మహిళల వేలికొనలో అమృతం ఉంటుందేమో. ఆ గాజుల చేతులతో ఏం వండినా అద్భుతమే. ఆ ఘుమఘుమలకు నలభీములు సైతం నాలుక తడుపుకోవాల్సిందే. అందులోనూ అప్పాలు మా గొప్ప రుచి! కాబట్టే, సుల్తాన్పూర్ మహిళలు ఓ బృందంగా ఏర్పడి.. అప్పాల తయారీకి పూనుకున్నారు. తీయనైన ఉపాధి మార్గం ఎంచుకున్నారు. కస్టమర్ల మనసులూ గెలుచుకున్నారు.
ఏ శుభకార్యం జరిగినా పిండి వంటలు చేసు కోవడం.. కుటుంబసభ్యులు, బంధు మిత్రులతో కలిసి ఆరగించడం తెలంగాణ సంప్రదాయం. ఎంతమందికి వడ్డిస్తే అంత ఆనందం ఇల్లాలికి. వడ్డన సరే, వండేది ఎవరు? అన్నన్ని అప్పాలు చేసే తీరిక ఎవరికుంది? దీంతో ‘ఆర్డర్’లు అనివార్యం అవుతున్నాయి. దీన్నో వ్యాపార అవకాశంగా మార్చుకున్నారు పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్ మహిళలు. ఆ అక్కలు చేసిన అప్పాలు దేశవిదేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ఈ రుచుల విజయం వెనుక సమష్టి కృషి ఉంది. పదిహేనేండ్ల క్రితం.. సుల్తాన్పూర్ సమీపంలోని కాట్నపల్లిలో ఓ వివాహం జరిగింది. దగ్గరి బంధువులు కావడంతో.. అదే గ్రామానికి చెందిన వెల్ది బుజ్జక్క (సత్యమ్మ), కొత్తపల్లి భాగ్యలక్ష్మి, కొత్తపల్లి సావిత్రమ్మ వెళ్లి అప్పాలు చేశారు. అద్భుతంగా కుదిరాయి. ఆ చేతుల మహత్తు గురించి ఊరంతా తెలిసిపోయింది.
మండల కేంద్రం వరకూ వెళ్లింది. ‘మాకూ చేసివ్వరా..’ అంటూ చాలామందే అడిగేవారు. అడిగిన వాళ్లకంతా చేసిచ్చారు కూడా. క్రమంగా అదో వ్యాపారంగా మారింది. బంధువులు, కుటుంబ సభ్యులతోపాటు.. సుల్తాన్పూర్ గ్రామానికి చెందిన మరో పది మంది సభ్యులతో బృందంగా ఏర్పడి.. ఇంటి దగ్గరే అప్పాల తయారీ మొదలుపెట్టారు. పాకశాస్త్ర నైపుణ్యాన్నే పెట్టుబడిగా పెట్టారు. క్రమంగా ఆర్డర్స్ పెరుగుతూ వచ్చాయి. ఇప్పటికే రూ.60 లక్షల వార్షిక టర్నోవర్కు చేరుకుంది. అప్పాలు కాల్చడానికి, పిండి తయారీకి, సకినాలు చుట్టడానికి.. ఇతర పనులకు రోజువారీ శ్రామికులను తీసుకుంటారు. ఈ బృందం స్ఫూర్తితో గ్రామంలో మరో ఆరు సంఘాలు ఏర్పడ్డాయి. ఒకో గ్రూప్లో పది మంది సభ్యులు, యాభై మంది శ్రామికులతోపాటు.. పిండి గిర్ని సిబ్బంది, ట్రాలీ డ్రైవర్లు, కట్టెలు కొట్టేవారు. ఇలా అంతా కలిపి 350 మందికి పైగా ఉపాధి పొందుతున్నారు. రోజు కూలీ ఐదొందల రూపాయల వరకూ పడుతున్నది. ఇంత స్థిరమైన ఆదాయం ఎక్కడా లభించదు. ముచ్చట్లు చెప్పుకొంటూ పనిచేస్తారు కాబట్టి, శ్రమ తెలియదు.
సుల్తాన్పూర్ అప్పాలు ఎంతో రుచి, అంతే శుచి. అడిగితే చాలు.. 40 వరుసలతో చక్రాలను తలపించే భారీ సకినాలను కూడా చేసిస్తారు. సకినాల్లోనూ పచ్చికారం సకినాలు, పండుకారం సకినాలు, తెల్ల సకినాలు.. ఇలా అనేక రకాలు. కిలో పరిమాణంలో బూందీ లడ్డూ, కరిజలు, నువ్వుల లడ్డు, అరిసెలు, చేగోడీలూ, మురుకులు, కారంపూస, కార, గవ్వలు, పల్లి, పప్పు గారెలు.. పెద్ద ఎత్తున తయారు చేస్తారు. సుల్తాన్పూర్ అప్పాలు
అమెరికా, ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా వంటి దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. ప్రవాసులు కోరికోరి తెప్పించుకుంటున్నారు. ఏపీ, మహా రాష్ట్రలోని పలు ప్రాంతాలకు ఆర్డర్స్ మీద సరఫరా చేస్తున్నారు.
సుల్తాన్పూర్ మహిళలు ఆధునిక సాంకేతికతను వినియోగించుకుంటున్నారు. ఎవరికి ఏ రకమైన అప్పాలు కావాలన్నా.. ఫోన్ చేసి అడ్వాన్స్ డబ్బు ఆన్లైన్ ద్వారా పంపితే చాలు. చెప్పిన సమయానికి, చెప్పిన చోటుకు చక్కగా ప్యాక్ చేసి పంపుతారు. వీవీఐపీల ఫంక్షన్లలోనూ సుల్తాన్పూర్ అప్పాలు ఘుమఘుమ లాడతాయి. ‘ప్రత్యేకించి మాకంటూ ఓ బ్రాండ్ లేకపోయినా తెలిసిన వారి నుంచి ఆర్డర్స్ తీసుకుని.. నాణ్యమైన అప్పాలను తయారు చేసి ఇస్తున్నాం. మాకు రోజురోజుకూ ఆదరణ పెరుగుతున్నది’ అని చెబుతారు టీమ్ లీడర్ వెల్ది బుజ్జక్క(సత్యమ్మ). వివాహాల సీజన్లో వ్యాపారం మరింత ఎక్కువగా ఉంటుంది. అందరూ ఒకే రకమైన నాణ్యతా ప్రమాణాలు పాటిస్తారు కాబట్టి.. ఇలాంటప్పుడు ఇతర గ్రూపులతో ఆర్డర్లు పంచుకుంటారు సుల్తాన్పూర్ మహిళలు. ‘మాదంతా ఒకటే కుటుంబం. ఇంటిపని పూర్తికాగానే మాలో ఎవరో ఒకరి ఇంట్లో కూర్చుని అప్పాల పని పూర్తిచేస్తాం. సకాలంలో అందిస్తాం’ అని చెబుతారు కొత్తపల్లి భాగ్యలక్ష్మి, కొత్తపల్లి సావిత్రమ్మ అనే సభ్యులు. ఇప్పుడు, పెద్దపల్లి జిల్లాలోని చాలా ప్రాంతాల్లో సుల్తాన్పూర్ అప్పాలు లేకపోతే.. అది విందే కాదు!
…? అంకరి ప్రకాశ్
– తూర్పాటి శ్రీనివాస్