Vijaya Deepika | బుజ్జాయి బోర్లాపడితే.. భక్ష్యాలు పంచడం సంప్రదాయం. చిన్నారి అడుగులేస్తే.. అరిసెలు ఇవ్వడం ఆచారం. కానీ, ఆ ఇంట చిన్నారి బోర్లా పడితే తల్లికి కంగారైంది. అడుగులేస్తే.. ఏ ఉపద్రవం ముంచుకొస్తుందో అని ఆగమయ్యాడు తండ్రి. పెళుసు ఎముకలతో పుట్టిన తమ బిడ్డను గారాబం చేయాలన్నా ఆలోచించాల్సిన పరిస్థితి. పసిపాప ముద్దొచ్చి గట్టిగా హత్తుకుందామన్నా అవకాశం లేని దుస్థితి. వింత సమస్యతో పుట్టిన ఆ చిన్నారి.. పద్నాలుగేండ్ల వయసులోనే అద్భుతాలు చేస్తున్నది. టేబుల్ టెన్నిస్ కోర్టు దగ్గర సివంగిలా రెచ్చిపోతున్నది. రెండేండ్లలోనే ఆటలో నైపుణ్యం సాధించి పతకాల వేట కొనసాగిస్తున్న విజయ దీపిక.. గెలుపు గీతిక ఇది.
2010లో ఓ రోజు.. ఓ తల్లి పురిటి నొప్పులు పడుతున్నది. ఆమె సుఖ ప్రసవం కోసం వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ఓ పసికందు భూమ్మీదికి రావడానికి నానా యాతన అనుభవిస్తున్నది. వైద్యులు అతి జాగ్రత్తగా బిడ్డను తీసేందుకు ఉపక్రమించారు. అంతలోనే ఏదో అనుమానం! ఈ లోకంలో ఆ శిశువు తొలిశ్వాస తీసుకోకముందే.. దూది కన్నా మెత్తనైన శిశువు శరీరంలో ఓ ఎముక విరిగింది. వైద్యుల మృదువైన పట్టును సైతం ఆ చిట్టితల్లి ఎముక తట్టుకోలేకపోయింది. ఆనాడు పురుడు పోసుకున్న మహిళ పేరు అరుణ. తన కడుపు పండిందన్న సంబురంలో ఉండగానే.. పుట్టిన బిడ్డకు ఏదో జబ్బు ఉందని తెలిసి ఆ తల్లి తల్లడిల్లిపోయింది.
బిడ్డను అలా గాల్లోకి ఎగిరేస్తూ, అందుకుంటూ.. ఆకాశమంత ఆనందం పొందాలనుకున్న ఆ తండ్రిపేరు విజయ భాస్కర్. అతనికీ అలాంటి అవకాశం లేదని అర్థమైంది. ఈ ఇద్దరి నోముల పంట ఆస్టియో జెనెసిస్ ఇంపెర్ఫెక్టా (అసంపూర్ణ ఎముకల నిర్మాణం) జబ్బుతో పుట్టింది. ఈ వ్యాధిని ‘బ్రిటిల్ బోన్’ అని కూడా పిలుస్తారు. ఈ సమస్య ఉన్నవారి ఎముకలు పెళుసుగా మారుతాయి. తేలికగా విరిగిపోతుంటాయి. తమంతట తాము నిలబడలేరు. మరొకరి సాయం లేకుండా ఒకచోటు నుంచి ఇంకోచోటుకు కదలలేరు. వీరిపై ఏ కొద్దిపాటి బలప్రయోగం జరిగినా ఎముకలు కట్టె పుల్లల్లా విరిగిపోతుంటాయి. బ్రిటిల్ బోన్ వ్యాధిలో మొత్తం 8 రకాలు ఉంటాయి. అందులో ఈ చిన్నారి టైప్ 1, 3, 4తో భూమ్మీదికి వచ్చింది.
‘మీ అమ్మాయిని గాజుబొమ్మ కన్నా పదిలంగా చూసుకోవాలి. కంటికి రెప్పలా కాపాడుకోవాలి’ అన్నారు వైద్యులు. ఆ మాటలకు అరుణ, విజయ భాస్కర్ దంపతుల గుండెల్లో అగ్నిపర్వతం బద్దలైనంత పనైంది. కానీ, ఆ పసిగుడ్డు బోసినవ్వు వారి మనసుల్లోని ఆందోళనను అమాంతం ఎగరగొట్టింది. భారంగా తెరిచిన ఆ చిన్నారి కండ్లలో ఏదో మహత్తు ఉందనిపించింది. తమ ఇంటి మహాలక్ష్మికి ఏ కష్టమూ రాకుండా పెంచుకోవాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నారు. పుట్టుకతో ఓడిపోయినా.. జీవితంలో నెగ్గాలని తమ బిడ్డకు ‘విజయ దీపిక’ అని నామకరణం చేశారు.
ఎంత అపురూపంగా పెంచుకున్నా తమ కూతురు రెక్కలు తొడగదని ఆ తల్లిదండ్రులకు తెలుసు. నడవలేదనీ తెలుసు. పైగా నాలుగైదు నెలలకు ఒకసారి కాలో, చేయో ఫ్రాక్చర్ అయ్యేది. చిన్నారి చేతులకు కట్లు చూసినప్పుడల్లా.. వారిలో దుఃఖం కట్టలు తెంచుకునేది. ఈ పద్నాలుగేండ్లలో విజయ దీపికకు 45 సార్లు ఫ్రాక్చర్స్ అయ్యాయంటే ఆశ్చర్యం కలుగక మానదు. చక్రాల కుర్చీకే పరిమితమైన పాపాయికి అనుక్షణం అండగా ఉన్నారు అరుణ, భాస్కర్.
