కార్వాన్ కబుర్లు
Sriya Reddy | రజనీకాంత్, నాగార్జున, షారుక్ ఖాన్, బ్రాడ్ పిట్ నా ఫేవరెట్ హీరోలు. హీరోయిన్ల విషయానికొస్తే.. వన్ అండ్ ఓన్లీ రేఖ. గుణ్ణం గంగరాజు సినిమాలు ఒకటి కూడా వదిలిపెట్టకుండా చూస్తాను.
చెన్నైలో పుట్టిన తెలుగమ్మాయి.. శ్రియారెడ్డి. తెలుగు, తమిళ, మలయాళ సినిమాలతో తన గ్లామర్‌ను దక్షిణాదికంతా విస్తరించింది. ఇప్పుడు హఠాత్తుగా తన స్పీడు పెంచింది. ‘సలార్’లో ప్రభాస్‌తో జోడీ కట్టిన శ్రియ.. ‘ఓజీ’లో పవర్‌స్టార్ పక్కన చుక్కలా మెరవనుంది. ఈ సందర్భంగా ఆమె ‘కార్వాన్’ కబుర్లు..
పుట్టింది, పెరిగింది, చదివింది చెన్నైలో. తెలుగు వాళ్లమే. నాన్న భరత్ రెడ్డి. ఇండియన్ టెస్ట్ క్రికెట్ టీమ్ మెంబర్. చిన్నప్పటి నుంచీ నాకు స్పోర్ట్స్ అంటే ఇష్టం. నేను సినిమాల్లోకి రావడం అమ్మానాన్నలకు అస్సలు ఇష్టం లేదు.
పదహారేండ్లు వచ్చేవరకూ స్పోర్ట్స్ అంటే పిచ్చి. స్టేట్ లెవెల్ రన్నింగ్ కాంపిటీషన్లో విన్నర్‌గా నిలిచాను. అబ్బాయిగా పుట్టి ఉంటే.. కచ్చితంగా క్రికెటర్ అయ్యేదాన్ని.
స్కూల్లో చదువుతున్నప్పుడే మోడలింగ్ చేశాను. ఆ తర్వాత అవకాశాలు వచ్చాయి కానీ, ‘ఏం చేసినా.. చదువు పూర్తయిన తర్వాతే’ అని షరతు పెట్టారు నాన్న.
2002లో ‘సమురాయ్’ సినిమాతో తొలిసారి తెర మీద కనిపించాను. దక్షిణాది భాషలన్నీ కలిపి ఓ పన్నెండు చిత్రాలు చేశాను.
ఆరోగ్యంగా ఉంటేనే ఏ పనైనా చేయగలం. అందుకే.. రెగ్యులర్‌గా వర్కవుట్స్ చేస్తాను. శరీరం ఫిట్‌గా ఉంటేనే.. మనసూ ఆరోగ్యంగా ఉంటుంది. తీసుకునే నిర్ణయాలు, మాట్లాడే మాటలు కూడా బాగుంటాయి.
ఖాళీ దొరికితే ఏదైనా టూర్ ప్లాన్ చేస్తా. జర్నీ అంటే ఇష్టం. ఇంట్లో ఉంటే మాత్రం మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాను. డ్యాన్స్‌లో నన్ను నేను మరిచిపోతాను.
మా ఆయన విక్రమ్ కృష్ణ. యాక్టర్, ప్రొడ్యూసర్ కూడా. ‘తిమిరు’ సినిమా సెట్స్‌లో మా తొలి పరిచయం జరిగింది. పరిచయం స్నేహంగా, స్నేహం ప్రేమగా.. ప్రేమ పెళ్లిగా మారడానికి రెండేండ్లు పట్టింది.
మలయాళంలో మమ్ముటితో కలిచి చేయడం, అదీ డీగ్లామర్ రోల్లో కనిపించడం విశేషమే. ఓ సీన్లో గ్లిజరిన్ లేకుండానే ఏడ్చేశాను. కట్ చెప్పిన తర్వాత డైరెక్టర్ రంజిత్ కొట్టిన చప్పట్లు ఇప్పటికీ నా చెవుల్లో మారుమోగుతున్నాయి.
పాప అమలీయ. మా అందరికీ తనే ప్రాణం. అల్లరిలో గోల్డ్ మెడల్ ఇవ్వొచ్చు. పెళ్లి, పాప తర్వాత ఎనిమిదేండ్లు సినిమాల గురించే ఆలోచించలేదు. ఇప్పుడు కొంత టైమ్ దొరుకుతున్నది కాబట్టి, సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశా. రెండు సినిమాలకు నిర్మాతను కూడా.
‘పందెం కోడి’, ‘పొగరు’ సినిమాలు తమిళ తెలుగు భాషల్లో మంచి గుర్తింపు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత ‘అమ్మ చెప్పింది’ చేశాను. కొంతకాలం పూర్తిగా తెలుగు ఇండస్ట్రీకి దూరమయ్యాను. ఇప్పుడు రెండు పెద్ద సినిమాలతో వస్తున్నా.. సలార్, ఓజీ.