అదో పల్లెటూరు. అతనో సాధారణ రైతు. సాఫీగా సాగిపోయే జీవితం. కానీ ఆ రోజు అతని ఇంటి దగ్గర సందడిగా ఉంది. కారణం. ఆయన ఎంతగానో ఇష్టపడే నాయకుడు వీడియో కాల్ చేశాడు. పేరు పెట్టి పిలిచి మరీ ఎంతో అభిమానంగా మాట్లాడాడు. పార్టీలో ఉండే పేదపిల్లల చదువు కోసం కాస్త ఆర్థిక సాయం చేయాలని అభ్యర్థించాడు. ఖర్చే! కానీ ఆ నాయకుడు స్వయంగా అడిగితే, దేనికైనా వెనకాడని అభిమానం. అందుకే తన స్నేహితులను కలుపుకొని వీలైనంత డబ్బు పంపాడు. నాయకుడు అడిగాడనే అభిమానానికి తోడు తన సేవకు గుర్తింపు వస్తుందనే ఆశ కూడా! కొన్నాళ్లకు అదే నిజమైంది. ఈసారి ఏకంగా పార్టీలోని పెద్ద నాయకుడి నుంచి వీడియో కాల్ వచ్చింది. పార్టీకి చేసిన సేవలకు గుర్తింపుగా స్థానిక ఎన్నికలలో సీటు ఇస్తానని. ఇక ఆ సంతోషంలో నాయకుడు అడిగినన్ని డబ్బులు పంపాడు. ఈ కథ ఇంకా కొనసాగేదే. మధ్యలో జరిగిన ఓ గొడవతో బండారం బయటపడింది. ఇది ఓ చిన్న సంఘటన మాత్రమే కాదు. కృత్రిమ మేధతో చేసే ‘డీప్‌ఫేక్’ మోసాలు ఎంత వాస్తవంగా కనిపిస్తున్నాయో, మారుమూల ప్రాంతాలను సైతం ఎలా చేరుకుంటున్నాయో హెచ్చరించే సూచన. రెండువైపులా పదునున్న ఈ సాంకేతికతను ఎక్కువ సందర్భాలలో మోసానికే ప్రయోగించడం ఓ దుస్థితి. దాని బారిన పడకుండా ఉండాలి అంటే… అప్రమత్తంగా ఉంటే సరిపోదు. అవగాహన కూడా కావాలి. అందుకే ఈ కథనం.
ప్రపంచానికి తెలిసిన మొట్టమొదటి ఫొటోగ్రాఫ్కి రెండు వందల ఏళ్ల చరిత్ర ఉంది. కెమెరాను కొన్ని గంటల పాటు స్థిరంగా ఉంచితే.. ఓ మెట్లదారి ఫొటోగా ప్రింట్ అయ్యింది. ఆ తర్వాత దశాబ్దాలు గడిచినా ఫొటో తీయడం అనేది ప్రహసనంగానే ఉండేది. నకిలీ ఫొటోలతో మోసం చేయడం దాదాపుగా అసాధ్యం అనిపించేది. నెగెటివ్‌లను కత్తిరించి, కలిపి కష్టపడినా… అతుకు స్పష్టంగా తోచేది. కానీ, 1960ల నుంచి డిజిటల్ ఫొటోలు వెలుగులోకి వచ్చాక, ఆ సాంకేతికత తేలికైపోయింది. కానీ మార్ఫింగ్ అప్పటికీ కష్టమే. కంప్యూటర్ల తరం మారుతున్నా, అత్యున్నత సాంకేతిక పరిజ్ఞానం ఉంటే కానీ అందులో స్పష్టత ఉండేది కాదు. పైగా దాన్ని చిటికెలో తేల్చేసే యాప్స్ కూడా అందుబాటులో ఉండేవి. కానీ ఇది కలికాలాన్ని మించిన ఏఐ కాలం. మయసభలో ఉన్నది లేనట్టుగా, లేనిది నిజమైనట్టుగా తోచినట్టు.. డిజిటల్ వేదిక మీద దేన్నయినా సృష్టించే కాలం వచ్చేసింది.

ఒకప్పుడు రాజులు బలమైన కోటలు కట్టుకుని ఉండేవారు. అందులోకి వెళ్లేందుకు శత్రురాజులు సవాలక్ష మార్గాలు వెతికేవారు. అగడ్తలు, పహారాల నడుమ నుంచి బలహీనతలు వెతికేవారు. ఇప్పుడు మన జేబే ఖజానా. దానికి చిల్లు పెట్టేందుకు డీప్‌ఫేక్ ద్వారా రకరకాల ప్రయత్నాలు జరుగుతున్నాయి.
దేశం అంతా ఆరాధించే రతన్ టాటా ఓ ఉత్పత్తి గురించి చెబితే, దేశ ఆర్థిక వ్యవస్థనే శాసించే నిర్మలా సీతారామన్ సంపద పెంచే స్కీమ్ సూచిస్తే… చెప్పింది వీళ్లేనా అని ఓసారి ఆగి చూస్తాం. అదే మనిషి, అదే గొంతు, అవే హావభావాలు! ఆ కాస్త చాలు, నిర్ణయం తీసేసుకోవడానికి. పైగా ఇలాంటి వీడియోలలో అర్జన్సీ ఉంటుంది. ఇప్పుడే క్లిక్ చేయండి, ఈ అవకాశం చేజారితే నష్టపోతారు అనే భావన కలిగిస్తారు. అందుకే చాలామంది పొరపాటు చేసేస్తారు. కొద్దిమంది మాత్రమే అది నిజంగానే ఆ సెలెబ్రిటీ చెప్పారా లేదా అని ఆలోచిస్తారు. 2024లో ప్రముఖ యాంటివైరస్ సంస్థ మెక్ కెఫె చేసిన సర్వేలో కనీసం 75 శాతం భారతీయులు తాము ఏదో ఒక సమయంలో డీప్‌ఫేక్ చూసినట్టు ఒప్పుకొన్నారు. ఈ ఏడాది ఇది నూరు శాతానికి చేరుకుని ఉంటుందని సైబర్ నిపుణుల అంచనా.

చూడటమే కదా అనుకునేరు. అదే సంస్థ చేసిన మరో సర్వేలో దాదాపు 45 శాతం మంది ఈ డీప్‌ఫేక్ షాపింగ్ స్కాంలకు ప్రభావితం అయ్యామని చెప్పారు. మరోవైపు ఇది సెలెబ్రిటీలను కూడా గట్టిగానే దెబ్బతీస్తున్నది. సచిన్, అక్షయ్ కుమార్, కోహ్లి, అలియా భట్, ప్రియాంకా చోప్రా… ఇలా తమ డీప్‌ఫేక్ ప్రకటనల పట్ల జాగ్రత్తపడమంటూ హెచ్చరించిన వారి లిస్ట్ పెద్దదే. మరీ చిత్రం ఏమిటంటే… రాజకీయ పార్టీల ప్రకటనల కోసం కూడా డీప్‌ఫేక్ వాడటం. ఆమిర్ ఖాన్, రణవీర్ సింగ్ గొంతుకలతో వచ్చిన ఈ ప్రచారాన్ని వాళ్లు ఖండించేలోగా లక్షలమంది ప్రభావితం అయిపోయారు. సెలెబ్రిటీలే తమ ప్రకటనల్లో డీప్‌ఫేక్ ఉపయోగించిన సందర్భాలూ లేకపోలేదు. సచిన్, సల్మాన్‌లు చిన్నగా కనిపించడానికి వీటిని వాడారు. ఇక షారుక్, హృతిక్‌లు క్యాడ్బరీ, జొమాటోల సౌజన్యంతో చిన్న వ్యాపారస్తులు ప్రకటనలు చేసుకునే వెసులుబాటు ఇచ్చారు.

