ఓ సగటు యువకుడు. డిగ్రీ తర్వాత ఇంకాస్త పెద్ద చదువులు చదివాడు. ఆరంకెల జీతంతో మంచి జాబ్ కొట్టాడు. ఉన్నతోద్యోగంలో ఎప్పటికప్పుడు తనను తాను నిరూపించుకొంటూనే ఉన్నాడు. ఇందుకోసం.. వారం వారం టార్గెట్లు, నెలనెలా లక్ష్యాలను సాధిస్తూ ‘ఒత్తిడి’లో కూరుకుపోయాడు. ఈ ఉరుకులు పరుగుల మధ్య.. కాలం ఎప్పుడు జారిపోయిందో కూడా తెలియలేదు. మధ్యమధ్యలో ‘పెళ్లెప్పుడు?’ అన్న ఆత్మీయుల ప్రశ్ననూ పట్టించుకోలేదు. మూడేండ్లకే ప్రమోషన్‌తోపాటు ‘రక్తపోటు’ పలుకరిచింది. కదలని మెదలని జీవనశైలితో ‘ఊబకాయమూ’ వరించింది. ఇక పెళ్లి వాయిదా వేయలేని వయసు వచ్చేసింది. మంచి సంబంధం కుదరడంతో.. పెళ్లితంతు ముగిసింది. సంసారంలో మధురిమలు తెలిసేలోగా.. ఓ చేదు వార్త తెలిసింది. ముప్పై ఏండ్లకే.. ‘మధుమేహం’ బయటపడింది.
చి న్నపాటి మార్పులతో అందరి కథలూ ఇలాగే ఉంటున్నాయి. అనూహ్యమైన ఈ సమస్యను అంగీకరించలేక, అలా అని కలిసి జీవించే నిబ్బరంలేక ఎన్నో జీవితాలు తల్లడిల్లుతున్నాయి. మధుమేహంతో కలిసి కాపురం చేయడం గురించి ఇప్పటికైనా మాట్లాడుకోకపోతే నేరమే అవుతుంది. అందుకే.. యుక్త వయసులో పలకరిస్తున్న డయాబెటిస్ గురించీ, సంసారాల మీద అది చూపిస్తున్న ప్రభావం గురించీ స్థూలంగా చర్చించుకొనే ప్రయత్నమిది!సహజంగానే భారతీయులకు మధుమేహం వచ్చే ఆస్కారం ఎక్కువ. ఇందుకు మన జన్యువులే ముఖ్యకారణమనేది పరిశోధకుల విశ్లేషణ. మనలో చాలామంది తీవ్రమైన ఆరోగ్య సమస్య వస్తే కానీ, వైద్య పరీక్షలు చేయించుకోరన్నది వాస్తవం. ‘ప్రపంచంలోని ప్రతి ఆరుగురు మధుమేహ వ్యాధిగ్రస్తుల్లో ఒకరు భారతీయులే. త్వరలోనే మన దేశం డయాబెటిస్‌లో మొదటి స్థానాన్ని చేరుకుంటుంది’ అనే అంచనా విన్నప్పుడు.. సమస్య తీవ్రత అర్థమవుతుంది. అంతకంటే మరో ముఖ్యమైన విషయం.. అప్పటివరకూ ర్యాంకులతో కుస్తీ పడి, కెరీర్లో పరుగులు పెట్టి ఇక జీవితాన్ని ఆస్వాదిద్దాం అనుకొనే సమయంలో ‘మధుమేహం’ రావడం!
స్థూలంగా ఇదీ ‘మధుమేహం’!
మనం తినే ఆహారం నుంచి గ్లూకోజ్ (చక్కెర) తయారవుతుంది. ఇది శరీరంలో కణాలు పనిచేయడానికి ఇంధనంలా ఉపయోగపడుతుంది. మరీ ముఖ్యంగా నరాలు, మెదడులాంటి వ్యవస్థల పనితీరుపై ఎక్కువ ప్రభావం చూపుతుంది. ఈ గ్లూకోజ్‌ను కణాలకు అందించే బాధ్యత ‘ఇన్సులిన్’ అనే హార్మోనుదే. కణాల్లోకి గ్లూకోజ్‌ను అనుమతించే తాళం చెవిలా ఇది పనిచేస్తుంది. ఇన్సులిన్ సరఫరాలో లోపాలు ఏర్పడితే.. కణాలకు అందాల్సిన గ్లూకోజ్, ఎక్కడికక్కడ రక్తంలోనే పేరుకుపోతుంది. రక్తంలో పేరుకొనే చక్కెర.. మరిన్ని సమస్యలకు దారితీస్తుంది.ఇన్సులిన్‌ను ఉత్పత్తి చేసే బాధ్యత క్లోమగ్రంథి (పాంక్రియాస్) తీసుకొంటుంది. పాంక్రియాస్లో ఇన్సులిన్ ఉత్పత్తి సరిగా లేకపోవడం డయాబెటిస్‌కు ముఖ్యకారణం. టైప్-1 మధుమేహంలో ఈ సమస్య ఎక్కువగా కనిపిస్తుంది. జన్యుపరమైన కారణాలు లేదా వైరస్ల వల్ల ఈ సమస్య ఏర్పడుతుంది. అందుకే, చాలామందికి ఇది చిన్నవయసులోనే బయటపడుతూ ఉంటుంది. ఇక ఊబకాయం, రక్తపోటు లాంటి సమస్యల వల్ల కణాలు ఇన్సులిన్‌ను స్వీకరించే సత్తా కోల్పోతాయి. దీన్నే ‘ఇన్సులిన్ రెసిస్టెన్స్’ అంటారు. ఇది టైప్-2 డయాబెటిస్‌కు దారితీస్తుంది.ఇతర కారణాల వల్ల కూడా మధుమేహం వచ్చే అవకాశాలుంటాయి. ఉదాహరణకు..‘గెస్టేషనల్ డయాబెటిస్’. గర్భిణిగా ఉన్నప్పుడు హార్మోన్లలో మార్పు, శరీర బరువు పెరిగిపోవడం వల్ల వచ్చే మధుమేహమిది. శరీరం సాధారణ స్థితికి రాగానే.. సమస్య కూడా తీరిపోతుంది. అలాగే, జన్యుపరమైన మార్పుల వల్ల ‘మోనోజనిక్’ అనే మధుమేహం వస్తుంది. చాలా సందర్భాల్లో దీన్ని టైప్-1, 2 మధుమేహాలుగా పొరబడుతుంటారు.
ఆదిలోనే అలసత్వం
మన జీవనశైలి పూర్తిగా మారిపోయింది. ఒళ్లు వంచే పని ఒక్కటీ లేదు. ఏది చేసినా.. కండ్లు, మెడ, చేతులు మాత్రమే కదిలే పరిస్థితి. ఆ నష్టాన్ని నివారించే వ్యాయామం చేయడం లేదు, తగ్గిన శ్రమకు అనువైన ఆహారం తీసుకోవడం లేదు. పైగా పోషక విలువలు లేని ‘జంక్ ఫుడ్స్’ పెరిగిపోయాయి. ఇవన్నీ కలిసి మనిషిని ఊబకాయంలోకి నెట్టేస్తున్నాయి. దీంతో శరీరంలో ఫ్యాటీయాసిడ్స్ పెరిగిపోయి ఇన్సులిన్‌ను స్వీకరించే సామర్థ్యం తగ్గిపోతున్నది. ముఖ్యంగా పొత్తికడుపు దగ్గర పేరుకొనే కొవ్వు.. ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తున్నది. దానికితోడు కెరీర్లో నిలదొక్కుకోవాలనే ఒత్తిడి.. రక్తపోటుకు దారి తీస్తున్నది. ఫలితంగా యుక్తవయసులోనే ‘డయాబెటిస్’ పలుకరిస్తున్నది. మన అలసత్వంతో ఆ పరిస్థితి.. ఓ అనూహ్యమైన సమస్యగా మారిపోతున్నది.