భాస్కర్ డిఫెన్స్ అకౌంట్స్ డిపార్ట్మెంట్లో సీనియర్ ఆడిటర్. అరుణ గృహిణి. వీరిద్దరికీ క్రీడా నేపథ్యం ఉంది. దీపిక అన్నయ్య విజయ్ తేజ్ టెన్నిస్ ప్రాక్టీస్ చేసేవాడు. అన్నను చూస్తూ అల్లారుముద్దుగా పెరిగిన దీపికకూ ఆటపైకి మనసు మళ్లింది. టెన్నిస్ రాకెట్‌తో కోర్టులో రాకెట్లా దూసుకుపోతున్న అన్నయ్య ఆమెకు మొదటి ఆదర్శం. పదేండ్ల వయసులో ఉన్నప్పుడు మొదటిసారి తనకూ ఆడాలనిపించింది. అదే విషయం తల్లిదండ్రులకూ చెప్పింది. ‘ఎందుకమ్మా!’ అనలేదు. ‘నీకు సాధ్యం కాదు’ అని వెనక్కి నెట్టలేదు. ‘తప్పకుండా తల్లీ!’ అని ప్రోత్సహించారు. ఫలితంతో పనిలేకుండా.. హైదరాబాద్‌లోని యాప్రాల్‌లో ఉన్న పింగ్‌పాంగ్ అకాడమీలో బిడ్డను చేర్పించారు. అక్కడ పారా టేబుల్ టెన్నిస్‌లో శిక్షణ తీసుకోవడం మొదలుపెట్టింది దీపిక.
ఎముకల్లో లేని పట్టు.. ఆమె ఆత్మవిశ్వాసంలో అడుగడుగునా కనిపిస్తుంది. ఏడాదిలో ఆటపై పట్టు సాధించింది. రెండేండ్లలోనే జాతీయస్థాయి పారా క్రీడల్లో రజత పతకం సాధించింది. గత ఫిబ్రవరిలో ఇండోర్‌లో జరిగిన 2వ పారా టేబుల్ టెన్నిస్ నేషనల్ ర్యాంకింగ్ టోర్నమెంట్లో డబుల్స్‌లో సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. మరుసటి నెలలో జరిగిన పారా నేషనల్ ర్యాంకింగ్ చాంపియన్‌షిప్‌లో సింగిల్స్ కేటగిరీలో రన్నర్‌గా నిలిచింది. ఫైనల్స్‌లో ఒలింపిక్ సిల్వర్ మెడలిస్ట్ ఫవీనా బెన్ పటేల్ (గుజరాత్)కు గట్టి పోటీనిచ్చి సార్థక నామధేయురాలు అని నిరూపించుకుంది విజయ దీపిక.
కేవలం రెండేండ్ల శిక్షణతో విజయ దీపిక ప్రపంచ స్థాయి 7వ ర్యాంకింగ్‌లో ఉన్న క్రీడాకారిణితో హోరాహోరీ పోరులో రజత పతకం గెలవడం అద్భుతమే! మెరుపు వేగంతో వచ్చే బంతిని చురుగ్గా అవతలి కోర్టులోకి పంపడం చెప్పినంత తేలికేం కాదు! అందులోనూ శారీరక రుగ్మతను అధిగమించి ప్రత్యర్థిని నిలువరించడానికి ప్రతిభ ఒక్కటే సరిపోదు. అంతకుమించిన మనోబలం కావాలి. ఆ విషయంలో దీపిక ఓ మెట్టు పైనే ఉంటుంది. ఏది చెప్పినా క్షణాల్లో నేర్చుకోవడం ఆమె ప్రత్యేకత. బడికి కూడా వెళ్లని ఈ అమ్మాయి… హిందీ, ఇంగ్లిష్ భాషల్లో అనర్గళంగా మాట్లాడగలదు. కుంచె అందుకుంటే.. ఎలాంటి కాన్వాస్‌పై అయినా కనువిందైన బొమ్మ వేయగలదు.
అందంగా పాడగలదు. అద్భుతంగా కథలు రాయగలదు. టేబుల్ టెన్నిస్ దగ్గరికి వచ్చేసరికి.. అనితర సాధ్యమైన విన్యాసాలు ప్రదర్శిస్తుంది. పతకాల వేటలో ఆమె ప్రయాణం ఇప్పుడిప్పుడే మొదలైంది. జాతీయ, అంతర్జాతీయ ఈవెంట్లలో పాల్గొనేందుకు సన్నద్ధం అవుతున్నది. లోపం శరీరానికే కానీ, మనసుకు కాదని నిరూపిస్తున్న విజయ దీపిక విజయ గాథ.. ఎందరికో ఆదర్శం! తమ కూతురు సాధించిన, సాధిస్తున్న విజయాలు అరుణ, భాస్కర్‌కు గొప్ప ఊరటనిస్తున్నాయి. చిన్నారి దీపికను ఒళ్లోకి తీసుకుంటున్నప్పుడు బరువెక్కిన వారి గుండెలు ఇప్పుడు గర్వపడుతున్నాయి.
– నరేశ్ ఆరుట్ల