ప్రశంస కోసం పాకులాట
రోజూ మనం చూసే సమాజంలో, మన చుట్టూ ఉన్నవారితో గడిపేటప్పుడు, కొందరు వ్యక్తులు ఎదురుపడతారు. వీరు ఏ చిన్న పని చేసినా- అది ఒక మొక్కకు నీళ్లు పోయడమో, ఇంటిని కాస్త సర్దడమో, ఆఫీసులో ఒక చిన్న ఈమెయిల్ ఫార్వర్డ్ చేయడమో కావచ్చు. వెంటనే అందరి దృష్టిని ఆకర్షించడానికి ప్రయత్నిస్తారు. ‘నేనే కదా ఇది చేశాను!’, ‘చూశారా, ఎంత చక్కగా చేశానో!’ అంటూ ఎదుటివారి నుంచి అభినందనల వర్షం కురిపించుకోవడానికి తాపత్రయపడతారు. పైకి చూసేవారికి ఇది కాస్త అతిగా లేదా బాల్యపు చేష్టలా అనిపించవచ్చు. కానీ దాని వెనుక కొన్ని సైకలాజికల్ కారణాలు ఉంటాయి.
మన్తరంగం
మానసిక శాస్త్రం కోణంలో పరిశీలిస్తే ప్రతి పనికి ప్రశంస కోరుకునే వారి ప్రవర్తన వెనుక లోతైన భావోద్వేగ కారణాలు, అభద్రతా భావాలు, మెదడు పనిచేసే తీరు దాగి ఉంటాయి. ఈ విచిత్రమైన లేదా విభిన్నమైన మనస్తత్వం వెనుక ఉన్న కారణాలు ఏమిటో పరిశీలిద్దాం.
1. అభద్రతా భావం
ఎల్లప్పుడూ ప్రశంసలు కోరుకునే వారిలో చాలామంది తమను తాము తక్కువగా అంచనా వేసుకుంటూ ఉంటారు. వీరు తమంత తాముగా తమ విలువను గుర్తించలేరు. ఇతరులు ‘బాగా చేశావు’ అని అంటేనే వీరు ఉనికిలో ఉన్నట్లు, తమకు ఒక విలువ ఉన్నట్లు ఫీలవుతారు. బాహ్య ప్రపంచం ఇచ్చే సర్టిఫికెట్ మీద వీరు పూర్తిగా ఆధారపడిపోతారు.
2. బాల్యపు అనుభవాలు, గుర్తింపు లేమి
మనిషి ప్రవర్తనలో సగానికి పైగా బాల్యపు అనుభవాలే పునాది వేస్తాయి. చిన్నతనంలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు ఎంత మంచి పని చేసినా మెచ్చుకోకపోవడం, కేవలం తప్పులను మాత్రమే ఎత్తిచూపడం లాంటి వాతావరణంలో పెరిగిన పిల్లలు పెద్దయ్యాక ఈ లోటును పూడ్చుకోవడానికి ప్రయత్నిస్తారు. చిన్నప్పుడూ దక్కని ఆమోదం కోసం పెద్దయ్యాక ప్రతి చిన్న విషయానికి ఎదుటివారి అంగీకారాన్ని కోరుతుంటారు.
3. మెదడులో డోపమైన్ రివార్డ్ సిస్టమ్
మానవ మెదడులో ‘డోపమైన్’ అనే హార్మోన్ ఆనందాన్ని, ఉత్సాహాన్ని ఇస్తుంది. ఎవరైనా మనల్ని ప్రశంసించినప్పుడు మెదడు ఒక్కసారిగా డోపమైన్‌ను విడుదల చేస్తుంది. దీనివల్ల క్షణకాలం పాటు ఒక మంచి అనుభూతి కలుగుతుంది. చిన్న పనులకు కూడా ప్రశంసలు కోరేవారు ఈ డోపమైన్కి అలవాటుపడిపోతారు ప్రతి చిన్నదానికీ మెప్పు పొందడం ద్వారా తాత్కాలిక సంతోషాన్ని ఆశిస్తారు.
4. బాహ్య ప్రేరణపై ఆధారపడటం
కొంతమంది తమ సంతోషానికి, సంతృప్తికి తామే కర్తలుగా ఉంటారు. కానీ, వీరు మాత్రం తమ పనికి ఇతరులే జడ్జ్‌లుగా ఉండాలని కోరుకుంటారు. ‘నేను నా మనసు మెచ్చిన పని చేశాను’ అనుకోవడం కంటే ‘పక్కవాడు నన్ను మెచ్చుకున్నాడు‘ అనేదానికే వీరు ఎక్కువ విలువ ఇస్తారు.
5. అటెన్షన్ సీకింగ్ టెండెన్సీ
కొన్ని సందర్భాల్లో ఇది కేవలం గుర్తింపు పొందే యావ మాత్రమే కావచ్చు. నలుగురిలో ప్రత్యేకంగా నిలవాలనే కోరిక, తన ఉనికిని ఎవరూ విస్మరించకూడదనే తాపత్రయం వల్ల వీరు ప్రతి చిన్న పనిని పెద్దదిగా చేసి చూపడానికి ప్రయత్నిస్తారు.
కౌన్సెలింగ్ ఇలా..
ఏ చిన్న పని చేసినా వెంటనే గుర్తింపు, ప్రశంస కోరుకునే వ్యక్తుల వెనుక ఉన్న మానసిక సమస్య కేవలం ‘అతియావ’ కాదు; అంతర్గతంగా ఉన్న ఆత్మవిశ్వాస లేమి, అభద్రతా భావం, బాల్యపు లోటుపాట్లు. కాబట్టి కౌన్సెలింగ్ ఇచ్చేటప్పుడు వారిని విమర్శించకుండా, ఎంపథీతో కూడిన విధానాన్ని అనుసరించాలి.
కౌన్సెలింగ్ ప్రారంభంలో వారిని ఏమాత్రం తప్పుపట్టకూడదు. వారు తమ బలహీనతలను, అభద్రతలను ఎలాంటి భయం లేకుండా పంచుకునేలా ఒక సురక్షితమైన వాతావరణాన్ని కల్పించాలి. ‘ఇతరుల మెప్పు కోసం చూడటం మానవ సహజమే, కానీ దీనివల్ల నీకు కలిగే ఒత్తిడిని మనం పరిశీలిద్దాం’ అని భరోసా ఇవ్వాలి.
కాగ్నిటివ్ బిహేవియరల్ థెరపీ ద్వారా వారి ఆలోచనా విధానాన్ని మార్చడానికి ప్రయత్నించాలి. ‘మెప్పు లేకపోతే అందరూ నన్ను అసహ్యించుకుంటారు’ లేదా ‘నేను చేసే పనికి విలువ లేదు‘ అనే తప్పుడు ఆలోచనలను వారితో గుర్తింపజేయాలి. ‘ఇతరులు నిన్ను పొగిడినప్పుడు నీకు కలిగే ఆనందం ఎంతసేపు ఉంటుంది? పొగడకపోతే నీకు ఎందుకు నిరాశ కలుగుతుంది?’ అని
లాజికల్ ప్రశ్నలు అడగడం ద్వారా వారిని ఆత్మపరిశీలన చేసుకునేలా చేయాలి.
వారి సంతోషం ఇతరుల సర్టిఫికెట్ల మీద ఆధారపడకూడదని వారికి అర్థం చేయించాలి. ‘నీ పని నీకు నచ్చిందా? నీ మనస్సాక్షికి అది సరైనదేనా?’ అని ప్రశ్నించడం ద్వారా ఇతరుల ప్రశంసల కంటే సొంత సంతృప్తి ముఖ్యం అనే భావనను వారి మనసులో బలపర్చాలి.
చాలా సందర్భాలలో వీరు చిన్నతనంలో తల్లిదండ్రుల నుంచి తగిన గుర్తింపు పొంది ఉండరు. థెరపీలో భాగంగా వారి ‘ఇన్నర్ చైల్డ్‌తో మాట్లాడేలా చేయాలి. చిన్ననాటి ఆ లోటును ఇప్పుడు పెద్దయ్యాక ఎవరో ఒకరు తీర్చాలని కోరుకోవడం వల్ల ప్రయోజనం లేదని, ఇప్పుడు తమను తాము ప్రేమించుకోవడం నేర్చుకోవాలని వివరించాలి.
మొదట ఒక రోజులో కొన్ని పనులను ఇతరులకు చెప్పకుండా, ఎవరి ప్రశంసలూ ఆశించకుండా కేవలం తమకోసం మాత్రమే పూర్తి చేయమని ఒక చిన్న టాస్క్ ఇవ్వాలి. ఆ తర్వాత దానివల్ల కలిగిన ప్రశాంతతను డైరీలో రాసుకోమని సూచించాలి. రాత్రి పడుకునే ముందు ఆ రోజు తాను చేసిన మంచి పనికి తానే స్వయంగా అద్దంలో చూసుకుని ‘వెల్ డన్’ చెప్పుకునేలా ప్రాక్టీస్ చేయించాలి.
చిన్న పనులకు కూడా ప్రశంస కోరడం అంతర్గతంగా ఉన్న ఆత్మవిశ్వాస లోపానికి ఒక నిదర్శనం. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోవడం ద్వారా బాహ్య గుర్తింపు కంటే అంతర్గత సంతృప్తికి విలువ ఇవ్వడం ద్వారా ఈ స్వభావాన్ని మెరుగుపరుచుకోవచ్చు.
సవాళ్లు ఏమిటి?
నిరాశ నిస్పృహలు: ఎదుటివారు ఎప్పుడూ అనుకున్నట్లుగా ప్రశంసించకపోతే తీవ్ర నిరాశకు గురవుతారు. మానసిక ఉద్వేగాలను నియంత్రించుకోలేరు. సంబంధాలలో దూరం: పదే పదే ‘నన్ను పొగడండి’ అనే ధోరణి చుట్టూ ఉన్నవారికి చిరాకు తెప్పిస్తుంది. దీనివల్ల సహచరులు, స్నేహితులు క్రమంగా వీరికి దూరమయ్యే అవకాశం ఉంది. ఆత్మ విశ్వాసం కొరవడటం: ఇతరుల ప్రశంస లేనిదే ఏ పని చేయలేని బలహీనత ఏర్పడుతుంది.
బి. కృష్ణ, సీనియర్ సైకాలజిస్ట్
ఇగ్నిషియో చైల్డ్ డెవలప్మెంట్ సెంటర్
హైదరాబాద్, 99854 28261
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

