మౌఖిక జానపద కళకు ప్రతీక ఒగ్గు కథ. విలువైన, అరుదైన ప్రాచీన జానపద కళా రూపాల్లో ఇదీ ఒకటి. ఈ శైలిని కథాగాన కళ అనవచ్చు. ఒక కథను ఆలంబనగా చేసుకొని, సంగీత అభినయాల సాయంతో ఉత్సాహంగా ముందుకు సాగుతుంది. ‘ఒగ్గు’ తెలంగాణకే ప్రత్యేకం. వరంగల్, నల్లగొండ, మహబూబ్నగర్, హైదరాబాద్ జిల్లాల్లో ప్రస్తుతం యాభై వరకూ ఒగ్గు కథ కళా బృందాలు ఉన్నాయి.

ఒగ్గు కళాకారుల చేతిలోని ఢమరుకాన్ని ‘ఒగ్గు’ అంటారు. ఆ ఒగ్గును వాయిస్తూ చెప్పే కథలను ఒగ్గు కథలనీ, వాటిని చెప్పే వారిని ‘ఒగ్గులు’ అనీ అంటారు. ఒగ్గు వాద్యాన్ని జెగ్గు, జగ్గు, బగ్గు అనీ వ్యవహరిస్తారు. కథల్లో నాటి సంస్కృతి, జన జీవితం, మానవ సంబంధాలు, మాండలికాలు, సామెతలు, జాతీయాలు, నుడికారాలు.. అంతర్లీనంగా ప్రవహిస్తాయి. కురుమల ఆశ్రిత కులమైన బీర్లవారు ఒగ్గుకథ చెబుతారు. ఒగ్గు కథాగానమే జీవనోపాధిగా బతికే కళాకారులు వీరు. బ్రాహ్మణులతో నిమిత్తం లేకుండా పెండ్లిళ్లనూ జరుపుతారు బీర్లవారు. తరాల ఆనవాయితీ ఇది. ‘మల్లన్న కథ’ చెప్పిన తర్వాతే వివాహం జరిపిస్తారు. వీరికి గ్రామాలు, తాలూకాలు మిరాశీ హక్కులతో సహా ఉంటాయి. ఒకరి హద్దులోకి వచ్చి మరొకరు వివాహాలు చేయకూడదు. అతిక్రమిస్తే కుల బహిష్కారం తప్పదు. బీర్ల వంశాలకు చెందనివారు కనుక ఒగ్గు కథలు ప్రదర్శిస్తే సామాజిక శిక్ష విధిస్తారు. పల్లెల్లో గ్రామదేవతల ప్రతిష్ఠాపన, బీరప్ప, ఎల్లమ్మ, మల్లన్న ఆలయాల ప్రారంభోత్సవాలు, బోనాలు, బతుకమ్మ, ఇతర సామూహిక పండుగల నిర్వహణలో ప్రధానపాత్ర ఒగ్గు పూజారులదే. గొల్ల కురుమల ఇంట్లో వివాహం, పండుగలు, మరణాలు.. ఇలా అన్ని సందర్భాల్లో కొమురవెల్లి, అయినవోలు వంటి శైవ క్షేత్రాల్లో ఈ కథలు చెప్పిస్తారు. నిడివిని బట్టి అయిదు, ఏడు, పదిహేను రోజుల పాటు కథ కొనసాగుతుంది. ఉగ్గు కథలో ప్రధాన కథ, ఉప కథలు ఉంటాయి. డోలు, తాళాల ధ్వనులు లయాత్మకంగా సాగుతూ ప్రేక్షకులను ఉద్రిక్త పరుస్తాయి. ఒగ్గు కథలు వచనాలు, ధాటీలు, మంగళ శాసనాలు, ప్రార్థనలు, సంవాదాల రూపంలో సాగుతాయి.

ఇలా చెబుతారు..
శిల్పపరంగా, శబ్దపరంగా, దృశ్యపరంగా అత్యద్భుతం ఈ శైలి. ఆటపాటల సమ్మిళితమైన ‘గంగ’ ప్రార్థనతో కథ ఆరంభమవుతుంది. గంగమ్మను ‘శాంభవీ రాణి’ అనీ అంటారు. ‘శరణు శరణు మాయమ్మ..రాణీ..శాంభవీ రాణీ.. శాంభవీ రాణీ.. కరుణ చూడు మా కన్నతల్ల్లీ’ అనే గేయంతో ప్రారంభిస్తారు. కథ చెప్పేవారు పాత్రలకు అనుగుణంగా వేషాలు ధరిస్తారు. కథాగాయక బృందంలో నలుగురి నుంచి ఆరుగురి వరకూ ఉంటారు. ఒకరు ప్రధాన కథకుడు, ఇద్దరు వాద్యకారులు, మరొకరు సహాయకుడు. వాద్యకారుల్లో ఒకరు డోలు, మరొకరు తాళాలు వాయిస్తూ వంత పాడుతారు. ప్రధాన కథకుడు గజ్జెలు కట్టుకుని చేతుల్లో ఒగ్గును పలికిస్తూ కథాగానం చేస్తారు. కథకు అనుగుణంగా ముఖ కవళికలను మారుస్తుంటారు. సాధారణంగా గొల్ల కురుమలు ‘మల్లన్న, బీరప్ప, ఎల్లమ్మ కథలు’ ఎక్కువగా చెప్పించుకుంటారు. ఇవే కాకుండా కీలుగుర్రం, కాటమరాజు, పెద్దిరాజు, సువర్ణ సుందరి, సారంగధర, బయ్యమ్మ, కనకతార, గిరిజావతి, నలమహారాజు, చిరుతొండనంబి, మండోదరి, మార్కండేయ పురాణం, కాంభోజ రాజు, అల్లిరాణి, మన్మథరాజు, లింగ మహారాజు, నల్లపోచమ్మ, బాల నాగమ్మ, హరిశ్చంద్ర, లవంగ మహారాజు’ కథలనూ ఒగ్గు కథకులు రసభరితంగా చెబుతారు. వందల ఏండ్ల నాటి ఈ కళారూపం.. ఒగ్గు కళా సమ్రాట్ దివంగత చుక్కా సత్తయ్య కృషితో ప్రపంచ స్థాయికి చేరింది. తెలంగాణ ప్రభుత్వ భాషా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో అనేక శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. ఒగ్గు కథను బతికించుకోవాల్సిన బాధ్యత మనందరిదీ.
అరవింద్ ఆర్య
7997 270 270
