మహారాష్ట్రలోని లోనావాలాకు లోన్లీగా వెళ్లినా అదిరిపోతుంది. ప్రకృతితో ముచ్చటించొచ్చు. మేఘాలను సుతారంగా తాకొచ్చు. పిల్లగాలులకు ఈలతో వంతపాడొచ్చు. గుంపుగా వెళ్లినా పైన చెప్పినవన్నీ షరతుల్లేకుండా చేసేయొచ్చు.
ఈ ఆనందయానానికి సాహసోపేతమైన ముగింపు డెల్లా అడ్వెంచర్ పార్క్.
సరదాలే కాదు సాహసాలూ కావాలనుకునే యాత్రికులు చేరాల్సిన చోటు ఇది. ఈ డెల్లా అడ్వెంచర్ పార్క్‌లో ఒకటి కాదు, రెండు కాదు లెక్కలేనన్ని సాహస క్రీడలు. రోజుల తరబడి సాహసాలు చేసేందుకు చక్కని రిసార్ట్స్ కూడా ఉన్నాయి. భారత దేశంలో అతిపెద్ద రిక్రియేషన్ పార్క్ ఇదేనట. 36 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పార్క్‌లో అనేక థీమ్ పార్క్‌లు ఉన్నాయి. పిల్లలు, పెద్దలు సరదా సరదాగానే సాహసవీరులు అయిపోవచ్చు. దేశంలోనే అత్యంత ఎత్తయిన బంగీజంప్, స్వూప్ స్వింగ్, స్కై సైక్లింగ్-వే ఇక్కడ ఉన్నాయి. ఏవీ మోటార్స్, బేబీ వ్యాగన్ సైక్లింగ్ కోసం ప్రత్యేకంగా మట్టిదారులు నిర్మించారు. ర్యాప్లింగ్, హై రోప్, ఆర్టిఫీషియల్ రాక్ ైక్లెంబింగ్, వర్టికల్ రోప్ చాలెంజ్ లాంటి సాహస క్రీడలు క్షణం తీరికలేకుండా చేస్తాయి. ఏటీవీ మోటార్ రైడ్, బగ్గీరైడ్, బబూల్ సాకర్, ఆర్చరీ, షూటింగ్ రేంజ్, బంపర్ బోట్ ఆటలు సాదాసీదా యాత్రికులకు కావాల్సినంత ఆనందాన్ని ఇస్తాయి.
అంతెత్తు నుంచి నేలరాలుతూ చేసే సాహసం మాటలా? 150 అడుగుల ఎత్తు నుంచి ఒక్కసారిగా కిందపడిపోతూ నేలను తాకే క్షణాల్లో ఆగిపోవడం అంటే గుండె ఆగినంత పనే. కానీ, ఇక్కడ పడిపోవడం గుండె ధైర్యాన్ని పరీక్షించుకోవడమే!
రెక్కలు కట్టుకుని ఆకాశంలో ఎగరడం కలే. ఆ కలలకు రెక్కలు కట్టుకుని డెల్లా అడ్వెంచర్ పార్క్‌లో వాలితే ఆకాశంలో 1,250 అడుగుల దూరం ఎగురుతూ ప్రయాణం చేయొచ్చు!
ఆశనిరాశల్లాగే.. సాహసానికి భయానికి మధ్య ఊగిసలాట ఉంటుంది. అలాంటి అనుభూతి కోసం ఈ రెండు ఉక్కు టవర్ల మధ్య ఉగుతూ ఉక్కునరాల ఉత్కంఠను అనుభవించి తీరాలి. 100 అడుగుల ఎత్తునుంచి అలా వంద కిలోమీటర్ల వేగంతో జారుతుంటే నేలపై పడిపోతామనే భయం గుండెల్ని పిండేస్తుంది. కొన్ని అంగుళాల వ్యత్యాసంలో ఆగిపోయి… నేలను తాకకుండానే పైకి దూసుకుపోతుంటే ఆకాశం అందినంత ఆనందం కలుగుతుంది.
నేలకు 30 అడుగుల ఎత్తులో 328 అడుగుల పొడవున్న రోప్‌పై సైకిల్ ప్రయాణం పదికాలాలు గుర్తుండిపోతుంది.
తలకిందుల ప్రయాణం తపస్సు చేసినా సాధ్యం కాదు. కానీ, డెల్లా అడ్వెంచర్ పార్క్‌లోని ఏ జోన్లో అది సాధ్యమే. సైకిల్ తొక్కేవాళ్లు సీట్ బెల్ట్ పెట్టుకోవాలనే హెచ్చరిక ఈ ఒక్కచోటనే ఉంటుంది!
రాకెట్లా నిటారుగా దూసుకుపోవాలంటే ఎలాస్టిక్ బెల్ట్ ధరిస్తే సరి. దేశంలోనే అతిపెద్ద రాకెట్ ఎజెక్టర్ ఇది.
సికింద్రాబాద్ నుంచి లోనావాలాకు రైలు సౌకర్యం ఉంది. విమానంలో అయితే ముంబయికి గానీ, పూణెకు గానీ చేరుకోవాలి. అక్కణ్నుంచి రోడ్డు, రైలు మార్గంలో లోనావాలా చేరుకోవచ్చు.