దక్షిణాదిన వరుస సినిమాలతో రాణిస్తున్న నటి ధన్య బాలకృష్ణ. చిన్నచిన్న పాత్రలతో కెరీర్ ప్రారంభించి హీరోయిన్గా ఎదిగిన ధన్య సినిమాలతోపాటు వెబ్‌సిరీస్‌లతోనూ ఆకట్టుకుంటున్నది. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘రాజా రాణి’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇటీవలే తెలంగాణ నేపథ్యంలో వచ్చిన బాపు సినిమాతో మరోసారి టాలీవుడ్ ప్రేక్షకులను పలకరించింది. సహజమైన నటన, వైవిధ్యమైన పాత్రలతో అలరిస్తున్న ధన్య పంచుకున్న కబుర్లు..
ఒక అమ్మాయి సినిమా ఫీల్డ్ ఎంచుకోవడం అనేది వెరీ టఫ్. మేం తలుచుకుంటే ఐఏఎస్, ఐపీఎస్ అయినా ఈజీగా అయిపోతాం. కానీ, యాక్టర్ కావాలంటే సవాలక్ష సవాళ్లు ఎదురవుతాయి. అమ్మానాన్నలను, చుట్టుపక్కల వారిని, బంధువులను ఇందరిని ఒప్పించాలి. లక్కీగా నాకు అమ్మానాన్న సపోర్ట్ దొరికింది. అనేవాళ్లు చాలా మాటలే అన్నారనుకోండి. ఎంత ఒప్పుకొన్నా.. అవుడ్ డోర్ షూటింగ్ అంటే నాన్న కాస్త టెన్షన్ పడుతుంటాడు. తరచూ ఫోన్ చేసి.. ‘అంతా సేఫ్ కదా’ అని అడుగుతుంటారు. అంతేకానీ, ఇదంతా ఎందుకు ఆపేయ్ అని ఎన్నడూ అనలేదు. అందుకు నాన్నకు రుణపడి ఉంటాను.
నా మొదటి సినిమా 7th సెన్స్. ఆ సినిమా ఆడిషన్‌కు వెళ్లినప్పుడు చాలా టెన్షన్ అయింది. సెలెక్ట్ అవుతానని అనుకోలేదు. ఆ పాత్ర కూడా నాకు బాగా సెట్ అయింది. మంచి పేరు కూడా వచ్చింది.
ఇండస్ట్రీలో స్థిరపడటం అంత సులభం కాదు. మొదట్లో చాలా రిజెక్షన్స్ ఎదురయ్యాయి. కానీ, అవే నన్ను మరింత బలంగా నిలబెట్టాయి. ప్రతి సవాలును ఒక పాఠంలా తీసుకున్నాను. నేను వైవిధ్యమైన పాత్రలు చేయాలని ఆశపడుతున్నాను. నిర్మాణంలో కూడా పాల్గొని.. నా కథను నేనే చెప్పుకోవాలని ఉంది.
పుట్టింది, పెరిగింది బెంగళూరులో. నా మాతృభాష కన్నడ. కానీ నేను తెలుగు, తమిళ సినిమాల్లో నటించాను. నాకు నటన అంటే చిన్నప్పటి నుంచి ఇష్టం. ఇష్టమైన రంగంలోనే రాణించడం చాలా సంతోషంగా ఉంది. ఈ ప్రయాణంలో నా కుటుంబం మద్దతు ఎంతో ఉంది. కెరీర్ ఎంచుకోవడంలో అమ్మానాన్న నాకు పూర్తి స్వేచ్ఛనిచ్చారు.
నేను చేసిన నిమాల్లో ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ నాకు చాలా స్పెషల్. ఆ సినిమాలో మహేష్‌బాబు గారితో కలిసి నటించడం అద్భుతమైన అనుభవం. ‘రాజా రాణి’ సినిమా షూటింగ్లో నయనతార గారితో ఒక సీన్ తీస్తున్నప్పుడు, నేను డైలాగ్ మర్చిపోయి అందరి ముందు నవ్వేశాను. ఆ రోజు సెట్ మొత్తం నవ్వులతో నిండిపోయింది. చాలా ఫన్నీ మూమెంట్!
ఇడ్లీ, సాంబార్ చాలా ఇష్టం. ఇంట్లో అమ్మ చేసే గుంటూరు పచ్చడి కూడా నా ఫేవరెట్. సౌత్ ఇండియన్ ఫుడ్‌కే ఓటేస్తాను. నాకు పుస్తకాలు చదవడం ఇష్టం. ఇటీవల ‘ది ఆల్కెమిస్ట్’ చదివాను, అది నన్ను చాలా ఆలోచింపజేసింది. ట్రావెలింగ్ అన్నా ఇష్టమే. కొత్త ప్రదేశాలు చూడటం ఎనర్జీ ఇస్తుంది. నేను ఫిట్నెస్కి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తాను. యోగా నా దినచర్యలో భాగం.
నాకెరీర్‌లో కామెడీ, రొమాన్స్‌తోపాటు ఎమోషనల్ పాత్రలు చేస్తూ ఉన్నాను. ‘చిన్నదు భద్రకాళి’ లాంటి సినిమాల్లో పవర్ఫుల్ రోల్స్ చేసినప్పుడు ప్రేక్షకుల ప్రశంసలు చాలా సంతోషాన్ని ఇచ్చాయి. సోషల్ మీడియాలో నా ఫ్యాన్స్‌తో మాట్లాడటం ఆనందాన్నిస్తుంది. వాళ్లతో కనెక్ట్ అవ్వడం చాలా స్పెషల్‌గా అనిపిస్తుంది.