Money | ఈ ప్రపంచంలో ఎంత పాతబడినా, ఎన్ని చేతులు మారినా విలువ తగ్గని ఏకైక వస్తువు డబ్బే! అందుకే, చాలామంది వీలైనంత ఎక్కువ డబ్బు సంపాదించాలని ఆరాట పడుతుంటారు!! ఈ కాసుల వేటలో సర్వశక్తుల్నీ ఒడ్డుతుంటారు. కోల్పోయేది ఏమీ లేనప్పుడు తెగించడంలో అర్థం ఉంది. కానీ, మేధస్సును మరిగించి, కాలాన్ని కరిగించి ఆర్జించిన సొమ్మును క్విక్ మనీ రేసులో కుమ్మరిస్తూ సమస్యలు కొనితెచ్చుకుంటున్నారు కొందరు. రెక్కలు పూర్తిగా తొడగకముందే రివ్వున ఎగిరి, శక్తిచాలక కుదేలవుతున్నారు. అడ్డాలనాడు బిడ్డలకు తల్లిదండ్రుల అండ ఉంటుంది. ఆ బిడ్డలే గడ్డాలనాడు తడబడితే.. ఆదుకునేవారు ఉండరు!!
‘పైసా కమానా నహీ.. బనాయా జాతా హై’ ఓ వెబ్ సిరీస్‌లోని డైలాగ్ ఇది. ‘పైసలను సంపాదించడం కాదు, సృష్టించాలి’ అని అర్థం! ఈ తరం పోకడ అచ్చంగా ఇలాగే తయారైంది. పొదుపు మంత్రం పఠించడం మంచిదే! మదుపు చేయడమూ ఉన్నతమైనదే! కానీ, ఎంచుకున్న మార్గం ప్రధానం. చాలామంది ఉద్యోగంలో చేరింది మొదలు అలవికాని లక్ష్యాలను నిర్దేశించుకుంటున్నారు. కెరీర్ గాడిలో పడకముందే.. నయా గాడీ కొనడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు. పెద్దలు వారిస్తే.. ‘వాయిదా పద్ధతుంది దేనికైనా..’ అని సర్దిచెబుతున్నారు. పెండ్లి, పిల్లల ముచ్చట తీరకముందే లంకంత ఇల్లు కొనేస్తున్నారు. చేతిలో నయా పైసా లేకున్నా… మూడు నెలల పే స్లిప్పులు, ఆరు నెలల బ్యాంకు స్టేట్మెంట్తో రుణ సదుపాయం పొంది.. ఉపాయంగా ఓ ఇంటివారవుతున్నారు. పాతికేండ్లకే వాయిదాల ఉచ్చులో చిక్కుకొని.. ఒత్తిళ్లతో కుస్తీ పడుతున్నారు.
పైగా తామంతా జాగ్రత్తపరులమనీ, జీవితాన్ని ప్రణాళిక బద్ధంగా నిర్వహిస్తున్నామన్న భావన వ్యక్తం చేస్తుంటారు. అయితే, వీరిలో చాలామంది రోజులు గడిచే కొద్దీ ‘అమ్మో! ఒకటో తారీఖు’ అనుకుంటున్నారు. ఖాతాలో జీతం క్రెడిట్ అయ్యిందన్న ఆనందంలో ఉండగానే ఈఎమ్ఐ డెబిట్ సందేశాలతో వేతన జీవులు వేదనకు గురవుతున్నారు.
ఈజీ మనీ ట్రాప్‌లో..
వాయిదాల రావుల సంగతి కాసేపు పక్కన పెట్టి, ఈజీ మనీ కోసం వెంపర్లాడే క్రేజీ ఫెలోస్ గురించి చర్చించుకుందాం. డబ్బు విలువ బాగా తెలుసనే భ్రమలో ఉంటారు వీళ్లు. రూపాయి నాణెం నాటి దానికి కరెన్సీ కట్టలను పూయిస్తామని గప్పాలు కొడుతుంటారు. రిస్క్ లేనిదెక్కడా? అంటూ లెక్చర్లు దంచుతారు. అయితే వీరిలో చాలామందికి ప్రత్యక్షంగా పనిచేసే మేధస్సు ఉండదు. బుర్రలో తొలిచే ఆలోచనలు అమలుచేసే సామర్థ్యం అంతకన్నా ఉండదు. అప్పనంగా పైసలు రావాలంటే ఏం చేయాలో అని మాత్రం సదా అన్వేషిస్తూ ఉంటారు.
మ్యూచువల్ ఫండ్స్, ఈక్విటీ వంటి లాంగ్‌టర్మ్ ఇన్వెస్ట్మెంట్స్ వీరికి బోరింగ్ సబ్జెక్టులు. ఓనమాలు తెలియకుండానే ట్రేడింగ్‌లో ట్రెండ్ సృష్టిస్తామని బీరాలు పలుకుతుంటారు. అనుకోకుండా ఒకరోజు లాభాలు కండ్ల చూడగానే.. ప్రతిరోజూ కాసులపంట పక్కా అని తీర్మానించుకుంటారు. పెట్టుబడికి నిధులు లేకపోతే ట్రేడింగ్‌లో కింగులమని చెబుతూ అందినచోటల్లా అప్పు చేస్తారు. అవగాహనా రాహిత్యం, మితిమీరిన విశ్వాసంతో తప్పటడుగు వేసి ట్రేడింగ్ గంట మోగిన నిమిషాల్లోనే సర్వం కోల్పోయి అప్పుల ఊబిలో కూరుకుపోతారు. స్టాక్ మార్కెట్‌పై పట్టులేకుండా స్టార్‌ను నమ్ముకున్న వారిలో చాలామంది పరిస్థితి ఇదిగో ఇలాగే తయారవుతుంది. అయినా, ఎప్పుడో ఒకసారి తగిలే జాక్‌పాట్ మత్తులో ప్రతిరోజూ రిస్క్ చేస్తూ రెస్ట్‌లెస్‌గా మిగిలిపోతుంటారు.
ఈజీ మనీ ఈజ్ నాట్ సేఫ్
చేతిలో సెల్‌ఫోన్ ఉంటే చాలు.. డబ్బులు సంపాదించొచ్చు అనే ధోరణి ఇంకొందరిది. ఆన్లైన్ గేమింగ్‌ను అల్లావుద్దీన్ దీపంగా భావిస్తున్నారు. బెట్టింగ్ యాప్స్‌తో నడమంత్రపు సిరి వస్తుందని ఆశిస్తున్నారు. అప్పు తెచ్చి మరీ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. దురదృష్టం వెక్కిరించడంతో బొక్కబోర్లాపడుతున్నారు. దీనికితోడు గతంలో అప్పు పుట్టాలంటే చెప్పులు అరిగేదాకా తిరగాల్సి వచ్చేది. ఇప్పుడు నిమిషాల్లో రుణాలు మంజూరు అవుతున్నాయి. అప్పులు తీర్చడానికీ అప్పులిచ్చే యాప్‌లు వచ్చేశాయి. క్రెడిట్ కార్డులు ఎలాగూ ఉన్నాయి. క్రెడిట్‌కార్డు నుంచి బ్యాంకు అకౌంట్‌కు నగదు బదిలీ చేసుకునే సౌలభ్యమూ ఉంది. ఇవన్నీ నేటి తరాన్ని ఈజీ మనీ దిశగా పరుగులు పెట్టిస్తున్నాయి. ఒక్కసారి ఈ చట్రంలో ఇరుక్కుపోయారో… పులిమీద స్వారీ చేసినట్టే! తాహతుకు మించి సాహసాలు చేస్తే.. బతుకు పెనం పైనుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుంది. ఇన్వెస్ట్మెంట్ చేయడం తప్పుకాదు. లాభనష్టాలు అంచనా వేయగలగాలి. నష్టపోతే… ఎలా బయటపడాలో తెలిసి ఉండాలి. పూర్తి అవగాహనతో చేసే వ్యవహారాలు ఆర్థికంగా మాత్రమే ప్రభావం చూపుతాయి కానీ, మీ వ్యక్తిత్వాన్ని, జీవితాన్ని తలకిందులు చేయవని గుర్తుంచుకోండి.
క్రెడిట్‌కార్డు నుంచి బ్యాంకు అకౌంట్‌కు నగదు బదిలీ చేసుకునే సౌలభ్యమూ ఉంది. ఇవన్నీ నేటి తరాన్ని ఈజీ మనీ దిశగా
పరుగులు పెట్టిస్తున్నాయి. ఒక్కసారి ఈ చట్రంలో ఇరుక్కుపోయారో… పులిమీద స్వారీ చేసినట్టే!
ఎం. రాం ప్రసాద్
సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్
ram@rpwealth.in
www.rpwealth.in