కేసీఆర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటి సంగతి. నియోజకవర్గంలో ప్రయాణిస్తున్నప్పుడు, ఒక చోట ఓ మహిళ విచారంగా కనిపించింది. ‘ఏమవ్వా ఏమైంది’ అని కేసీఆర్ దగ్గరికి పోయి అడిగారు. ‘పంట కోత కొచ్చింది. మొగులు చూస్తే ఎప్పుడు వాన బడతదో అని బుగులయితన్నది, కూలీలేమొ దొరుకుతలేరాయె’ అని ఆమె బాధగా చెప్పింది. కేసీఆర్ వెంటనే సమస్యను అర్థం చేసుకున్నారు. ఇది ఒక్క నీ సమస్య కాదు, ఊరందరి సమస్య అన్నారు. ఊరిలోని రైతులందరిని సమావేశ పరిచారు. అందరూ కలిసి కట్టుగా అందరి పంట కోసి ఇంటికి చేర్చాలని ఒప్పించారు. ఒకవైపు కోతలు మరోవైపు కట్టలు కట్టడం, ఎవరింటికి వారివి జారగొట్టడం వేగంగా సాగిపోయాయి. మూడు రోజుల్లో చివరి పంట కూడా ఇంటికి చేరింది. వెంటనే భళ్ళున వాన మొదలైంది! ఊరు ఊరంతా ఆనందం! కేసీఆర్ కొత్తగా ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన మొదటగా చేసింది దళితుల సమస్యపై అధ్యయనం. కొద్ది రోజుల పాటు రోజూ దళిత వాడలకు వెళ్ళి పొద్దంతా వారి జీవన విధానాన్ని, పరిస్థితులను, ఆలోచనలను పరిశీలించేవారు. ఒక ఇంటిలో శుభకార్యం జరుగుతున్నది. కానీ వారికి చేతిలో డబ్బు లేదు. కేసీఆర్ మిగతా దళితులందరికీ తలా సోలెడు బియ్యం, పొయిల కట్టెలు ఇవ్వమన్నారు. అందరూ సహాయం చేయడంతో పబ్బం గడిచింది! గొడవలు పడవద్దని, కలిసి మెలిసి ఉండాలని కేసీఆర్ ప్రజలకు తరచూ బోధిస్తుంటారు.
ఈ దేశంలో బాగా వెనుకబడి ఉన్నది దళితులు. వారలా ఉండడానికి కారణం.. మనమూ, మన సమాజం చేసిన పొరపాటు దాన్ని మనం దిద్దుకోవాల్సిందే.. రాష్ట్రంలో ఎన్ని దళిత కుటుంబాలు ఉన్నయో అన్నిటికీ దళితబంధు వర్తింపజేస్తాం. ఆ వ్యక్తి ఏ పార్టీలో ఉన్నా సరే. ఆయన ఇష్టం.. ఏ పార్టీకైనా ఓటు వేసుకోవచ్చు. ఇది నా నిండు మనసుతో చెప్తున్నా.