చాలా సందర్భాల్లో మధుమేహం.. ‘నేను అడుగుపెట్టాను’ అంటూ గుర్తుచేసే ప్రయత్నం చేస్తుంది. ఒక్కసారిగా బరువు తగ్గిపోవడం, అతిమూత్రం, విపరీతమైన దాహం, నిస్సత్తువ లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కానీ, వాటిని యువత నిర్లక్ష్యం చేస్తుంటుంది. రోజువారీ ఒత్తిళ్ల వల్ల ఏర్పడుతున్న సమస్యలుగానే భావిస్తుంది. ఇక మద్యం, ధూమపానం మరో సమస్య. ఈ అలవాట్లున్నవారు.. డయాబెటిస్ లక్షణాలను చెడు వ్యసనాలతో ఏర్పడిన సమస్యలుగా పొరబడుతుంటారు. ‘డయాబెటిస్’ అన్న అనుమానం వచ్చినా.. వెంటనే పరీక్ష చేయించుకోకపోవడం మరో సమస్య. రెండు మూడేండ్లకోసారి ‘హెల్త్ చెకప్’ చేసుకుంటాం కదా!, అప్పుడు బయటపడితే చూసుకోవచ్చు.. అనే అశ్రద్ధ కనిపిస్తుంది. దాంతో నిమిషంలో తేలిపోయే అనుమానాన్ని నెలల తరబడి వాయిదా వేస్తుంటారు. నిజానికి అలాంటి లక్షణాలు పొడచూపినా, ఊబకాయం లాంటి సమస్యలున్నా, కుటుంబంలో ఎవరికైనా మధుమేహం ఉన్నా.. వెంటనే పరీక్ష చేయించుకోవాలి. ‘కొవిడ్’ విషయంలో ఎలాగైతే తొందరపడి పరీక్ష చేయించుకొంటున్నామో.. అంతే చురుగ్గా ‘రక్తంలో చక్కెర నిల్వలు’ సరిచూసుకోవాలి.
బయటపడ్డా బద్ధకమే!
చాలామంది యువత ‘నాకు డయాబెటిస్ లేదు.. రాదు!’ అని తీర్మానించేసుకొంటారు. ‘మధుమేహం’ అన్న పదాన్నే నామోషీగా భావిస్తారు. పరీక్ష చేసుకుంటే ఎక్కడ బయట పడిపోతుందేమోనన్న భయంతో ఉంటారు. ఆ అశ్రద్ధ వల్ల షుగర్ నిల్వలు పెరిగి, చికిత్స తప్పనిసరి అనే పరిస్థితికి వస్తారు. అప్పటికీ.. సరైన వైద్యం చేయించుకోవడానికి బద్ధకిస్తారు. ‘చిన్న వయసే కదా.. ఇప్పుడే బయటపడింది కదా!’ అనే ఆలోచనలతో ప్రత్యామ్నాయ చికిత్సల వైపు చూస్తారు. అయితే, మధుమేహం మాయమైపోతుందనే ఆశతో, దానిమీద నియంత్రణ కోల్పోవద్దని వైద్యులు సూచిస్తున్నారు. ఇతర విధానాలతో డయాబెటిస్ తగ్గకపోతే, అశ్రద్ధ చేయకుండా అవసరమైన మందులను వాడాలని చెబుతున్నారు. చాలా సందర్భాల్లో ఎప్పటికప్పుడు మధుమేహ పరీక్షలు చేయించుకొంటూ ఉంటే.. ‘ప్రీ-డయాబెటిక్’ దశలోనే దాన్ని అదుపు చేసుకోవచ్చు. ‘ప్రీ-డయాబెటిక్’ అంటే.. ‘మధుమేహం వచ్చే అవకాశాలు ఉన్నాయి. కానీ, ఇప్పుడే నిర్ధారించలేం’ అని అర్థం. పరిస్థితి ఇంకా అదుపులోనే ఉన్నట్టు లెక్క! కొన్నిసార్లు ఉదయంపూట షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ, ఆహారం తీసుకోగానే అవి సాధారణ స్థితికి వచ్చేస్తాయి (impaired fasting glucose). మరికొన్ని సందర్భాల్లో రక్తంలో చక్కెర ఎక్కువగా ఉంటుంది. కానీ, అసాధారణ స్థాయిలో ఉండదు (imparied glucose tolerance). ఈ రెండు పరిస్థితులనూ ‘ప్రీ-డయాబెటిక్’గా గుర్తిస్తారు. సరైన ఆహార నియమాలు, వ్యాయామంతో వీలైనన్ని ఏండ్లపాటు ఈ ప్రీ-డయాబెటిక్ దశలోనే ఉండవచ్చు.