ఓ రెండేళ్ల క్రితం రష్మిక మందన్నను అర్ధనగ్నంగా చూపించిన ఓ వీడియో విపరీతంగా ప్రచారంలోకి వచ్చింది. రోజు గడిచేలోగా కోట్లాదిమంది చూసేశారు. అది ‘నేను కాదు మొర్రో’ అని మొత్తుకున్నా ఎవరూ పట్టించుకోనంత సహజంగా ఉందా వీడియో. చివరికి పోలీసులను ఆశ్రయించడంతో పరిశోధన మొదలైంది. జారా పటేల్ అనే బ్రిటిష్ యువతి శరీరానికే రష్మికను జోడించినట్టు తేలింది. ‘ఇది నాకే కాదు… ఇలాంటి సాంకేతికత మధ్య ఉంటున్న ఎవరికైనా ఓ పీడకలే’ అని వాపోయింది రష్మిక. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే సోషల్ మీడియాలో ఇలాంటి డీప్‌ఫేక్ సమాచారాన్ని ప్రచురిస్తే కఠినమైన చర్యలు తప్పవని హెచ్చరికలు జారీ చేసింది.
డీప్‌ఫేక్ సాంకేతికతను అత్యధికంగా అశ్లీలతకే ఉపయోగించుకోవడం దురదృష్టం. ఓ అంచనా ప్రకారం 98 శాతం సందర్భాలలో పోర్న్ కోసమే వాడుతున్నారు. ఏకంగా నాలుగు వేల మంది సెలెబ్రిటీల చిత్రాలను ఇందుకు వాడుకున్నట్టు అధికారిక అంచనా. ప్రముఖ నటి టేలర్ స్విస్ట్ రూపంతో చేసిన డీప్‌ఫేక్ చిత్రాలు ఎంత వ్యధను మిగిల్చాయంటే… అమెరికన్ ప్రభుత్వం ఒక్కసారిగా మేల్కొని DEFIANCE Act అనే చట్టాన్ని రూపొందించింది. ఈ దుస్థితి పాశ్చాత్య దేశాలదే కాదు. అలియా భట్, కత్రినా కైఫ్, కాజోల్ వంటి బాలీవుడ్ తారలు కూడా తమ డీప్‌ఫేక్ అశ్లీల చిత్రాలను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ బాధ సెలెబ్రిటీలకే పరిమితం కాదు. ఆమధ్య చాలారోజుల పాటు తెలుగులో వచ్చిన బూతు జోకులు మహిళా కమెడియన్లు చెబుతున్నట్టుగా కనిపించాయి. చూసేందుకు సహజంగా ఉన్న ఆ వీడియోలను గమనించినవారంతా, ఏకంగా ఇప్పటి తరం తీరు ఇలా మారిందంటూ బుగ్గలు నొక్కుకున్నారు. వివరం తెలిశాక నాలుక కరుచుకుని వాటిని తొలగించమని డిమాండ్ చేశారు.
సెలెబ్రిటీల రూపంలో వచ్చే డీప్‌ఫేక్ వల్ల వినియోగదారులు ఎంతలా మోసపోతారో… అసలు వ్యక్తులూ అంతే నష్టానికి గురవుతారు.
రెండేండ్ల క్రితం రష్మిక మందన్న అశ్లీల డీప్‌ఫేక్ వీడియో ప్రచారంలోకి రాగానే, సెలెబ్రిటీలు అంతా ముక్తకంఠంతో ఖండించారు. కేసులు నమోదయ్యాయి. అరెస్టులు జరిగాయి. ఆ తర్వాత కూడా ఐశ్వర్య, అమితాబ్, అనిల్ కపూర్, సునిల్ షెట్టి లాంటి ప్రముఖులంతా తమ డీప్ ఫేక్‌లను అరికట్టాలంటూ కేసులు నమోదు చేశారు. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో మరోసారి డీప్‌ఫేక్ తీవ్రత ఎరుకలోకి వచ్చింది. డీప్‌ఫేక్ ద్వారా తన అశ్లీల చిత్రాలు రూపొందించడంతో, వాటి బాధ్యుల మీద చర్యలు తీసుకోమని చిరు చట్టాన్ని ఆశ్రయించారు. దీంతో కొందరి మీద కేసులు కూడా నమోదయ్యాయి. ఇది ఇక్కడతో ఆగదని అర్థమైన మెగాస్టార్ తన అనుమతి లేకుండా తన పేరు, ఫొటో, స్వరాలను ఉపయోగించకూడదంటూ మధ్యంతర ఉత్తర్వులు తెచ్చుకున్నారు.

