకు నాలుగు వందల ఎకరాల భూమిని విరాళంగా ఇచ్చాడు. ఇలా విద్యారంగంలో కృష్ణరాజ పాలన విప్లవాత్మకంగా సాగింది.
కృష్ణరాజ సంగీత జ్ఞాని. పాలనాదక్షత కలిగిన రాజుగా, ప్రావీణ్యం గల సంగీత కళాకారుడిగా గుర్తింపు పొందాడు. వయోలిన్, వీణ, సాక్సాఫోన్, మృదంగం వాయించడంలో ప్రావీణ్యం గడించాడు. కృష్ణరాజ కవి కూడా. తను రాసిన కన్నడ కవిత్వంలో ప్రజలతో, సంస్కృతిక రంగంతో తనకున్న అనుబంధాన్ని వ్యక్తపరిచాడు. కృష్ణరాజ పాలన, కళల ఆదరణను గుర్తించిన మహాత్మా గాంధీ ఆయన్ను ‘రాజర్షి’ అని సంబోధించడం విశేషం.
కరువు కాటకాలకు ప్రజలు అల్లాడుతున్నప్పుడు వారి ఆకలి తీర్చేందుకు డ్యామ్ నిర్మించ తలపెట్టాడు కృష్ణరాజ. ఆ కరువు కాలంలో ఖజానాలో నిధులు లేవు. తన ప్రజల కోసం తలకెత్తుకున్న బాధ్యత నెరవేర్చేందుకు తన ఆభరణాలను ముంబయిలో అమ్మకానికి పెట్టాడు. ఆయన స్వప్నం నెరవేరింది. ప్రజల ఆకలి తీరింది. 1940లో కృష్ణరాజ కన్నుమూశాడు. ఇప్పుడు ఆయన లేడు. కానీ, ఆయన నిర్మించిన ప్రాజెక్ట్ నేటికీ మాండ్య ప్రజలకు సాగునీరందిస్తున్నది. ఆ రాజు పెట్టిన బువ్వ తిన్న ప్రజలు కృష్ణరాజని దైవంగా భావిస్తారు. ఆ ప్రాజెక్ట్‌కు ఆయన పేరు పెట్టి తర్వాతి ప్రభుత్వాలు కృష్ణరాజను గౌరవించాయి. ఈ మహారాజు సంస్కరణలు, విద్యా సేవలు, నిర్మించిన ప్రాజెక్టులు ఆయన్ని కన్నడ ప్రజల హృదయాల్లో చిరస్మరణీయుడిని చేశాయి.
కృష్ణరాజ సాంకేతిక ప్రగతికి మార్గదర్శి అని కన్నడ ప్రజలు నేటికీ చెప్పుకొంటారు. నేడు ఐటీ రాజధానిగా వెలుగొందుతున్న బెంగళూరు ప్రగతికి పునాదిరాళ్లు వేసింది ఆయనే. ఆయన పాలనలోనే (1905లో) బెంగళూరుని విద్యుదీకరించారు. ఆసియాలో పూర్తిగా జలవిద్యుత్నే ఉపయోగించిన మొదటి పట్టణంగా బెంగళూరు చరిత్రకెక్కింది. ఆ విద్యుత్ వెలుగుల్లో కృష్ణరాజ కీర్తి ప్రకాశించిందని చెప్పుకోవాలి. ‘కృష్ణరాజ భూపా, మనే మనే దీపా (ప్రతి ఇంటినీ వెలిగించే రాజు)’ అని ఆయన్ని కన్నడ ప్రజలు పిలిచారు. దైవంలా కొలిచారు.