సమాన బాధ్యత
‘డయాబెటిస్’ పట్ల అలసత్వం పనికిరాదు. భార్యాభర్తల్లో ఎవరికి ఉన్నా.. దాన్ని నియంత్రించేందుకు ఇద్దరూ చర్యలు తీసుకోవాలి. ఇద్దరూ కలిసి నడకలాంటి వ్యాయామం చేయాలి. తీసుకోవాల్సిన మందులు, చేయించుకోవాల్సిన పరీక్షల గురించి భాగస్వామిని
అప్రమత్తం చేస్తుండాలి. చాలా సందర్భాల్లో డయాబెటిస్ పేషెంట్ కంటే, తన భాగస్వామే ఎక్కువగా డిప్రెషన్లోకి జారిపోతున్నారు. తన ఆరోగ్యం ఎలా ఉంటుందో, ఏదైనా జరిగితే భవిష్యత్తు ఏమైపోతుందో, తమ సంసారాన్ని సమాజం చిన్నచూపు చూస్తుందేమో.. లాంటి అనుమానాలతో కుంగిపోతున్నారు. జాగ్రత్తగా ఉంటే, డయాబెటిస్‌ను మించిన సులభమైన సమస్య మరొకటి ఉండదన్నది వైద్యుల మాట. ఆ మాటకొస్తే.. అసలు అది సమస్యే కాదు, ఓ మార్పు మాత్రమేనని మరికొందరు నిపుణుల భరోసా. షుగర్‌ను అదుపు చేసేందుకూ ఎప్పటికప్పుడు కొత్త తరహా మందులు వస్తున్నాయి. కణాలలో ఇన్సులిన్ పట్ల వ్యతిరేకత (రెసిస్టెన్స్) తగ్గించడానికి, ఇన్సులిన్ ఉత్పత్తిని పెంచడానికి, తిన్న ఆహారం వెంటనే గ్లూకోజ్‌గా మారకుండా చేసేందుకు, అధిక చక్కెరను మూత్రం ద్వారా బయటకు పంపేందుకు, పేగుల పనితీరును మెరుగుపరిచేందుకు.. ఇలా డయాబెటిస్‌ను ఎదుర్కొనేందుకు సవాలక్ష ఆయుధాలు వచ్చేశాయి. ఇవేవీ కుదరకపోయినా, నేరుగా ఇన్సులిన్ అందిస్తూ షుగర్‌ను నియంత్రించవచ్చు.
బాధితుల వయసు, నేపథ్యం, జీవనశైలి, ఇన్ఫెక్షన్లు, ఆరోగ్యం, చక్కెర స్థాయి లాంటి అంశాల ఆధారంగా ఎవరికి ఎలాంటి మందులు ఇవ్వాలో తేలికగా నిర్ణయిస్తారు వైద్యులు. కాబట్టి, మధుమేహం ఉన్న విషయాన్ని ఒప్పేసుకొని, ఆ చేదుచేదు వ్యాధితో కలిసి జీవించేందుకు ప్రయత్నిస్తే సంసారం తీయగానే సాగుతుంది. ఒకవేళ దంపతులిద్దరికీ డయాబెటిస్ ఉన్నా ఫర్వాలేదు. ఒకరినొకరు గమనించుకుంటూ, కలిసి ఆరోగ్య లక్ష్యాలను ఏర్పరుచుకుంటూ ముందుకు సాగవచ్చు…ఇవీ స్థూలంగా యువత, మరీ ముఖ్యంగా పెండ్లి చేసుకున్నవారు డయాబెటిస్ విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు. చాదస్తం అనిపించినా మరోసారి చెప్పుకోక తప్పదు. 30 ఏండ్లు దాటినప్పటి నుంచి ఆరోగ్యం విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి. అధిక బరువు, థైరాయిడ్ వంటి సమస్యలను నియంత్రించుకోవాలి. డయాబెటిస్ లక్షణాల్లో ఏ ఒక్కటి కనిపిస్తున్నా.. చిన్నపాటి పరీక్షతో నిర్ధారించుకోవాలి. కుటుంబ సభ్యులకు ఆ విషయాన్ని తెలియజేయాలి. అయినవాళ్లూ అండగా నిలబడాలి. అప్పుడిక డయాబెటిస్ ఓ చిరు లక్షణంగానే మిగిలిపోతుంది. ఎవరు ఏమనుకుంటారోననే నామోషీతో మధుమేహాన్ని అశ్రద్ధ చేస్తే ‘క్లోమగ్రంథి’ మీద ఒత్తిడి పెరిగిపోతుంది. నరాలు, కాలేయం వంటి అవయవాలు దెబ్బతింటాయి. ఇక, ఏ మార్గాన్ని ఎంచుకోవాలి? అన్న నిర్ణయం మనదే!
కంగారు వద్దు!
రోజురోజుకూ చికిత్సా విధానాలు సులువుగా, సమర్థంగా మారుతున్నాయి. ఒకవేళ డయాబెటిస్ దశకు చేరుకొన్నా.. సరైన మందులు వాడుతూ, అణువంతైనా రాజీ అవసరం లేని జీవితాన్ని గడపవచ్చు. కాబట్టి, పెళ్లికి ముందు మధుమేహం బయటపడుతుందేమోనన్న అశ్రద్ధ వద్దు. ఒకవేళ బయటపడ్డా, దాన్ని దాచాల్సిన అగత్యమూ లేదు. అలాగే, డయాబెటిస్ ఉన్నవారిని వివాహం చేసుకొనేందుకు, వారితో కలిసి జీవించేందుకూ భయపడక్కర్లేదు. కాకపోతే వివాహానికి ముందు వైద్యుడి దగ్గర కౌన్సిలింగ్ తీసుకొంటే మంచిది. మధుమేహంతో మెలగడం ఎలాగో తెలిసిపోతుంది.
సాధారణంగా డయాబెటిస్ ఉన్నవారి వైవాహిక జీవితంలో వచ్చే సమస్యలివి. రక్తంలో చక్కెర నిల్వలు అదుపులో ఉంటే.. చిన్నాచితకా ఇబ్బందులు కూడా ఆమడదూరంలోనే ఉండిపోతాయి. ఏ సమస్యా ఉండదు.
శృంగార జీవితం : చక్కెర నిల్వలు ఎక్కువైనప్పుడు నరాలకు రక్తప్రసరణ తగ్గిపోతుంది. ఫలితంగా అంగస్తంభన లేకపోవడం, శీఘ్రస్కలనం లాంటి సమస్యలు వస్తాయి. ఒకటిరెండుసార్లు ఇలా జరిగితే తనమీద తనకు నమ్మకం పోయి, మున్ముందు కూడా ఇబ్బంది పడతారు. మహిళల్లో కూడా అధిక చక్కెర వల్ల చర్మం పొడిబారిపోయి, కలయిక బాధగా మారవచ్చు.
సంతానం : మగవారిలో వీర్యకణాల సంఖ్య తక్కువ కావడం, ఉన్నవి కూడా బలహీనపడటం వల్ల సంతానం కష్టమవుతుంది. ఇక మహిళల్లో అధిక చక్కెర, దాంతోపాటు వచ్చే ఇన్ఫెక్షన్ల వల్ల ఫాలోపియన్ ట్యూబుల్లో అడ్డంకులు ఏర్పడటం, రుతుక్రమం సరిగా లేకపోవడం లాంటి సమస్యలు వస్తాయి. ఒకవేళ గర్భం దాల్చినా అది నిలవలేని ప్రమాదం ఉంటుంది.
భావోద్వేగాలు : రక్తంలో చక్కెర నిల్వలు మరీ ఎక్కువైనా, మరీ తక్కువైనా అవి రక్తప్రసరణ మీదా.. అది మెదడుకు, గుండెకు అందించే శక్తి మీదా ప్రభావం చూపుతుంది. ఫలితంగా చిరాకుపరాకులు వస్తాయి. రోజువారీ జీవితంలో వచ్చే ప్రతి చిరాకుకూ షుగర్‌తో ముడిపెట్టడం భావ్యం కాదు కానీ, మన స్పందన అసహజంగా తోస్తే మాత్రం చక్కెర అదుపులో ఉందో లేదో గమనించుకోవాల్సిందే!
కొవిడ్‌తో డయాబెటిస్?
మధుమేహం ముంచుకొస్తోందని కంగారుపడుతున్నాం. ఈ సమస్యకు కొవిడ్ కూడా తోడవటం దురదృష్టకరం. కరోనా నుంచి కోలుకొంటున్న చాలామందిలో మధుమేహ లక్షణాలు బయటపడుతున్నాయి. అసలు, ఎందుకిలా జరుగుతున్నదో అర్థం చేసుకోగలిగితే.. కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు!
‘డయాబెటిస్’ పట్లఅలసత్వం పనికిరాదు. భార్యాభర్తల్లో ఎవరికి ఉన్నా.. దాన్ని నియంత్రించేందుకు ఇద్దరూ చర్యలు తీసుకోవాలి. ఇద్దరూ కలిసి నడకలాంటి వ్యాయామం చేయాలి.తీసుకోవాల్సిన మందులు, చేయించుకోవాల్సిన పరీక్షల గురించి భాగస్వామిని అప్రమత్తం చేస్తూ ఉండాలి.
ఇవీ అసలైన విలువలు..
షుగర్ లెవెల్స్‌కు సంబంధించి చాలా అనుమానాలే ఉన్నాయి. చేసే పరీక్షను బట్టి, దేశాన్ని బట్టి ఇవి అటూ ఇటుగా ఉంటాయి. కానీ, మన దగ్గర చాలా మంది వైద్యులు ఈ కింది విలువలను సూచిస్తున్నారు. ఇంట్లో గ్లూకోమీటర్ ఉన్నవారు కూడా వీటిని అనుసరించవచ్చు.అయితే, వీటికి కొన్ని మినహాయింపులు ఉన్నాయి. వయసు మీద పడినవారిలో, షుగర్ లెవెల్స్ తగ్గితే (హైపోైగ్లెసీమియా) తట్టుకొనే శక్తి తక్కువగా ఉంటుంది. కాబట్టి, వాటిని మరీ నియంత్రించకుండా గమనిస్తారు వైద్యులు. గర్భిణుల పరిస్థితి ఇందుకు వ్యతిరేకం. వారిలో చక్కెర స్థాయి ఏమాత్రం పెరిగినా.. బిడ్డ ఆరోగ్యం మీద ప్రభావం చూపే ప్రమాదం ఉంది. అందుకని, ఎప్పటికప్పుడు అదుపు చేసే ప్రయత్నం జరగాలి.
పరగడుపున
మధుమేహం లేకపోతే – 110 mg వరకు
డయాబెటిక్ – 126 mg లేదా అంతకంటే ఎక్కువ
ప్రీ డయాబెటిక్ – 111 mg నుంచి 125 mg వరకు
ఆహారం తిన్న తర్వాత
మధుమేహం లేకపోతే – 140 mg వరకు
డయాబెటిక్ – 200 mg లేదా అంతకంటే ఎక్కువ
ప్రీ డయాబెటిక్ – 141 mg నుంచి 199 mg వరకు