పన్నెండేండ్లంటే ఆడుతూ పాడుతూ తిరిగే వయసు. కరోనా పుణ్యమాని ఆరుబయట ఆటలే కరువయ్యాయి పిల్లలకు. అందుకే క్యారమ్స్, చెస్ అంటూ ఇంటిపట్టు ఆటల్లో మునిగితేలుతున్నారు. అయితే, న్యూజెర్సీకి చెందిన అభిమన్యు మిశ్రా మాత్రం ఆటలాడుతూనే, అందరితో శభాష్ అనిపించుకుంటున్నాడు. చదరంగంలో తనకు తిరుగులేదని నిరూపిస్తూ అతి పిన్న వయసులో గ్రాండ్ మాస్టర్ హోదా దక్కించుకొన్నాడు. చదరంగంలో భారతీయులకు సాటిలేదని చాటిచెబుతూ అరంగేట్రం నుంచే రికార్డుల మోత మోగిస్తున్నాడు భారత సంతతికి చెందిన అభి. తొమ్మిదేండ్ల
వయసులో.. అమెరికాలోనే అతిపిన్న జాతీయ చెస్ మాస్టర్‌గా నిలిచిన ఈ బుడతడు, పదేండ్లా తొమ్మిది నెలలకే అతిపిన్న అంతర్జాతీయ మాస్టర్‌గా రికార్డుల్ని తిరగరాశాడు. ఇప్పుడు ఏకంగా, అతిపిన్న గ్రాండ్ మాస్టర్‌గా అవతరించాడు.
మధ్యప్రదేశ్‌కు చెందిన హేమంత్, స్వాతి దంపతులు అభిమన్యు పుట్టకముందే అమెరికాలో స్థిరపడ్డారు. తమ కొడుకును చెస్ చాంపియన్‌గా చూడాలని అభి తండ్రి కల. అందుకే, రెండున్నరేండ్లకే చదరంగం గడులను పరిచయం చేశాడు. ఐదేండ్లు వచ్చేసరికి తండ్రిని మించిన తనయుడిగా ఎదిగాడు అభిమన్యు. కొడుకు ఆసక్తిని గమనించిన హేమంత్ అభిని చెస్ అకాడమీలో చేర్పించాడు. కఠోర శిక్షణ ఇప్పించాడు. తనకంటే పెద్దవాళ్ళను సునాయాసంగా ఓడించిన అభి అండర్-9 విభాగంలో ప్రపంచంలోనే అత్యధిక రేటింగ్ కలిగిన ఆటగాడిగా అవతరించాడు. ప్రపంచ చాంపియన్‌గా నిలువడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాడు. ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా!