హైదరాబాద్, డిసెంబర్ 5 (స్పెషల్ టాస్క్ బ్యూరో, నమస్తే తెలంగాణ): చీమలు శ్రమ జీవులని తెలుసు. గాయపడ్డ తోటి చీమలకు స్వతహాగా శస్త్ర చికిత్సలు చేసే నైపుణ్యం వీటికి ఉన్నదని కూడా ఇటీవలి పరిశోధనల్లో రుజువైంది. అయితే, తీవ్రంగా జబ్బుపడ్డ చీమలు తమ జాతిని కాపాడుకోవడానికి ప్రాణ త్యాగానికి కూడా వెనుకాడబోవని ఆస్ట్రియా పరిశోధకుల తాజా అధ్యయనంలో వెల్లడైంది.
జబ్బుపడ్డ చీమలు తనను చంపాలంటూ తమ శరీరం నుంచి ఒక రకమైన రసాయనిక వాయువును సందేశంగా తోటి చీమలకు పంపిస్తాయని, ఆ సిగ్నల్స్‌ను అందుకొన్న మిగతా చీమలు.. సదరు జబ్బు పడ్డ చీమను చంపేస్తాయని శాస్త్రవేత్తలు తెలిపారు. ప్రాణాంతక వ్యాధులు వ్యాప్తి చెంది మిగతా చీమలు చనిపోకుండా ఉండేందుకే ఈ ప్రక్రియను బాధిత చీమలు అనుసరిస్తున్నట్టు అభిప్రాయపడ్డారు.
మిగతా చీమల కంటే.. రాణి చీమకు రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉంటుందని, ఒకవేళ, రాణి చీమ జబ్బుపడితే మిగతా చీమలు ఏం చేస్తాయన్న దానిపై తాము ఇప్పుడు లోతుగా పరిశోధనలు చేస్తున్నట్టు పేర్కొన్నారు. ఈ వివరాలు ‘నేచర్ కమ్యూనికేషన్స్’ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి.