‘30 రోజుల్లో ప్రేమించడం ఎలా?’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల మనసు దోచేసింది చెన్నై చిన్నది అమృతా అయ్యర్. ‘హను-మాన్’తో పాన్ ఇండియా హిట్ ఖాతాలో వేసుకున్న ఈ భామ దక్షిణాదిన వరుస అవకాశాలతో దూసుకుపోతున్నది. ఆకట్టుకునే అందం, అభినయంతో అచ్చతెలుగు అమ్మాయి అనిపించుకుంది. ఇటీవల ‘బచ్చలమల్లి’ సినిమాతో మరోసారి ప్రేక్షకులను మెప్పించింది. యువరాణి తరహా పాత్రల్లో నటించడమే తన డ్రీమ్ అంటున్న అమృతా అయ్యర్ పంచుకున్న కబుర్లు..
ప్రతి సినిమా పాన్ ఇండియా స్థాయికి వెళ్లదు. ‘హను-మాన్’ కూడా అంతే. విడుదలయ్యాక ఆ చిత్రం పాన్ ఇండియా రేంజ్ సాధించింది. ‘హను-మాన్’ తర్వాత కథల ఎంపికలో మరిన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నా. పాత్ర నిడివి కన్నా.. దాని ప్రాధాన్యం మీదే ఎక్కువ ఫోకస్ చేస్తున్నా.
ప్రస్తుతం కన్నడ, తమిళంలో సినిమాలు చేస్తున్నా. తెలుగులో మంచి స్క్రిప్ట్‌లు కొన్ని వచ్చాయి. తొలినాళ్లలో తెలుగు మాట్లాడేందుకు కొంత ఇబ్బందిపడ్డాను. ఇప్పుడు ధారాళంగా మాట్లాడేస్తున్నా. డబ్బింగ్ నేనే చెబుతానంటే ‘నువ్వు తెలుగులో డైలాగులు చెప్తే.. మరీ చిన్న పిల్లలు మాట్లాడినట్టుగా ఉంటాయి’ అని దర్శకులు వద్దంటున్నారు. దర్శకులు అవకాశం ఇస్తే తప్పకుండా నా గొంతు వినిపిస్తా.
వచ్చే ఏడాదికల్లా కచ్చితంగా పెళ్లి చేసుకుంటాను. ఇండస్ట్రీకి చెందిన అబ్బాయిని మాత్రం అస్సలు చేసుకోను. ఇద్దరిదీ ఒకే ఫీల్డ్ అయితే సమస్యలు వస్తాయని నా ఫీలింగ్. వేర్వేరు వృత్తుల్లో ఉన్నట్లయితే.. అన్ని విషయాలు ఒకరితో ఒకరు షేర్ చేసుకోవచ్చు.
‘హను-మాన్’ నా కెరీర్లో ప్రత్యేకమైన సినిమా. వరలక్ష్మీ శరత్‌కుమార్‌తో కలిసి పనిచేయడం భలేగా అనిపించింది. ఆమె దగ్గర నటనలో చాలా మెలకువలు నేర్చుకున్నాను. నేను సెట్లో ఉన్నప్పుడు అందరినీ పరిశీలిస్తుంటా. ప్రతి ఒక్కరిలో మనం నేర్చుకునే ఏదో ఒక విషయం ఉంటుంది. దాన్ని గుర్తించడమే కాదు, అడాప్ట్ చేసుకోవడం కూడా చాలా ముఖ్యం. ‘హను-మాన్’ జర్నీలో సహనంగా ఉండటం నేర్చుకున్నాను.
రాజమండ్రి, అన్నవరం ప్రాంతాలు బాగా నచ్చుతాయి. నేను చేసిన ప్రతి తెలుగు సినిమా ఆ ప్రాంతాల్లో షూటింగ్ జరుపుకొన్నదే! నా సినిమాల్లోని పాటలకు మంచి ఆదరణ లభించడం అదృష్టంగా భావిస్తున్నా. ‘నీలి నీలి ఆకాశం..’, హను-మాన్ సినిమాలో ‘పూలమ్మే పిల్ల..’ పాట వరకు మంచి గీతాలు నాకు కుదిరాయి.
నేను తెలుగులో సినిమా చేస్తున్నానంటే కచ్చితంగా రాజమండ్రి, అన్నవరం పరిసర ప్రాంతాల్లో ఒక్కరోజైనా చిత్రీకరణ ఉండాల్సిందే. నా సినిమాల్లో పాటలు కూడా విశేష ఆదరణ పొందుతుంటాయి. ‘నీలి నీలి ఆకాశం…’ నుంచీ ‘హను-మాన్’లో ‘పూలమ్మే పిల్ల…’ పాట వరకూ అదే వరస. నేను తమిళంలో చేసిన సినిమాల్లోని పాటలూ బహుళ జనాదరణ పొందడం నా అదృష్టం.
నటనకు ఆస్కారం ఉండే పాత్రలు చేయాలని ఉంది. మొదట్నుంచీ పల్లెటూరి అమ్మాయి పాత్రలే నా దగ్గరికొచ్చాయి. ‘బచ్చలమల్లి’ కాస్త భిన్నంగా సినిమాలో సిటీ జీవితం అంటే ఇష్టపడే అమ్మాయిలా కనిపించా. ఇప్పటివరకు నేను చేసిన సినిమాల పట్ల సంతోషంగా ఉంది. మరిన్ని వైవిధ్యభరితమైన పాత్రలు పోషించాలని ఉంది. ముఖ్యంగా యువరాణి తరహా పాత్రలు చేయాలని ఉంది. ‘పొన్నియిన్ సెల్వన్’ చూశాక ఆ కోరిక మరింత బలపడింది. యాక్షన్ ప్రధానమైన పాత్రలు కూడా ఇష్టమే!