మటన్‌తో బిర్యానీ, కూర, పులుసు, ఇగురు.. ఇలా ఎన్ని వంటలు చేసినా బొక్కల షోర్బాకు ఏదీ సాటిరాదు. తలకాయ, కాలు, తుంటి బొక్కలతో పెట్టే పాయ అంటే తెలంగాణ బిడ్డలకు ప్రాణం. మక్క గటక నుంచి పులావ్ వరకు దేనితో తిన్నా తిరుగే ఉండదు.
సోమవారం నుంచి శనివారం వరకు.. ఏం తిన్నా తినకపోయినా, ఆదివారం మాత్రం పళ్లకు గట్టిగా పని చెప్పాల్సిందే. చికెన్, మటన్, చేపలు, రొయ్యలు.. ఏదో ఓ ముక్క కొరకాల్సిందే. మటన్ పీసైతే చెప్పేదేముంది? అందులోనూ మెత్తటి ముక్కలకంటే, బొక్కలంటేనే మక్కువ మాంసాహార ప్రియులకు.
ఐతారం పలారం
మటన్ శరీరానికి ప్రొటీన్లు ఇవ్వడమే కాదు, శరీర నిర్మాణ ప్రక్రియలోనూ తోడ్పడుతుంది. మామూలు మటన్ కంటే, మటన్ సూప్ ఎంతో మేలు చేస్తుంది. మటన్ సూప్ అంటే మరేం కాదు.. కాళ్ల బొక్కలతో పెట్టే షోర్బా. కొన్ని ప్రాంతాల్లో దీన్నే ‘పాయ’ అనీ అంటారు.
మటన్ బొక్కలతో పెట్టిన సూప్‌తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు. ముఖ్యంగా మిరియాలు, ఉలవలు కలిపి చేస్తే పోషకాలు అపారం. ఈ సూప్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. కీళ్ల నొప్పులు తగ్గుతాయి. రోగ నిరోధక శక్తి పెరుగుతుంది.
కొందరు పాయ ఉడికించిన నీటిలో మిరియాలు, ఉప్పు వేసి వేరుగా సూప్ చేసుకుని తాగుతారు.
మాంచి మసాలా దట్టించి వండితే మటన్ రుచిని మరిపిస్తుంది పాయ. ముఖ్యంగా ఎముక లోపలి మజ్జ బాగా ఉడికితేనే, అందులోని పోషకాలు పులుసులోకి దిగి రుచితోపాటు ఆరోగ్యాన్నీ ఇస్తాయి.
పాయ ఎందులో అయినా కలిసిపోతుంది. అన్నం, చపాతీ, సంకటి, గటక, పులావ్, బగారా.. దేనికైనా చక్కని సరిజోడు! నేటి తరాన్ని ఆకట్టుకుంటున్న సంప్రదాయ వంటకాల్లో పాయ కూడా ఒకటి. తెలంగాణలో పాయ ప్రత్యేక వంట. స్టార్ హోటళ్లు సైతం దీన్ని ప్రత్యేకంగా వండి వడ్డిస్తున్నాయి.
మోకాళ్ల నొప్పులతో బాధపడేవారు తరచూ మేక కాళ్ల సూప్ తాగాలని డాక్టర్లు సలహా ఇస్తుంటారు. అంతేకాకుండా, మటన్‌లో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. కొవ్వు తక్కువ, కాల్షియం ఎక్కువ కావడం వల్ల ఎముకలకు, దంతాలకు సత్తువ దొరుకుతుంది.