సామాజిక మాధ్యమాల శకం మొదలయ్యాక మనిషి ఆలోచనా విధానం మారింది. ఆశిస్తున్నదీ మారిపోయింది. అర్థం చేసుకుంటున్న తీరులోనూ విస్పష్టమైన మార్పు వచ్చింది. ఈ సాంకేతిక వారధి.. వ్యాపారంలో విజయాలకు ప్రధాన సారథిగా నిలుస్తున్నది. ఒక బ్రాండ్ విక్రయాలు.. అది సోషల్ మీడియాలో ఎంత రీచ్ అయిందన్న దానిపై ఆధారపడి ఉంటున్నది. స్టార్ క్రికెటర్లు, స్మార్ట్ యాక్టర్ల ప్రకటనల కన్నా.. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే చిన్న పోస్టు ఎక్కువమందిని ప్రభావితం చేస్తున్నది.
బ్రాండింగ్ ఇప్పుడో ట్రెండు. మన ఉత్పత్తి విపణిలో విప్లవం పుట్టించాలంటే.. అది సామాజిక మాధ్యమాల్లో విస్ఫోటం అవ్వాలి. సాదాసీదా పోస్టు చేస్తే… బ్రాండ్ బ్యాండ్ మోగదు. ఎంతమందికి రీచ్ అవుతుందో అంచనావేయగలగాలి. షేరింగులు, లైకింగులు ఎన్నొస్తున్నాయో లెక్కలు చూసుకోవాలి. మన అప్లికేషన్‌ను ఎంతమంది ఇన్స్టాల్ చేసుకున్నారో తెలుసుకోవాలి. బ్రాండ్‌పై సందేహాలు నివృత్తి అయ్యేలా సందేశాలు పంపాలి. వినియోగదారులు, నెటిజన్ల ఇష్టాయిష్టాలకు తగ్గట్టుగా ప్రమోషన్ సాగాలి. అప్పుడు గానీ, సోషల్ మీడియా వేదికగా బ్రాండింగ్ సజావుగా సాగదు.
ఒక బ్రాండ్ నిలబడాలంటే కస్టమర్ల రివ్యూలే కీలకం. వారి మనసులో ఉన్నది తెలుసుకోవడం అనుకున్నంత తేలికైన పనికాదు. పైగా సామాజిక మాధ్యమాలు భావ వ్యక్తీకరణకు పట్టుగొమ్మల్లా తయారయ్యాయి. ఇక్కడ ఎవరికి వారే మహారాజు. వాళ్లను ఆకట్టుకోవడం ఆషామాషీ వ్యవహారం కాదు. అమాసకో, పున్నానికో ఓ పోస్టు విదిలించి.. ప్రచారాన్ని వదిలేస్తే ప్రయోజనం ఉండదు. వారితో నిరంతరం మమేకమవ్వాలి. గతంలో చేసిన పోస్టులపై వాళ్లు చేసిన కామెంట్లను పరిగణనలోకి తీసుకుంటూ.. బ్రాండ్ ప్రచారం ఫలవంతంగా చేయాలి. ఈ ప్రచార పర్వంలో మీ ఉత్పత్తులతోపాటు సంస్థ పరపతి కూడా పెరిగేలా జాగ్రత్తపడాలి. ఇందుకోసం అవసరమైన మేరకు సంస్థ అంతర్గత విషయాలనూ కస్టమర్లతో పంచుకోవాలి. ఒక ఉత్పత్తిని ఎలా తయారు చేస్తున్నది, తయారీలో తీసుకుంటున్న జాగ్రత్తలు, ఉద్యోగుల పనితీరు, వారిపట్ల యాజమాన్యం వ్యవహార శైలి ఇలాంటి విషయాలన్నీ చిన్నచిన్న వీడియోల రూపంలో, రీల్స్‌గా ప్రమోషన్ చేయడం ద్వారా మేలైన ఫలితం పొందే అవకాశాలు ఉంటాయి. మార్కెటింగ్ సూత్రాల్లో భాగంగా డిస్కౌంట్ ఆఫర్లు ప్రకటిస్తూ ఉండాలి. అలా ప్రకటించినప్పుడు ఆ సంగతి బహుళ జనాదరణ పొందేలా ప్రచారం చేయడం అత్యావశ్యకం అని గుర్తుంచుకోండి.
బ్రాండ్ ప్రచారానికి సోషల్ మీడియా ఎంత అనువైనదో.. అదే ఉత్పత్తులను ఉత్త్తుత్తివి అని తేల్చేయడానికీ ఇక్కడ అంతే స్కోప్ ఉంటుంది. డిజిటల్ అస్ర్తాన్ని సరిగ్గా సంధించకపోతే మీ డేటా నిర్వహణ గాడి తప్పొచ్చు. సామాజిక మాధ్యమాలను తక్కువ అంచనా వేస్తే.. కీర్తి రాకపోగా, అపకీర్తి మూటగట్టుకునే ప్రమాదం ఉంది. ఈ క్రమంలో మీ లక్ష్యసాధనకు ఆటంకం కలిగించే అంశాలను గుర్తించి, వాటికి పరిష్కారాలను కనుగొనాలి. సంస్థ తరఫున మీరు చేసే పోస్టులు హుందాగా ఉండాలి. ఏ వర్గాన్నో కించపరిచేవిగా ఉండకూడదు. కాపీ రైట్ ఇష్యూస్ రాకుండా చూసుకోవాలి. అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు.. వాటి పర్యవసానాలను అంచనా వేయగలగాలి. ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా ఎలా ప్రభావితం చేస్తాయో.. అంచనావేసి వాటిని ఎదుర్కొనేలా రిస్క్ మేనేజ్మెంట్కు సిద్ధంగా ఉండాలి.