డేటాను కిలోబైట్లుగా కాకుండా టెరాబైట్లుగా వాడుకునే రోజుల్లో ఉన్నాం. 5జీ ఇంటర్నెట్… అది కూడా కారు చవకగా లభించే డిజిటల్ వేదిక మీద బతుకుతున్నాం. అందరి చేతిలో మొబైల్ ఫోన్, సోషల్ మీడియా సాధారణం. పైగా ఇప్పుడు డీప్‌ఫేక్ రూపొందించే సాంకేతికత అందరికీ అందుబాటులోకి వచ్చేసింది. పెద్దగా పరిజ్ఞానం లేకపోయినా, కారుచవకగా రకరకాల ఆన్లైన్ యాప్స్ ద్వారా వీటిని సులభంగా రూపొందించేయవచ్చు. కొన్ని వందల రూపాయల ఖర్చుతోనే DeepFaceLab, FaceSwap లాంటి సాంకేతికతతో ఈ వీడియోలు తయారుచేయవచ్చు.
డీప్‌ఫేక్ విషయంలో మరో సవాలు ఏమిటంటే… సోషల్ మీడియా నుంచి సరైన నియంత్రణ లేకపోవడం. వాటి దగ్గర డీప్ ఫేక్ను గుర్తించి అరికట్టేంత సాంకేతికత ఉన్నా… మనకు అతి నాసిరకంగా డీప్ ఫేక్స్ కూడా కనిపిస్తున్నాయి అంటే వాటిని కావాలనే చూసీచూడకుండా వదిలేస్తున్నాయని అర్థం చేసుకోవచ్చు. అందుకే మిస్టర్ బీస్ట్ లాంటి సెలెబ్రిటీలు, డీప్ ఫేక్‌లను ప్రోత్సహిస్తున్నాయంటూ సోషల్ మీడియా మీద విరుచుకుపడ్డారు.
ఏతావాతా తేలేదేమిటంటే… మనమే డీప్ ఫేక్‌ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. దానికోసం సెలెబ్రిటీలు కొన్ని చర్యలు తీసుకోవాల్సిందే!
నేరుగా గురి: తమ డీప్ ఫేక్‌లు కనిపిస్తున్నాయి అనగానే నేరుగా సదరు వేదికల మీద చట్టపరమైన చర్యలు తీసుకోవడం. ఉదాహరణకు ఐశ్వర్య, అభిషేక్ బచ్చన్లు నేరుగా గూగుల్, యూట్యూబ్‌ల మీద ఈ తరహా దావా వేశారు. ఇలాంటి చర్యలతో సదరు వేదికలు దిగి రావడమే కాకుండా, మున్ముందు కూడా జాగ్రత్త పడతాయి.
ఫొటోలకు రక్షణ: తమ ఫొటోల మీద వాటర్ మార్క్ లాంటి రక్షణతో పాటుగా PhotoGuard, బ్లాక్ చెయిన్ లాంటి సాంకేతికత వాడటం వల్ల వాటిని డీప్‌ఫేక్ చేయడం సాధ్యం కాదు. లో రిజల్యూషన్ ఫొటోలని కూడా డీప్‌ఫేక్ చేయడం కష్టం అవుతుంది.
