మంగళవారం 20 అక్టోబర్ 2020
Sunday - Feb 23, 2020 , 12:56:24

నాన్న ఉద్యోగం కోసం.. క్యాలిక్యులేటర్‌ రూపొందించాడు!

నాన్న ఉద్యోగం కోసం.. క్యాలిక్యులేటర్‌ రూపొందించాడు!

లెక్క కరెక్టుగా ఉంటే ఏ సమస్యా రాదు. అది ఏ లెక్కయినా కావచ్చు. డబ్బులు.. వ్యవహారం.. జీవితం.. అన్నీ లెక్క ప్రకారం ఉంటేనే బాగుంటాయి. లెక్క సక్కగా ఉండాలంటే లెక్కించే విధానం పక్కాగా ఉండాలి కదా? వెనకటి రోజుల్లో అయితే ఏదో నోటి లెక్కన గణించేవారు. కానీ ఇప్పుడు? లెక్క చిన్నదైనా.. పెద్దదైనా క్యాలిక్యులేటర్‌ కావాల్సిందే.

తారే జమీన్‌ పర్‌ 

క్యాలిక్యులేటర్‌ అవసరం చాలా పెరిగిపోయింది. డిజిటలైజేషన్‌ పెరుగుతున్న కొద్దీ దాని అవసరం కూడా పెరుగుతూ ఉంది. వెనకటి రోజుల్లో ఏదైనా అంత తేలిగ్గా పరిష్కారం దొరకని వాటిని గణన చేసేందుకే క్యాలిక్యులేటర్‌ వాడేవారు. కానీ ఇప్పుడు అత్యంత తేలికైన దానికి కూడా దాని అవసరం పెరిగిపోయింది. గ్రాడ్యుయేషన్‌ చదివినవాళ్లను కూడా రెండ్రెళ్ల ఎంత అని అడిగితే ఠక్కున క్యాలిక్యులేటర్‌ ఆన్‌ చేసి చెప్తున్నారే తప్ప.. నోటికి లెక్కించి ఎవరూ చెప్పడం లేదు. అంతలా క్యాలిక్యులేటర్‌ అనేది మానవ జీవితంతో ముడిపడిపోయింది. అలాంటి నిత్య అవసరమైన సాధనాన్ని వాడటమే కాదు. దానిని ఎవరు.. ఎందుకు.. ఎలా తయారుచేశారో తెలుసుకోవడమూ ముఖ్యమే. 


అది ప్యారిస్‌. 1639వ సంవత్సరం. 

ఎటియన్‌ పాస్కల్‌ లెక్కలపై మంచి పట్టున్న వ్యక్తి. తన నైపుణ్యంతో వాళ్లకూ వీళ్లకూ ఉచితంగా పనిచేసి పెడ్తొండే తప్పితే ఏనాడూ తన కోసం.. తన కుటుంబం కోసం.. ముఖ్యంగా డబ్బు సంపాదన కోసం వాడడు. ఆ ఆలోచన అస్సలు లేకుండె.చిన్నప్పటి నుంచీ గణితం అంటే ఇష్టం ఉండటం వల్ల పెద్దయ్యాక మంచి గణిత పండితుడు కాగలిగాడు ఎటియన్‌. చాలామంది అతడి తెలివిని మెచ్చుకుంటునేవారు. ‘నీకు మంచి రోజులు వస్తాయి. గణితంలో ఈ మాత్రం ట్రిక్స్‌ తెలిసిన వ్యక్తి ఎవరున్నారు చెప్పు?’ అని సన్నిహితులూ మెచ్చుకునేవాళ్లు. వాస్తవానికి తనకు ఆ ఆలోచన ఎప్పుడూ ఉండేది కాదు. కానీ.. వాళ్లంతా చెప్తున్నది తన కోసమే కదా? అని ప్రతిదానికీ తలూపేవాడు. అంతేకానీ అవుననిగానీ.. వద్దనిగానీ చెప్పేవాడు కాదు. 


సన్నిహితులు చెప్పినట్లుగానే ఎటియన్‌కు మంచి రోజులు వచ్చాయి. ఏకంగా ప్రభుత్వమే తన నైపుణ్యాన్ని గుర్తించి పన్నులు వసూలు చేసే అధికారిగా చేరమని పిలిచింది. 

కాస్త తటపటాయించినా ఎటియన్‌ ఈసారి వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నాడు. రూయెన్‌కు మకాం మార్చాడు. గడువులోపే బాధ్యతలు చేపట్టి విధులు నిర్వహించాడు. అందరితో శభాష్‌ అనిపించుకున్నాడు. పన్నులు వసూలు చేయడం అంటే మామూలు విషయం కాదు. అప్పట్లో టాక్స్‌ ఆఫీసర్లే స్వయంగా లెక్కలు చూసుకునేవారు. ప్రభుత్వం అసిస్టెంట్లను నియమించేది కాదు. ఏ లెక్క ఎంతయింది? ఖర్చెంత? ఆదాయమెంత? వంటి లెక్కలు చూసుకుంటూనే వాటిని బట్టి సలహాలు ఇవ్వడం అతని పని. చాలా బాధ్యత గల ఉద్యోగం. మొదట్లోనే మంచి పనితనం చూపించడంతో ఎటియన్‌కు మిగతావారి కంటే ఎక్కువ జీతమే ఇచ్చేవారు. కుటుంబం ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది.


ఎటియన్‌ పాస్కల్‌ బిజీ అయిపోయాడు. 

పని చాలా పెరిగింది. లెక్కలు తేల్చడం కోసం రాత్రింబవళ్లు కష్టపడేవాడు. ఒక్కోసారి నిద్రపోయేవాడు కూడా కాదు. ఇదే అతడికి సమస్యగా మారింది. రాత్రుళ్లు పనిచేయడం వల్ల చాలాసార్లు లెక్కల్లో తప్పులు జరిగాయి. ఎటియన్‌కు మంచి ప్రాధాన్యం కల్పించడం నచ్చనివాళ్లు ప్రభుత్వాన్ని మిస్‌గైడ్‌ చేశారు. కావాలనే తప్పుడు లెక్కలు చూపించి ఖజానాకు గండికొడుతున్నారని ఏవేవో చెప్పడంతో అధికారులు అతడిని విచారించారు. కానీ.. ఎటియన్‌ ఎలాంటి అవినీతికి పాల్పడలేదనీ.. పని ఒత్తిడి వల్లే లెక్కలు తారుమారు అయ్యాయని తేలింది. అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ప్రభుత్వం కోసం ఎంత నిజాయితీగా పనిచేస్తున్నాడో అధికారులు మరోసారి గుర్తించారు. 


‘ఒక్కడివే అలా పని మీదేసుకొని ఒత్తిడి ఎందుకు పెంచుకుంటావ్‌? ఎవరినైనా అసిస్టెంట్‌ను పెట్టుకోవచ్చు కదా? నీకు ఇష్టమైన వారినైనా పెట్టుకో. లేదా మన టీంలో ఉన్నవాళ్లనెవరినైనా అపాయింట్‌ చేయమంటే చేస్తాం’ అని సూచించారు. 


‘ప్లోరిన్‌ పెరియర్‌ అనే అబ్బాయి ఉంటాడు సార్‌. అతడు మా అల్లుడు. మా అమ్మాయిని ఇచ్చి పెండ్లి చేద్దాం అనుకుంటున్నాం. మంచి నైపుణ్యం గలవాడే. కానీ ఇప్పటికైతే ఎలాంటి ఉద్యోగం చేయడం లేదు. కొద్దిరోజులు ఎక్కడైనా ఫైనాన్షియల్‌ అసిస్టెంగ్‌గా చేసి తర్వాత బిజినెస్‌ చేద్దాం అనేది అతడి ఆలోచన. మీరు ఓకే అంటే అతడినే నా అసిస్టెంట్‌గా పెట్టుకుంటాను’ అనడంతో అధికారులు ఓకే చెప్పారు. అంకగణితంలో అతడి తెలివిని చూసి అనేక సందర్భాల్లో అధికారులే నివ్వెరపోయేవారు. 


కానీ.. మళ్లీ అవే తప్పులు. 

