శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Sunday - Jan 24, 2021 , 00:34:55

నివురుగప్పిన ఆనవాళ్లు

నివురుగప్పిన ఆనవాళ్లు

మనిషి పరిణామ క్రమాన్ని మేలిమలుపు తిప్పింది.. నిప్పు రాజేయడం. జీవనగతిని మార్చేయడమే కాదు, ఆధునిక యుగంలోకి అడుగుపెట్టేలా చేసింది.  ఆదిమమానవుడు ఎక్కడ నిప్పు పుట్టించాడన్నది తేల్చేందుకు కొన్నేండ్లుగా పరిశోధనలు సాగుతున్నాయి. ఈ ఆనవాళ్లు తెలంగాణలో వెలుగుచూశాయి. నివురుగప్పిన చరిత్రకు మహబూబ్‌నగర్‌ జిల్లా ఉట్నూరులోని బూడిద రాశులు సాక్ష్యంగా నిలుస్తున్నాయి.

ప్రాచీన చారిత్రక పరిశోధనకు రాష్ట్రంలో బయటపడ్డ బూడిద కుప్పలు/ బూడిద దిబ్బలు (ash mounds) ఊతమిస్తున్నాయి. ఈ బూడిద రాశుల అవశేషాలను పరిశోధించిన బ్రిటిష్‌ మ్యూజియం బృందం బృహత్‌ శిలాయుగం తొలినాళ్లలో ఆదిమ మానవులు నిప్పును రాజేసింది ఇక్కడేనని తేల్చింది. అంతకు ముందే, ఇక్కడ మానవ సంచారం ఉందని పరిశోధకులు నిర్ధారించారు. ఇవి ఎలా ఏర్పడ్డాయి? ఏ కాలం నుంచి ఉన్నాయి? అనే విషయాలపై పరిశోధన చేసిన రాబర్ట్‌ బ్రూస్‌ ఫూట్‌ అనే శాస్త్రవేత్త తెలంగాణలో మధ్యశిలాయుగపు మానవులు నిప్పును వాడారని గుర్తించారు. ఆది మానవుడు ఈ యుగంలోనే నిప్పుల్లో మాంసం, దుంపలు కాల్చుకొని తినడం ప్రారంభించాడు. బ్రిటిష్‌ శాస్త్రవేత్త ఎఫ్‌.ఆర్‌. ఆల్చిన్‌ ఉట్నూర్‌లో భారీ పేడకుప్పలు తగులబెట్టినప్పుడు ఏర్పడినట్టుండే పెద్దపెద్ద బూడిద రాశులను గుర్తించారు. ఇవి అంచెలంచెలుగా ఉన్నాయని నివేదికల్లో పేర్కొన్నారు.

ఎలా ఏర్పడతాయంటే..

కొత్త రాతియుగపు మానవులు పశువులను విస్తృతంగా ఉపయోగించుకునేవారు. పెరుగు, మజ్జిగ, వెన్న చేసుకునేవారు. వ్యవసాయంలోనూ ఉపయోగించేవారు. ధాన్యాన్ని ఎడ్లబండ్ల మీద, దున్నపోతులు కట్టిన బండ్ల మీద ఇండ్లకూ, దగ్గర్లోని వ్యాపార కేంద్రాలకూ తరలించేవారు. వాటిని ప్రయాణ సాధనాలుగానూ ఉపయోగించేవారు. ఈ పశువుల పెండను కుప్పలుగా పోసి, అవి ఎండిన తరువాత నిప్పంటించేవారు. ఆ నిప్పును వంటలు చేయడానికి, చలి కాచుకోవడానికి, ఇతర అవసరాలకు ఉపయోగించేవారు. ఇలా కాల్చిన, నాటి పశువుల పెండ దిబ్బలు బూడిదరాశులుగా మారి, నాటి మానవుని ఆర్థిక కార్యకలాపాలకు, సంస్కృతికి గుర్తులుగా మిగిలాయి.