అధికారిక చానెల్స్: సెలెబ్రిటీల పేరుతో సవాలక్ష వేదికలు ఉంటాయి. వాటి నుంచి వచ్చే సమాచారంలోనూ అన్వయ లోపాలు, మోసపూరిత ఉద్దేశాలు ఉంటాయి. అందుకే X మొదలుకొని యూట్యూబ్ వరకూ తమ అధికారిక చానెల్స్ ఉండాల్సిందే. దాన్ని మాత్రమే నమ్మమనే డిస్ క్లెయిమర్ కనిపించాల్సిందే.
ఎదుర్కొనే జట్టు: డీప్‌ఫేక్ లాంటి మోసాలను అరికట్టే న్యాయ సలహాదారు, పీఆర్ అందుబాటులో ఉంచుకోవాలి. కొన్ని సాంకేతిక సంస్థలు కూడా ఈ రంగంలో నిఘా సేవలను అందిస్తున్నాయి. ఎవరైనా తన పేరుతో డీప్‌ఫేక్ చూసినప్పుడు ఆ జట్టుకు సమాచారం ఇచ్చేలా కూడా ఒక మెయిల్ లేదా మొబైల్ నెంబర్ అందరికీ అందుబాటులో ఉంచాలి.
సాంకేతికతకు సిద్ధంగా: సాధారణంగా సెలెబ్రిటీలు సాంకేతికత వేగాన్ని అంతగా గమనించుకోరు. కానీ, సమస్య ఉన్నప్పుడు దాన్ని ఎదుర్కొనే ఆయుధాలను కూడా పరిశీలించాలి. Fawkes, Deepware Scanner API, Talkwalker లాంటి అధునాతన టెక్నాలజీని తన జట్టుకు సూచించాలి. లేదా వాటి గురించి అవగాహన ఉన్నవారిని నియమించుకోవాలి.
సెలెబ్రిటీల పేరుతో వచ్చే డీప్‌ఫేక్ వల్ల వారి అంతులేని ఖజానాకి, పేరుప్రతిష్ఠలకి పెద్దగా ముప్పు రాకపోవచ్చు. పైగా దాన్ని ఎదుర్కొనే ఆంగబలం కూడా వారికి ఉంటుంది. కానీ, ఆ వీడియోలను చూసి ఆర్థిక ఉచ్చులో చిక్కుకునే సామాన్యులకు మాత్రం ఇది ఉండేలు దెబ్బే. అందుకే మనం కూడా ఈ విషయమై ఎరుకతో ఉండాలి. ఓ సర్వే ప్రకారం డీప్‌ఫేక్ ప్రకటనలు లేదా కాల్స్‌కి స్పందించిన వారిలో 56 శాతం మంది ఆర్థిక నష్టాన్ని ఎదుర్కొన్నారు. వారిలో 46 శాతం మంది 40 వేలకు పైగా నష్టపోయారు. ఈ పరిస్థితి రాకూడదు అంటే చిన్నచిన్న జాగ్రత్తలు సరిపోతాయి అంటున్నారు నిపుణులు.

తన కంపెనీ సీఈఓ అంటే ఓ అకౌంటెంటుకు ఆరాధన. తనతో ఫొటో దిగితే తన జన్మ ధన్యమనేంత అభిమానం. అలాంటి సీఈఓ నేరుగా ఫోన్ చేసి బాగా పని చేస్తున్నావంటూ మెచ్చుకుని, భార్యపిల్లల గురించి వాకబు చేసి, చివర్లో ఓ కోటి రూపాయలు ఫలానా అకౌంటుకి ట్రాన్స్ఫర్ చేయమంటే! ఇలాంటి సమయాల్లో విచక్షణ సరిగా పనిచేయదు. దాన్ని వినియోగించుకుని పాల్పడే మోసమే CEO fraud. ఒక పేరున్న వ్యాపారస్తుడు మాట్లాడినట్టో, నేరుగా వీడియో కాల్ చేసినట్టో, ఆఖరికి గూగుల్ మీట్లో కలిసినట్టో భ్రమింపచేసే వైనం. ఫెరారీ, డచ్ బ్యాంక్ లాంటి భారీ సంస్థల సీఈఓను ఉపయోగించుకుని ఇలాగే కోట్లు గుంజేశారు. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి, ముకేష్ అంబానీల్లా మాట్లాడి 80 లక్షల రూపాయలు కాజేసిన కేసు బెంగళూరులో నమోదైంది. ఈ ఏడాది మొదటి త్రైమాసికంలోనే ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా మోసాలతో 170 కోట్ల రూపాయలకు పైగా నష్టం కలిగినట్టు అంచనా.

డీప్ ఫేక్‌ని మోసానికి ప్రతీకగా మార్చింది మనమే. నిజానికి అది సృష్టికి ప్రతిసృష్టి చేసినంత అద్భుతం. వినియోగంలో విచక్షణ కొరవడింది అంతే! అందుకే కొందరు సెలెబ్రిటీలు దాన్ని జాగ్రత్తగా వాడుకుని లాభపడుతున్నారు.
సల్మాన్, షారుక్, సచిన్ అందరూ కూడా తెర మీద యంగ్‌గా కనిపించేందుకు డీప్ ఫేక్‌ని ఆశ్రయించినవారే. తెలుగు నటులు కూడా సినిమాల్లో చిన్నగా కనిపించేందుకు చాలా సందర్భాల్లో దీన్ని వినియోగించారు. వయసును తగ్గించుకోవడానికి ఇదో అద్భుతమైన సాధనం.
అనుమతి తీసుకుని తమ డీప్ ఫేక్ను ఉపయోగించుకోవచ్చు అనే హక్కుతో, సత్తువ తగ్గిన సెలబ్రిటీలు సొమ్ము చేసుకోవచ్చు. తమ వారసులకు కూడా అది అదనపు ఆదాయంగా మారవచ్చు. ఉదాహరణకు గయ్యాళి అత్త పాత్రకు వన్నె తెచ్చిన ఓ నటి, తన రూపాన్ని, హావభావాలను ఉపయోగించుకునేందుకు రుసుం తీసుకుంటే… తనకీ, నిర్మాతకీ లాభమే! పేదరికంలో చనిపోయిన నటులకు ఈ సాంకేతికత అందుబాటులో ఉంటే ఎంత బాగుండేదో!
క్లిష్టమైన ఫైట్స్, డ్యాన్సులు చేయడానికి… డూప్ వల్ల అంత సహజత్వం రాకపోవచ్చు. స్వయంగా చేయడం సాధ్యమూ కాకపోవచ్చు. పైగా ఒకటికి పది షాట్లు తీస్తూ కోట్లు ఖర్చు చేయాలి. అందుకే కొందరు తెలుగు తారలు కూడా ఇప్పుడు డీప్‌ఫేక్ వైపు మొగ్గు చూపుతున్న మాట వినిపిస్తున్నది.
ప్రకటనల కోసం విపరీతమైన గిరాకీ ఉన్న సెలెబ్రిటీలు తమ డీప్‌ఫేక్ వీడియోలు వాడుకోమని స్వయంగా సూచిస్తున్న సందర్భాలు పెరుగుతున్నాయి. ఒక్కమాటలో చెప్పాలంటే తన రూపాన్ని వినియోగించుకోవడాన్ని కూడా ఓ వ్యాపారంగా మార్చుకునే జాగ్రత్త, ప్రణాళిక ఉంటే ఏ సెలెబ్రెటీ అయినా
ఓ పేరుగానే మిగిలిపోకుండా నాలుగు డబ్బులు కూడా వెనకేసుకోవచ్చు.
ఒకవేళ ఈ జాగ్రత్తలు పాటించడం మర్చిపోయి మోసపోయినా వెంటనే సైబర్ సెల్‌కి కంప్లయింట్ చేస్తే, డబ్బుల్ని తిరిగి పొందే అవకాశం ఉంటుంది. అంతదాకా తెచ్చుకోకుండా… ముందే జాగ్రత్తపడితే మోసగాళ్ల మెదళ్లకు బంధాలు వేసినట్టే!
– కె.సహస్ర