ఒకే లెక్కను ఒకరికి తెలియకుండా ఒకరు ప్లోరిన్‌ పెరియర్‌.. ఎటియన్‌ ఇద్దరూ చేయడం వల్ల లెక్క తేలకపోవడం మళ్లీ మొదలైంది. ఒక్కోసారి వాస్తవ ఆదాయం కన్నా ఎక్కువ పన్నులు ఉన్నట్లు లెక్కలు చూపిస్తే.. మరొకసారి తక్కువ లెక్కలు చూపించారు. అధికారుల దగ్గర మళ్లీ అవమాన పడాల్సి వచ్చింది. 

ఎక్కడ తప్పు దొరకుతుందా అని ఎదురుచూసేవాళ్లు ఎన్నోసార్లు మామా అల్లుళ్లను అవహేళన చేసేవారు. 


అది 1642. 

ఎటియన్‌ కుమారుడు తండ్రి పడుతున్న కష్టం ఏంటో రోజూ చూస్తున్నాడు. ఎందుకిలా తప్పులు దొర్లుతున్నాయని ఆలోచించేవాడు. వారసత్వంగా అతడికీ అంకగణితంపై మంచి పట్టు ఉంది. ఒకరోజు.. ‘నాన్నా.. మీరు గణితంలో అధికారులతో ప్రశంసలు అందుకున్న నైపుణ్యం గలవారు. మరి ఎందుకని మాటిమాటికీ తప్పులు జరుగుతున్నాయి?’ అని అడిగాడు. ‘నోటిమీద లెక్కలు ఇలాగే ఉంటాయి. ఇలా కాకుండా ఏదైనా గణనయంత్రం ఉందనుకో ఏ పొరపాట్లు జరగవు. ఎవరితోనూ మాటపడాల్సిన అవసరం ఉండదు’ అని సమాధానం ఇచ్చాడు. ఆ మాటలు ఆ అబ్బాయిని ఆలోచింపచేశాయి. ఏదైనా కనుక్కొని తన తండ్రి పడుతున్న కష్టాలకు పరిష్కారం చూపించాలని అనుకున్నాడు. అలా తండ్రి కోసం ఏదైనా సాధనం తయారుచేయాలని తపించిన అబ్బాయే బ్లేజ్‌ పాస్కల్‌. గణనయంత్రాన్ని కనిపెట్టిన శాస్త్రవేత్త. 


అప్పుడు పాస్కల్‌కు పద్దెనిమిదేండ్లు. ‘ఫైనాన్షియల్‌ అడ్వయిజర్‌'గా మారాడు. తండ్రికి అంకగణితంలో కొత్త కొత్త చిట్కాలు చెప్పేవాడు. అది చూసి తండ్రి ఆశ్చర్యపోయేవాడు.

ఒకసారి.. ‘చూడు పాస్కల్‌.. నేను ఏనాడూ ఏ లెక్కా చెప్పలేదు. కానీ నీకు ఇంత పరిజ్ఞానం ఎలా వచ్చింది?’ అని అడిగాడు. ‘చూడు నాన్నా.. నాకు మీరు ఏమీ చెప్పకపోయి ఉండొచ్చు. కానీ మీ పనిని చూస్తూ పెరిగాను. మీరు ఎలాంటి పొరపాట్లు చేస్తున్నారో గమనించేవాడిని. అవి రిపీట్‌ కాకుండా లెక్కలు ఎలా చేయాలో నేర్చుకున్నాను. అంతేకాదు. మీకు ఉద్యోగంలో గానీ.. మరెక్కడైనా గానీ ఎలాంటి సమస్య రాకుండా నేనొక గణనయంత్రాన్ని కనిపెడుతున్నాను. ఇది మీకు చాలా ఉపయోగపడుతుంది’ అని చెప్పాడు. పాస్కల్‌ ప్రతిభకు ఫిదా అయిన తండ్రి.. తనకు లెక్కల్లో ఎలాంటి చిన్న సందేహం వచ్చినా కొడుకును అడిగేవాడు. పాస్కల్‌ రోజూ ఉదయం మూడింటికే నిద్ర లేచేవాడు. అబాకస్‌ ఆధారంగా అంకెలను గణించే సాధనం తయారుచేసేందుకు రోజుకొక ప్రయోగం చేసేవాడు. పాస్కల్‌ దృష్టిలో అదొక పైలట్‌ ప్రాజెక్ట్‌. అది గనుక సక్సెస్‌ అయితే తన తండ్రి కష్టం తీరడమే కాకుండా ఒక కొత్త సాధనాన్ని ప్రపంచానికి పరిచయం చేసినవాళ్లమవుతాం అనే ఆలోచన. 


