ఆత్మగౌరవ కేతనం… సినారె గీతం!
“కళ కళ కోసం కాదు... కళ కాసు కోసం కాదు... కళ ప్రజల కోసం” అన్న నమ్మిక కళాకారులది. కళ మనిషి జీవితానికి అందాన్ని, ఆనందాన్ని అందిస్తుంది. తమ ప్రతిభతో సమాజానికి ఆనందాన్ని పంచేది కళాకారులు. ఆ కళాకారుడి జీవితంలో ఉన్న కష్టాలను, అతని ఆర్థిక సమస్యలను సమాజం ఎంతవరకు గుర్తిస్తున్నది? ఈ ప్రశ్నకు సమాధానం వెతికే ప్రయత్నమే ‘లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్వెను నేను’ అన్న సినారె సినీ గీతం.
1979లో అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్‌పై వెంకట్ అక్కినేని నిర్మించిన చిత్రం ‘కళ్యాణి’. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వంలో మురళీ మోహన్, మోహన్‌బాబు, జయసుధ, కైకాల సత్యనారాయణలు ప్రధాన తారాగణంగా రూపొందిన చిత్రమిది. ఈ చిత్రం కోసం సినారె రాసిందే ‘లలిత కళారాధనలో… వెలిగే చిరుదివ్వెను నేను’ అనే గీతం.
కవి నారాయణరెడ్డి ‘పదుగురు పాలేర్లున్న’ వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చిన భూస్వామి. తన స్వయంకృషితో కవి, రచయితగా, పాలనాదక్షుడుగా ఎదిగారు. తన ఎనిమిదిన్నర దశాబ్దాల జీవితంలో తనచుట్టూ ఉన్న అనేకమంది కవులు, కళాకారులను ప్రత్యక్షంగా చూశారు. వారివారి కళలను, స్థితిగతులను చూశారు. బహుశా.. ఈ సినిమాకథకు అనుగుణంగా తాను చూసి, అనుభూతి చెందిన దానిని గీతంగా రాసి ఉంటారు.
పల్లవి
లలిత కళారాధనలో
వెలిగే చిరు దివ్వెను నేను
మధుర భారతి పద సన్నిధిలో
ఒదిగే తొలి పువ్వును నేను…
ఈ పంక్తులు కళాకారుడి వినయం, కళ పట్ల అతనికున్న గౌరవాన్ని తెలియజేస్తున్నాయి. తన కళలో తాను అంచుల్ని ముట్టినా తనను తాను ఒక చిన్న దివ్వెగా, ఒక అందమైన పువ్వుగా పోల్చుకోవడం వినయభారాన్ని తెలిపే సందర్భం. అంతేకాదు…‘తొలి పువ్వు’ ప్రయోగం కొత్తదనానికి, స్వచ్ఛతకు, ఆశకు ప్రతీకగా నిలుస్తుంది. మనకు తెలుసు, దివ్వె చిన్నదైనా చీకటిని తొలగిస్తుంది, పువ్వు చిన్నదైనా తన సువాసనతో అందరినీ ఆకట్టుకుంటుంది. అదేవిధంగా కళాకారుడు తన ప్రతిభతో సమాజానికి వెలుగునిస్తాడని సినారె భావన. సినిమా నేపథ్యం అంటే… ఈ చిత్రాన్ని ప్రసిద్ధ నవలా రచయిత్రి యద్దనపూడి సులోచనారాణి నవల ‘రాగమయి’ ఆధారంగా రూపొందించడం విశేషం. కళాకారుడికి పేరు ప్రతిష్ఠల కంటే కళంటేనే మక్కువ. తన జీవితాన్ని కళకు అంకితం చేసి, తన సృజన ద్వారా ఇతరులకు ఆనందాన్ని అందిస్తాడు. అయితే అటువంటి కళాకారుడి వినయాన్ని అతని బలహీనతగా భావించకూడదు, అతని ప్రతిభకు తగిన గుర్తింపు, గౌరవం ఇవ్వాలి అన్నది కవి భావన.
చరణం
కృతిని అమ్మని పోతన్నకు
మెతుకే కరువైపోలేదా….