భిన్నాభిప్రాయాలు

చారిత్రక విశ్లేషకుల ప్రకారం ఈ బూడిద కుప్పలు ఇనుపయుగం నాటి లోహాన్ని కరిగించేందుకు వాడిన బట్టీలు కావచ్చు అనీ, పారిశ్రామిక పనుల వల్ల ఏర్పడిన బూడిద అనీ, కుండలను కాల్చే వామివల్ల ఏర్పడినది అనీ.. రకరకాల అభిప్రాయాలు ఉన్నాయి. ఈ అవశేషాలపై రసాయన పరీక్షలు చేసిన డబ్ల్యూ.ఇ.స్మిత్‌ ఆవుపేడను కాల్చడం వల్ల ఏర్పడినవిగా నిర్ధారించారు. ఇదే అభిప్రాయాన్ని జూనర్‌ (1960), మజుందార్‌, రాజగురు (1967) బలపరిచారు. ప్రముఖ శాస్త్రవేత్త ఆల్చిన్‌ వీటిని కర్మకాండల కోసం కాల్చిన బూడిద కుప్పలుగా భావిస్తే, వేసవిలో వాటికవే తగులబడి పెద్ద మొత్తంలో బూడిద ఏర్పడిందని రాబర్ట్‌ బ్రూస్‌ ఫూట్‌ అభిప్రాయపడ్డారు.

గ్రామాల పేర్లనుబట్టి..

ఉమ్మడి నల్లగొండ, మహబూబ్‌నగర్‌, రాయచూరు, కర్నూలు, బళ్లారి, అనంతపురం, చిత్రదుర్గ్‌ జిల్లాల్లో కొత్త రాతి యుగం నాటి ప్రజల జీవన విధానంలో వైవిధ్యం కనిపిస్తుంది. వీరు పశువుల పెంపకం మీద ఎక్కువగా ఆధారపడినట్లు తెలుస్తున్నది. ఈ ప్రాంతాలలో బూడిద కుప్పలు అధికంగా ఉన్నాయి. కొన్నిచోట్ల ఈ బూడిద వానలకు, గాలికి విస్తరించడం వల్ల చుట్టూ ఉన్న పొలాలన్నీ బూడిదతో నిండి ఉంటాయి. గ్రామాల పేరును బట్టి కూడా ఆ సమీపంలో బూడిదకుప్పలు ఉన్నాయని తెలుసుకోవచ్చు. బూడిదపల్లి, బూడిదగడ్డపాడు వంటి పేర్లున్న గ్రామాలు అక్కడ బూడిదదిబ్బలున్న విషయాన్ని సూచిస్తాయి. ఇప్పటి వరకూ జరిగిన పరిశోధనలలో తెలంగాణ మహబూబ్‌నగర్‌ జిల్లాలోని మంచనపల్లి, ఉట్నూరు, తల్మరి ప్రాంతాలలో బూడిద కుప్పలను కనుగొన్నారు. నవీన శిలాయుగానికి చెందిన సంస్కృతి దక్షిణ భారతదేశంలో విస్తృతంగా ఉందనడానికి ఇప్పటికే అనేక ఆధారాలు  లభించాయి. పురావస్తు శాస్త్రవేత్తలు  జరిపిన తవ్వకాలలో ఈ ఆధారాలు మరింత కొట్టొచ్చినట్లు బయటపడ్డాయి.

- అరవింద్‌ ఆర్య, 7997 270 270

ఇటీవల జనగామ జిల్లా కేంద్రం సమీప గ్రామాలైన  వడ్లకొండ, చీటకోడూరు శివారులో మైసమ్మగుట్ట, పొట్టిగుట్ట, కోటగుట్టల్లో బూడిద కుప్పలను కనుగొన్నారు జనగామ కేంద్రంగా చరిత్ర పరిశోధన చేస్తున్న రెడ్డి రత్నాకర్‌ రెడ్డి. తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్‌, తమిళనాడు, కర్ణాటక ప్రాంతాలలోని గ్రానైట్‌ గుట్టల కిందిభాగంలోని చదును ప్రాంతాల దగ్గర కూడా బూడిద కుప్పలను ఎక్కువగా కనుగొన్నారు.

VIDEOS

logo