1642లో తాను అనుకున్న గణన యంత్రం రూపొందించాడు పాస్కల్‌. దానిపేరే పాస్కల్‌ క్యాలిక్యులేటర్‌. చక్రాల సహాయంతో ఈ గణన యంత్రం ద్వారా రెండు సంఖ్యలను జోడించవచ్చు. తీసేయొచ్చు. పునరావృతం చేసి విభజించి గణించవచ్చు. దీనిని క్లాక్‌వర్క్‌ రకం క్యాలిక్యులేటర్‌గా పిలిచేవారు. ఈ యంత్రం ద్వారా గణనలు నిర్వహించడం బాగానే ఉన్నప్పటికీ అన్ని సాధ్యం కాకపోవచ్చని కొందరు శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేశారు. 1643లో మళ్లీ కొత్తగా ఇంకో క్యాలిక్యులేటర్‌ కనిపెట్టాడు. అది కూడా క్లాక్‌వర్క్‌దే. గతంలో పాస్కల్‌ క్యాలిక్యులేటర్‌ ద్వారా సరైన అంకగణిత గణనలు చేయలేమని అనుమానం వ్యక్తంచేసినవారే దీనిని చూసి ప్రశంసించారు. 


మళ్లీ సమస్య వచ్చింది. 

క్యాలిక్యులేటర్‌ ఓకే కానీ.. వాటిని ఎక్కువ సంఖ్యలో తయారుచేయడం సాధ్యం కాలేదు. సొంతంగా తయారుచేసేంత ఆర్థిక స్థోమత లేదు. ఎన్నో అవాంతరాలు ఎదురైనా.. వాటన్నింటినీ ఛేదించుకొని క్యాలిక్యులేటర్‌ను బయటకు తీసుకురాగలిగాడు. పాస్కల్‌ తన తండ్రి కోసం రూపొందించిన క్యాలిక్యులేటరే అనేక రూపాంతరాలు చెంది ఇప్పుడు డిజిటల్‌ క్యాలిక్యులేటర్‌గా మనకు ఎన్నో సేవలు అందిస్తుంది. పాస్కల్‌ క్యాలిక్యులేటర్లు రోజువారి జీవితాల్లో సాధారణ గణనలు చేసే సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా గణితాన్ని ఇంతకుముందు కంటే ఎక్కువ స్థాయిలో అర్థం చేసుకోగల సామర్థ్యాన్ని అందించాయి. ఇప్పటికీ అందిస్తున్నాయి కూడా.నోటిమీద గజిబిజీగా.. ఎక్కువ సమయం తీసుకునే లెక్కలు ఇప్పుడు సెకన్లలో గణించబడుతున్నాయి. ఇవి విద్యార్థుల అభ్యాసం నాణ్యతను పెంచుతున్నాయి కూడా.అందుకే పాస్కల్‌ ఇప్పుడు మన మధ్యన లేకపోయి ఉండొచ్చు. కానీ ఆయన రూపొందించిన క్యాలిక్యులేటర్‌ మనతోనే రోజూ ఉంటూ లెక్క.. పద్దులు కరెక్టుగా చేసేలా ఉపయోగపడుతున్నది.  


1642లో తాను అనుకున్న గణన యంత్రం రూపొందించాడు పాస్కల్‌. దానిపేరే పాస్కల్‌ క్యాలిక్యులేటర్‌. చక్రాల సహాయంతో ఈ గణన యంత్రం ద్వారా రెండు సంఖ్యలను జోడించవచ్చు. తీసేయొచ్చు. పునరావృతం చేసి విభజించి గణించవచ్చు.  దీనిని క్లాక్‌వర్క్‌ రకం క్యాలిక్యులేటర్‌గా  పిలిచేవారు. ఈ యంత్రం ద్వారా గణనలు నిర్వహించడం బాగానే ఉన్నప్పటికీ అన్నీ సాధ్యం కాకపోవచ్చని కొందరు శాస్త్రవేత్తలు అనుమానం వ్యక్తం చేశారు. 

దాయి శ్రీశైలం, సెల్‌: 8096677035
logo