తన ‘బాలరసాలసాల నవపల్లవ కోమల కావ్యకన్యక’ను తన అవసరాల కోసం అమ్మకుండా ఎన్నో ఆటుపోట్లను సహించిన కవి పోతనామాత్యుడు. అటువంటి పోతన జీవితాన్ని కవి గుర్తుచేస్తూ, ప్రస్తావిస్తూనే నర్మగర్భంగా తన రచనను ఆర్థిక అవసరాల కొరకు కాకుండా భక్తితో, ఆత్మగౌరవంతో సృజించిన కళాకారుడికి కనీస జీవన అవసరాలు కూడా తీరకపోతే ఎలా? అని ప్రశ్నిస్తున్నారు కూడా. తర్వాత సినీగీత కవి మరో ‘మహానుభావుడు’ త్యాగయ్యను, ఆయన జీవితాన్ని ఉదహరించడం కూడా చూడవచ్చు. త్యాగరాజు తన జీవితాన్ని సంగీతానికి, శ్రీరాముడి భక్తికి అంకితం చేశాడు. ఆయన కీర్తనలు నేటికీ సంగీత ప్రపంచంలో మణిమకుటాలు. కవి సినారె ఆ త్యాగరాజస్వామి బతికిన విధానాన్ని చెబుతూ, కళాకారుడి త్యాగాలను, అతని జీవితంలోని అనేక సంఘర్షణలను గుర్తుచేస్తున్నాడు.
బ్రతికి ఉండగా త్యాగయ్యకు
బ్రతుకే బరువైపోలేదా…
నిరంతరం, కష్టాలు, నష్టాలు, ఎన్నో మలుపులతో త్యాగయ్య జీవితం మనకు కనిపిస్తుంది. కానీ ఇవ్వాళ సంగీత ప్రపంచమంతా ఆయన మహాసమాధి వద్ద కూర్చుని వేడుకల్ని నిర్వహిస్తున్నది. ఇక్కడ కవి ఆ రెంటిని చెబుతారు వాచ్యంగా. ఇక్కడ ఇంకో అర్థం కూడా ఉంది సుమా! కళాకారుడు జీవించి ఉన్నప్పుడు అతనికి తగిన గౌరవం లభించాలి అని.
విరిసిన కుసుమం వాడిపోతే…
కరుణ చూపేదెవరు?
పాడే కోకిల మూగవోతే..
పలకరించేదెవరూ?
కవులు, కళాకారుల జీవితాలను గురించి చెప్పిన కవి పై పంక్తుల్లో కళాకారుడి జీవితంలోని మరికొన్ని కోణాల్ని పరిచయం చేసే ప్రయత్నం చేస్తారు. అందులోనూ .పోతన, త్యాగయ్యల ప్రస్తావనలోని సామాజిక వాస్తవాన్ని మనం అర్థం చేసుకోవాలి. పై పంక్తుల వద్దకు వస్తే పువ్వు వికసించినప్పుడు అందరినీ ఆకర్షిస్తుంది. కానీ వాడిపోయిన తర్వాత దాని అందాన్ని, విలువను ప్రశంసించేవారు తక్కువ. కోకిల మధురమైన గానాన్ని విని అందరం ఆనందిస్తాం, కానీ ఆ గొంతుక మూగబోయినప్పుడు?
ఇక్కడ కవి సినారె చెప్పాలనుకున్నది… ఒక కళాకారుడు తన ప్రతిభతో ప్రజలను అలరిస్తున్నప్పుడు అందరూ అతన్ని ప్రశంసిస్తారు. కానీ వయసు పెరిగి, అవకాశాలు తగ్గి, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు అతణ్ని ఆదుకునేవారు కొద్దిమందే ఉంటారని. నిజానికి చిన్న గీతం ద్వారా అతిపెద్ద విషయాన్ని చెప్పిన కవి సినారె. అవునుకదా! ఇది మనం ఆలోచించాల్సిన విషయం కూడా. బహుశా.. అందుకేనేమో కాస్త కఠినంగానే కింది రెండు పంక్తులలో ఇలా గట్టిగా అడిగేశారు…
కడుపునింపని కళలెందుకు?
తనకుమాలిన ధర్మమెందుకు?
నిజానికి ఈ రెండు పంక్తులను చూస్తే పాటలోని ముఖ్య భావన తెలుస్తుంది, గీతంలోని ప్రధాన సంఘర్షణకు అద్దం పడుతుంది. ‘లలిత కళారాధనలో వెలిగే చిరు దివ్వెను నేను’ గీతం కళాకారుడి మనో భావాలను అందంగా వ్యక్తీకరిస్తుంది. కళ పట్ల ప్రేమ, కళాకారుడి త్యాగం, ఆర్థిక సమస్యలు, సమాజం పట్ల అతని ఆశలు ఈ పాటలో ప్రతిబింబిస్తాయి.
– పత్తిపాక మోహన్
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- Banner
- self respect
- Sinare
- song
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

