ఆటలోని క్షణాలన్నీ.. అద్భుతంగా సాగుతాయి. గెలుపు కోసం ఆటగాళ్ల ప్రయత్నాలు; విజయోత్సాహాలు; ఓటములు; నిరాశ నిస్పృహలు.. అన్నీ ఆ ఒక్క క్షణమే మెరిసి మాయమవుతాయి. లిప్తపాటులో మారిపోయే భావోద్వేగాలు.. తమదైన కథను చెబుతాయి. ఆటగాళ్లతోపాటు అభిమానుల గుండెల్లో చిరస్మరణీయంగా మిగిలిపోతాయి. కానీ, కెమెరాలో బంధించిన ఫొటోలు.. ఆ అపురూప క్షణాలను చిరస్థాయిగా నిలుపుతాయి.
మోడ్: స్పోర్ట్స్ ఫొటోగ్రఫీలో షట్టర్ స్పీడ్‌పై నియంత్రణ అవసరం. అందుకే, మాన్యువల్ (M) లేదా షట్టర్ ప్రియారిటీ (S / Tv) వాడాలి.
ఆటగాళ్లను క్లియర్‌గా క్యాప్చర్ చేయాలంటే షట్టర్ స్పీడ్ ఎక్కువ ఉండాలి. తక్కువైతే ఫొటోలు బ్లర్‌గా వస్తాయి. ఒక్కో రకమైన ఆటకు ఒక్కో విధంగా షట్టర్ స్పీడ్‌ను సెట్ చేసుకోవాలి.
ఫోకస్ మొత్తం ఒక్క ఆటగాడిపైనే ఉంచాలంటే.. ఎఫ్/2.8 ఉండాలి. అప్పుడు బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ అయిపోయి, ప్లేయర్ మాత్రమే హైలైట్ అవుతాడు.
ఐఎస్వో పెంచితే.. ఫొటోల్లో నాయిస్ కూడా పెరుగుతుంది. అందుకే, RAW లో షూట్ చేస్తే.. తరువాత నాయిస్‌ను సరి చేయవచ్చు.
వీటితోపాటు రూల్‌ఆఫ్ థర్డ్స్, లీడింగ్ లైన్స్ లాంటి కంపోజిషన్ సూత్రాలను పాటిస్తూ.. ఫొటోలను మరింత అందంగా మలచండి.
ఒకే ఫొటోలో ఆట ఉద్దేశం, గెలుపు కోసం ఆటగాళ్లు పడే తపన, గెలిచిన తర్వాత వారి ఉత్సాహాన్ని మీరు ఫొటోలుగా మలిస్తే.. అదే నిజమైన స్పోర్ట్స్ యాక్షన్ ఫొటోగ్రఫీ. మైదానంలో ఆటగాళ్లతోపాటే మీరు కూడా కెమెరాతో ప్రాక్టీస్ మొదలుపెట్టండి. రకరకాల షట్టర్ స్పీడ్స్ మార్చుకుంటూ.. ప్రయోగాలు చేయండి. ప్రతి గేమ్ తర్వాత ఫొటోలను ఒక్కసారి రివ్యూ చేయండి. ఏవైనా తప్పులుంటే గుర్తించండి. అవి పునరావృతం కాకుండా జాగ్రత్త పడండి.
చివరగా, స్పోర్ట్స్ ఫొటోగ్రఫీ అంటే.. వేగం, దృష్టి, సమయాల కలయిక. మీ డీఎస్ఎల్ఆర్ కెమెరా ద్వారా ఆటలోని ప్రతి క్షణాన్ని కళాత్మకంగా ఫ్రీజ్ చేయండి. ఆ అరుదైన క్షణాలను కలకాలం నిలిపి ఉంచండి. ఒక్క ఫొటో.. వేల భావోద్వేగాలు! ఇదే స్పోర్ట్స్ ఫొటోగ్రఫీ!
– ఆడెపు హరికృష్ణ